ఒక ఊరిలో శంకరయ్య అని ఒక పెద్ద రైతు వున్నాడు. ఆయన చాలా నిజాయితీ పరుడు. ఎవరిమీదా ఆధారపడకుండా అన్ని పనులు తానే దగ్గరుండి సొంతంగా చేసుకునేవాడు. ఆయనకు అచ్చం నెమలీక లాంటి ముచ్చటైన కూతురుంది. ఆ పిల్ల నెమ్మదిగా పెరిగి పెద్దగయి పెళ్ళికి సిద్ధమైంది.
ఆ పాపకు నవీన్, సురేష్ అని వరుసకు ఇద్దరు బావలున్నారు. ఇద్దరికీ ఆ పిల్లను పెళ్ళి చేసుకొని వాళ్ళింటి గడప తొక్కించాలని ఒకటే ఆశ. దాంతో ఒకరోజు శంకరయ్య ఇంటికి వచ్చి మా ఇంటిలో దీపం వెలిగించడానికి మీ పిల్లను ఇవ్వమని అడిగారు.
ఇద్దరూ బంధువులే. ఇద్దరూ మంచివాళ్ళే. ఇద్దరూ అందగాళ్లే. ఇద్దరూ చదువుకున్నవాళ్ళే.
దాంతో శంకరయ్య ఆలోచనలో పడ్డాడు. బాగా ఆలోచించి "చూడండి. రేపటి లోపల మీ ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ ధనం సంపాదించి నా చేతిలో పెడతారో... వాళ్ళ చేతిలో నా కూతురిని పెడతా" అన్నాడు.
ఇద్దరూ “సరే" అని తలా ఒక దిక్కు బైలుదేరారు.
నవీన్ ఆలోచించసాగాడు. 'ఒక్క రోజులో ఎంత సంపాదిస్తాం. ఎంత కిందా మీదా పడినా ఒకటో, రెండో బంగారు వరహాలకు మించి ఎక్కువ దొరకదు. మరి ఎవరూ ఊహించనంత ఎక్కువ ఎలా సంపాదించాల' అని ఆలోచిస్తావుంటే అడవిలోని మర్రిచెట్టు మతికి వచ్చింది. దానిమీద దయ్యాలున్నాయని అందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. చీకటి పడితే చాలు ఎవరూ పొరపాటున గూడా అటువైపు అడుగు పెట్టరు. కానీ ఆ దయ్యాలు ఎవరినీ, ఎప్పుడూ, ఏమీ చేసినట్టుగా ఎవరూ చెప్పలేదు. దాంతో ఆ దయ్యాల దగ్గరికిపోయి ఏదైనా సహాయం అడుగుదామా అనుకున్నాడు. ఒక్క క్షణం భయమేసింది. కానీ సాహసం చేస్తేనే గదా విజయం వరించేది. దాంతో ఏదైతే అదైతుందని అడవివైపు అగుగులేశాడు. చీకటిపడే సమయానికంతా ఆ మర్రిచెట్టు దగ్గరికి చేరుకుని దాని కింద కూర్చొని దయ్యాలకోసం ఎదురు చూడసాగాడు.
అర్థరాత్రి అయ్యేసరికి ఎక్కడెక్కడి దయ్యాలన్నీ ఆ చెట్టుమీదికి చేరుకున్నాయి. అవి వీన్ని చూసి “ఎవడబ్బా వీడు. సక్కగా వచ్చి మన చెట్టు కిందనే కూచున్నాడు. మన గురించి ఏమీ తెలియదేమో" అనుకున్నాయి.
అంతలో నవీన్ చెట్టు పైకి చూసి “ఓ దయ్యం మామలూ... మీరు ఈ చెట్టుమీద వున్నది నాకు తెలుసు. దయచేసి ఒక్కసారి కిందికి రండి. నా పెళ్ళికి సాయం చేయండి. ఒక్క పెళ్ళి చేస్తే వంద మంచి నీళ్ళ బావులు తవ్వించినంత పుణ్యం వస్తుందంట. దాంతో మీ పాపాలన్నీ తొలగిపోయి ఈ దయ్యం బతుకు తప్పిపోతుంది" అని గట్టిగా అరిచాడు.
ఆ మాటలు విన్న దయ్యాలు “అరే... ఇదేదో భలేగుందే. విషయమేమిటో వివరంగా కనుక్కుందాం పాండి" అనుకుంటూ సంబరంగా తోకలూపుకుంటా కిందికి దిగినాయి. నవీన్ వాటిని చూసి మొదట భయపడినా, అన్నీ చిరునవ్వుతో, ప్రశాంతమైన మొహంతో దేవతలకన్నా అందంగా వుండడం చూసి ధైర్యం తెచ్చుకున్నాడు.
అప్పుడా దయ్యాలు "మా పేరు చెబితేనే చాలు అందరూ ఆరు మైళ్ళు ఆగకుండా పంచెలు పైకెగ్గట్టి పారిపోతారు. ఇక కనబడితే అంతే... అక్కడికక్కడే గుండె పగిలి నరకలోకపు దారి పడతారు. కానీ నువ్వేంది ఇంత ధైర్యంగా ఒక్కనివే వచ్చావ్. రావడమే గాక ఏకంగా మమ్మల్నే సాయం చేయమని అడుగాతా వున్నావు. ఏందీ నీ కథ" అని అడిగాయి.
నవీన్ చిరునవ్వు నవ్వి “ఓ దయ్యం మామలూ... మీరందరూ చాలా మంచివాళ్ళనీ, చీమకు గూడా హాని చెయ్యరనీ నాకు తెలుసు. అందుకే వెదుక్కుంటా వచ్చా అంటూ జరిగిందంతా చెప్పి మీ దగ్గర బంగారం ఏమయినా వుంటే ఇవ్వండి. దాంతో మా పెళ్ళి జరుగుతుంది. ఇద్దరు మనుషుల్ని కలిపి మూడు ముళ్ళు వేయిస్తే వెయ్యి చెట్లు పెంచినంత పుణ్యం వస్తుందంట. దాంతో మీ దయ్యాల జన్మ పోయి సక్కగా స్వర్గానికి సర్రున పోవొచ్చు" అన్నాడు.
ఆ దయ్యాలు కాసేపు ఆలోచించి "నీ మాటలు మాకు బాగా నచ్చాయి. మేము ఏమీ చేయకపోయినా మమ్మల్ని చూసి భయపడి గుండె ఆగి సచ్చినోళ్ళు చానా మంది వున్నారు. వాళ్ళ వంటి మీది బంగారమంతా ఒకచోట దాచిపెట్టినాం. అది తీసుకుపోయి హాయిగా పెళ్ళి చేసుకో. మళ్ళా ఇటువైపు ఎప్పుడూ రాకు” అంటూ వాని చేతిలో కొంత బంగారాన్ని పెట్టాయి.
వాడు సంబరంగా దాన్ని తీస్కొని ఆ దయ్యాలకు వంగి వంగి నమస్కారాలు చేస్తా ఇంటి దారి పట్టాడు.
సురేష్ రెండవ వైపు బైలుదేరాడు. అలా పోతావుంటే వాన పడుతుందేమో అన్నట్టుగా నెమ్మదిగా ఆకాశమంతా నల్లమబ్బులు కమ్ముకోసాగాయి. దారిలో ఒకచోట ఒక ముసలి రైతు ఒక్కడే పొలంలోని ధాన్యాన్ని వేగంగా బస్తాల్లోకి ఎత్తుతా వున్నాడు. ఒళ్ళంతా చెమటతో తడిచి ముద్దయిపోయింది. అయినా అలాగే పనిచేస్తా వున్నాడు. అది చూసి సురేష్ "ఏం రైతన్నా... ఒక్కనివే కష్టపడతా వున్నావు. ఎవరినైనా కూలీకి పిలుచుకోగూడదా" అన్నాడు.
రైతన్న పని అపకుండా “ఏం చేద్దాం నాయనా... తలరాత ఈ రోజు ఇట్లా వుంది. నేను అలసి ఆలస్యంగా నిద్రలేచేసరికి ఊరిలో కూలీలంతా పక్క ఊరికి పనుల కోసం పోయినారు. ఎంత వెతికినా ఎవరూ దొరకలేదు. చూస్తే రాత్రికి వాన దంచికొట్టేటట్లు వుంది. కష్టపడి పండించిన పంటంతా మన్నులో కలిసిపోయేటట్టుంది. అందుకే ఎంత వీలైతే అంత కాపాడుకుందామని ఒక్కన్నే పనిలోకి దిగినా" అన్నాడు.
దానికి సురేష్ “సరే... నీ పనిలో నేను కూడా చేయి వేస్తా.. నీకు తోచింది ఇవ్వు" అంటూ పనిలోకి దిగాడు. యువకుడు కావడంతో వేగంగా పని చేయసాగాడు. సాయంకాలనికంతా ధాన్యాన్ని బస్తాలకు నింపి బండికెత్తి ఇంటికి చేర్చారు. అలా చేర్చిన అరగంటకంతా నింగినీ నేలనూ ఏకం చేసేటట్లు పెద్దవాన అరగంట సేపు ఆగకుండా ఊరినీ, పొలాలను ముంచెత్తింది. అది చూసి ఆ ముసలి రైతు "నాయనా... సరైన సమయంలో నీవు గనక రాకపోతే నెత్తిన గుడ్డేసుకునేటోన్ని. ఎంతిచ్చినా నీ ఋణం తీర్చుకోలేను" అంటూ సంబరంగా చేతిలో ఒక బంగారు వరహా పెట్టాడు.
తరువాత రోజు ఇద్దరూ శంకరయ్య ఇంటికి చేరుకున్నారు. ఒక్కరోజులో తాము సంపాదించినది అతని ముందు పెట్టి దానిని ఎలా సంపాదించామో వివరంగా చెప్పారు.
శంకరయ్య కాసేపు కిందామీదా పడి బాగా ఆలోచించి “నేను నాకూతురిని సురేష్ కి ఇచ్చి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నవీన్ అదృష్టాన్ని నమ్ముకొని అడవివైపు అడుగులు వేశాడు. కానీ అదృష్టం ఎప్పుడూ మనవైపే వుండదు. అది బురదమట్టలా ఒకరి చేతుల్లోంచి ఇంకొకరి చేతుల్లోకి సర్రున జారిపోతా వుంటుంది. ఉచితంగా వచ్చే ధనం ఈ రోజు రావొచ్చు. రేపు పోవచ్చు. కానీ పనిని నమ్ముకున్నవాడు. ఎప్పటికీ ఓడిపోడు. ఎడారిలోనైనా సేద్యం చేయగలడు. సుడిగాలిలోనైనా దీపం వెలిగించగలడు. ప్రపంచంలో ఎక్కడ వదిలినా ఏదో ఒక పని చేసుకుని బ్రతకగలడు" అన్నాడు.
అంతలో శంకరయ్య పెళ్ళాం అక్కడికి వచ్చింది. “నువ్వు చెప్పింది నాకు అంత న్యాయంగా అనిపించడం లేదు. నవీన్ ఇక్కడ శ్రమనుగాక తెలివితేటలను ఉపయోగించాడు. ఒక రోజులో ఎవరు ఎంత కష్టపడినా ఒకటి రెండు వరహాలకంటే ఎక్కువ సంపాదించలేరు. కాబట్టి గెలవాలంటే కేవలం శ్రమను నమ్ముకుంటే సరిపోదు. తెలివితేటలు కూడా వాడాలి. నవీన్ ప్రాణాన్ని పణంగా పెట్టి ధైర్యంగా అడవిలోకి అడుగుపెట్టాడు. విజయం సాధించాడు. ఈ లోకంలో
కాలుమీద కాలేసుకొని దర్జాగా బ్రతకాలంటే శ్రమ, నిజాయితీ వుంటే సరిపోదు. తెలివిగూడా వుండాలి. తెలివైన వాని చేతిలో గుడ్డి గవ్వ పెట్టినా వజ్రంలా మార్చగలడు. కాబట్టి అతనికే మీ కూతురుని ఇవ్వడం సమంజసం” అంది.
శంకరయ్య ఆ మాటలతో ఆలోచనలో పడిపోయాడు. ఎటూ తేల్చుకోలేక కిందా మీదా పడసాగాడు. మిత్రులారా...
ఇలాంటి పరిస్థితి మీకే వస్తే, ఈ ఇద్దరిలో మీ కూతురుని ఎవరికిస్తారో చెప్పి కొంచం శంకరయ్యకు సాయం చేయండి.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి