సునంద భాషితం:-వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-705
శవోద్వర్తన న్యాయము
******
 శవ అనగా పీనుగ ఉద్వర్తన అనగా పెంచుట, పెంపు, పైకి పోవుట, పెరుగుదల, అభివృద్ధి, ప్రక్కకు దొరలుట,నలుగు పెట్టుట అనే అర్థాలు ఉన్నాయి.
"శవమును లేపుచూ అటూ ఇటూ పొర్లించినట్లు,అలంకరించినట్లు" అనగా నిష్ప్రయోజనమైన పని అని, దాని వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అర్థము.
ఇది వినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు.శివ శివా అని స్మరిస్తూ చెవులు మూసుకుని" అమంగళం ప్రతిహతం అవుగాక" అంటుంటారు.అనగా అమంగళం అనగా చెడు లేదా కీడు జరుగకుండు గాక!" అని ఆశీర్వచనం పలుకుతుంటారు.
అలా వినడానికి ఇష్టపడరు కానీ  'చచ్చే చావొచ్చింది', చచ్చిందాక చేస్తున్నాను, "చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం", "చావు మరణమైంది",చచ్చినా చేయను"" ఇలా మరణం మీద వంద రకాల మాటలను యథేచ్ఛగా  వాడుతూ ఉండేవాళ్ళను  నిత్య జీవితంలో  మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తుంటాం.
మరణమనేది ఉచ్ఛరించడానికి భయపడ్డా పడకపోయినా తప్పనిది.మరి దాని తర్వాత కుటుంబ సభ్యులు చేసే కార్యక్రమాలు ఉంటాయి. అవేమిటో ఈ న్యాయమును ఏ ఉద్దేశంతో పెద్దవాళ్ళు సృష్టించారో చూద్దాం.
మరణించిన తరువాత శవానికి అంత్యక్రియలు చేసేముందు కార్యక్రమాలు  ఆయా ప్రాంతాలు, కులాలు, మతాలను బట్టి ఉంటాయి.మరణించిన వ్యక్తుల్లో భర్త ఉన్న స్త్రీ చనిపోతే చాలా అదృష్టంగా భావిస్తారు.శవానికి పసుపు, కుంకుమ, పూలతో పాటు పట్టువస్త్రాలతో అలంకరిస్తారు.
ఇక స్మశానానికి తీసుకుని వెళ్ళేటప్పుడు మధ్యలో ఓ మూడు సార్లు పాడెను కిందికి దించి దాని చుట్టూ మూడు సార్లు తిరిగి చెవి దగ్గర నోరు పెట్టి పేరు పెట్టి పిలుస్తారు.అలా పిలవడం వల్ల ఆ వ్యక్తి జీవించి వుంటే ఆ పిలుపుతో లేచి కూర్చుంటాడనే ఆశ.
 ఎన్ని అలంకారాలు చేసినా, అటూ ఇటూ పొర్లించినా,దొర్లించినా నిజంగా చనిపోయిన తర్వాత ఎవరూ తిరిగి బతకరు.
 ఎప్పుడో,ఎక్కడో అరుదుగా స్మశానానికి తీసుకుని వెళ్ళిన వ్యక్తి పాడె మీంచి లేచాడని/ లేచిందనే వార్తలను వింటుంటాం. కానీ 99.9% ఒకసారి మరణించిన తరువాత మళ్ళీ బ్రతకడం అసాధ్యం.
అయితే నమ్మకాలను కాదనలేం కదా! అలాంటిదే ఈ "శవోద్వర్తన న్యాయము". మరి ఇంత బాధాకరమైన అంశాన్ని కూడా ఓ న్యాయంగా చెప్పడంలో మనవాళ్ళ ఆంతర్యం ఏమిటో చూద్దాం.
 కొందరు చేసే పనులు, చేతలు మళ్ళీ ఉపయోగపడనంతగా చెడగొట్టబడి వుంటాయి. "పగిలిన సీసా( ముక్కలైన) మళ్ళీ మామూలు స్థితికి రానట్టే" చేసే పనుల్లో చిత్త శుద్ధి లోపిస్తే పనులు లోపభూయిష్టంగానూ, తిరిగి చక్కబెట్టలేనంతగానూ పాడైపోయినప్పుడు ఇలాంటి న్యాయమును  మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు. 
అనగా ఎలాంటి ప్రయోజనం లేదు కానీ చూసేవారికి ఉన్నట్టు వాతావరణం సృష్టిస్తారు.
ఇదెలాంటిది అంటే "మనున్నప్పుడు ( బతికున్నప్పుడు)మంచి నీళ్ళు కూడా పోయని వారు చచ్చిన తర్వాత సమాధిని అలంకరించిట్లు" గా ఉంటుందన్న మాట.
ఇలా పెద్ద వాళ్ళ మాటల్లో నిజాలు ఏమిటంటే "వ్యర్థపు చేతలు చేయడం కాదు సమర్థపు చేతలు చేయాలనే హెచ్చరిక,సూచన  ఇందులో ఇమిడి ఉంది.

కామెంట్‌లు