సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-706
శిరోవేష్టనేన నాసికా స్పర్శ న్యాయము
******
శిర అనగా తల.అవేష్టనేన అనగా చుట్టబడిన. నాసికా అనగా ముక్కు. స్పర్శ అనగా పంచేంద్రియాలలో ఒకటైన చర్మము తాకినప్పుడు కలిగే అనుభూతి.తల్లి స్పర్శకు బిడ్డలలో అనేక మానసికమైన అనుభూతులను పొందుట అని అర్థము.
" శిరోవేష్షనేన నాసికా స్పర్శ " అనగా "శిరోవేష్టనేన నాసికా అంగుల్యా నాసికా ప్రవేశవత్"అనగా నీ ముక్కును చూపు అని అడిగితే తలచుట్టూ చేతిని చుట్టి లేదా తిప్పి చేతితో ముక్కును చూపినట్లు అని అర్థము.
ఇందులో కొంత హాస్యం, మరికొంత అమాయకత్వం కలగలిపి ఉంది. ప్రాణాయామం చేసేటపుడు కూడా కొందరు ఇలా చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వారు అడిగిన ప్రశ్నకు ఏదీ సరిగా చెప్పరు. అంతా డొంకతిరుగుడు సమాధానాలే. ఏదైనా పని చేయాలంటే మొత్తంగా అవగాహనతో చేయకుండా ముక్కలు ముక్కలుగా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా చేస్తుంటారు.
 పొరపాటున వీరికి ఏదైనా పని అప్పగిస్తే ఇంతే సంగతులు.జారుడు బండమీద బట్టలు ఆరేసినట్లే. అక్కడ వేస్తుంటేనే జారుతామని చెప్పినా రెండడుగులు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా పట్టువదలకుండా చేసే ప్రయత్నంలో ఉంటారు.
ఇక ఏదైనా ప్రశ్న అడిగితే సంబంధం లేని పూర్వపరాలను కలిపి చెప్పడంతో అసలు విషయం మరుగున పడిపోతుంది .అడిగిన వారికి తాము ఏమి అడిగింది మరిచిపోయే స్థితికి వచ్చేట్టు చేస్తారు.
 ఇలాంటి వారిని ఉద్దేశించే మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.ద్రవిడులు చేసే ప్రాణాయామం కూడా ఇంచుమించు ఇలాగే వుంటుందట.
 కొసమెరుపు ఏమిటంటే వీరి వల్ల ఇతరులకు ఎలాంటి హానీ, యిబ్బంది కలుగదు కానీ వారికే నష్టం వాటిల్లుతుంది.అలా నష్టపోయామన్న ఆలోచన కూడా వారికి వుండదు.
 మరి ఈ "శిరోవేష్టనేన నాసికా స్పర్శ న్యాయము "ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏమిటో తెలిసింది. ముఖ్యంగా మనలో కాస్తోకూస్తో అమాయకత్వం ఉంటే, డొంకతిరుగుడు పనులు చేస్తూ వుంటే వాటిని సరిచేసుకొని, అమాయకత్వాన్ని నెమ్మదిగా వదిలించుకునే ప్రయత్నం చేస్తే మనకూ లాభం. ఇతరులకు ఇబ్బంది లేకుండా వుంటుంది.అంతే కదండీ!.

కామెంట్‌లు