నిను చూసే తొందరలో
మును ముందే విరబూసి
మునివేళ్లపై నిలుచుని
తనివారగ చూసే చిరు కుసుమపు
మెరుపులన్ని నీవేలే!
నీ జిలుగులు ఒడిసిపట్టి
తొలివెలుగుల సానపెట్టి
మిలమిలగ మెరిసిపోతు
కదలాడే చిగురుటాకుల
కళలన్ని నీవేలే!
నిశి రాతిరి కురిసినట్టి
హిమ కణములు పోగుచేసి
పాదముల కడగాలని
తలపైనే మోస్తున్న గరిక
సొగసు నీదేలే!
నీ రాకతో పులకించి
మనసారా స్వాగతించ
జగతినంత మేలుకొలిపే
చిన్ని గువ్వల కిలకిలలో
రాగమంతా నీకేలే!
వెలుతురంతా చుట్టుకుని
నవవధువులా కళకళగా
అందాలు చిందు చిరునవ్వుల
వెలిగిపోతున్న భువి పాడే
భూపాలం నీకోసమే!
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి