అంతా ఆ భగవంతుని దయ (విదేశీ జానపద హాస్య కథ) - డా.ఎం.హరి కిషన్-9441032212-కర్నూల్

 ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు ఉండేవాడు. అతనూ పేదవాడే గానీని మంచి మనసున్నవాడు. ధనసాయం చేయలేకపోయినా శ్రమసాయం చేసేవాడు. ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా పరుగు పరుగున పోయి భుజం కలిపేవాడు. అన్నదానం జరుగుతుందంటే చాలు తినేవాళ్ళలో కాక వడ్డించేవాళ్ళలో ముందుండేవాడు. పెళ్లి జరుగుతుందంటే చాలు అక్షింతలు వేసేవాళ్ళతో కాక అరిటాకులు తీసేవాళ్లతో కలసి నడిచేవాడు.
అతను రోజూ పొద్దున్నే అడవికి పోయి ఎక్కడన్నా ఎండిపోయిన చెట్టు కనబడితే కట్టెలు కొట్టి ఊరిలో అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో నచ్చినవి కొనుక్కొని ఇంటికి చేరేవాడు. పెళ్ళాం బిడ్డలకు పంచభక్ష పరమాన్నాలు పెట్టలేకపోయినా కడుపు మాడకుండా చూసుకునేవాడు. అతనికి బంగారు కడ్డీ లాంటి ఒక చక్కని కూతురు వుంది. ఆ పాపను అపురూపంగా చూసుకునేవాడు. ఆ పాప చిన్నపిల్ల కావడంతో అవి తినాలని, ఇవి తినాలని ఏవేవో కోరికలు ఉండేవి. వాళ్ళ ఇంటి పక్కనే బాగా ధనవంతుడైన ఒక పిసినారి ఇల్లు ఉంది.
ఒకసారి ఆ పిసినారి ఇంట్లో తీయని లడ్లు చేస్తా ఉన్నారు. కమ్మని వాసన ఈ పేదవాని ఇంట్లోకి రాసాగింది. ఆరోజు ఇంట్లో పాప ఒక్కతే ఉంది. నోట్లో నీళ్లు ఊరుతా ఉన్నాయి. "అన్నం తినే సమయానికి వాళ్ల ఇంటి దగ్గరికి పోతే ఒక్క లడ్డన్నా ఇవ్వకపోతారా" అని ఆశపడి సరిగ్గా ఒంటిగంటకు పోయి వాళ్ళ ఇంటి తలుపు తట్టింది. పిసినారి పెళ్ళాం తలుపు తీసింది. ఆమె మొగుణ్ణి మించిన పిసినారి. "ఏం కావాల" అంది విసుగ్గా. ఆ పాప దిక్కులు చూస్తా "ఏం లేదు.. పొయ్యి అంటించాలి. కొంచెం నిప్పు ఉంటే ఇస్తారా" అంది. ఆమె లోపలికి పోయి ఒకే ఒక అగ్గిపుల్ల తెచ్చి ఆ పాప చేతిలో పెట్టి తలుపు వేసేసింది. ఆ పాపకు చాలా దిగులు వేసింది. ఆశ నిమిషనిమిషానికి ఎక్కువైతానే వుందిగానీ తగ్గడం లేదు. "నేను పోయేసరికి ఇంకా లడ్లు చేయడం పూర్తికాలేదేమో. ఇంకాసేపు ఆగి వెళదాం" అనుకొని మరొక గంట తర్వాత పోయి మరలా తలుపు కొట్టింది. పిసినారి పెళ్ళాం తలుపు తెరవగానే "అగ్గిపుల్ల అంటించగానే గాలికి ఆరిపోయింది. ఇంకొక పుల్ల ఉంటే ఇస్తారా" అంది లడ్లవాసన కమ్మగా పిలుస్తా. దానికి ఆమె "అగ్గిపుల్లలు ఊరికే వస్తాయా... చేయి అడ్డంపెట్టి అంటించొద్దా... అయినా నువ్వు వస్తావున్నది అగ్గిపుల్లల కోసం కాదు మేము చేసుకుంటూ వున్న లడ్ల కోసం అని నాకు తెలుసు. చేతనైతే చేసుకుని తినాల. లేదంటే మూసుకొని ఉండాల. అంతేగాని ఇట్లా పక్కింటోళ్ల మీద పడితే ఎట్లా సిగ్గు లేకుండా" అంటూ మరొక అగ్గిపుల్ల చేతిలో పెట్టి దఢేల్మని విసరుగా మొహం మీదనే తలుపు వేసేసింది.
పాపం ఆ పాపకు తల కొట్టేసినట్లయింది. కళ్ళనీళ్ళతో ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆ పేదవాడు కూతురు ఉలుకూ పలుకూ లేకుండా విచారంగా ఉండటం చూసి "ఏమ్మా ఏం జరిగింది? ఎందుకట్లా మొగం వేలాడేసుకుని దిగులు దిగులుగా వున్నావు" అని అడిగాడు. అప్పుడు ఆ పాప కళ్ళమ్మట నీళ్ళు కారిపోతావుంటే జరిగిందంతా చెప్పింది. ఆ పాపను ఒడిలో పడుకోబెట్టుకొని తల నిమురుతా "బాధపడకు తల్లి. రేపు పొద్దున మరింత తొందరగా పోయి, మరిన్ని కట్టెలు కొట్టి, మరింత డబ్బు సంపాదించుకోనోస్తా. అప్పుడు మీ అమ్మ కావలసినన్ని లడ్లు తయారుచేస్తుంది. ఎన్ని కావాలంటే అన్ని తిందువు గానీ" అన్నాడు. ఆ పాప సరేనంటూ తీయని కలలు కంటూ అట్లాగే వాళ్ళ నాన్న ఒడిలో నిద్రపోయింది.
కానీ తర్వాతరోజు పొద్దున్నుంచీ ఒకటే వాన. సందు ఇవ్వకుండా దంచి కొట్టసాగింది. నాలుగు రోజులైనా కొంచెం కూడా తగ్గలేదు. గొడ్డలి తీయడానికీ లేదు. అడవికి పోవడానికీ లేదు. 'వాన ఎప్పుడు తగ్గుతుందా, నాన్న డబ్బులు ఎప్పుడు తెస్తాడా' అని ఆ పాప ఆశగా వాకిలి దగ్గరే కూర్చుని బయటకు చూడసాగింది. ఐదో రోజు వాన కొంచెం తెరిపిచ్చింది. ఎట్లాగైనా పాప కోరిక తీర్చాలని అడవికి బయలుదేరాడు. కానీ అడవంతా ఒకటే బురద. అడుగు తీసి అడుగేయడమే కష్టంగా వుంది. దాంతో లోపలికి పోలేక "కన్న కూతురికి ఇచ్చిన మాట తీర్చలేని ఈ బతుకూ ఒక బతుకేనా" అని కళ్ళనీళ్ళతో పెద్ద ఎత్తున వెక్కి వెక్కి ఏడవసాగాడు.
సరిగ్గా అదే సమయానికి భూలోకం ఎలావుందో చూద్దామని వచ్చిన శివుడు పార్వతి నంది వాహనం మీద ఆకాశంలో పోతావున్నారు. అడవిలో ఒంటరిగా అల్లాడిపోతాన్ వున్న పేదవాన్ని చూసి కిందికి దిగివచ్చి "ఎవరు నాయనా నువ్వు? ఏంది నీ బాధ. కనుచూపు మేర మనిషనే వాడే కనబడని ఈ అడవిలో, నువ్వు ఒక్కనివే ఇట్లా పొర్లిపొర్లి ఏడుస్తా వున్నావు" అన్నాడు. దానికి ఆ పేదవాడు కళ్ళలో సర్రున నీళ్లు కారిపోతా వుంటే జరిగిందంతా చెప్పి "కన్న కూతురు కోరిన చిన్న కోరిక కూడా తీర్చలేని ఈ బతుకు ఎందుకు స్వామీ" అన్నాడు బాధగా. శివుడు చిరునవ్వు నవ్వి ఒక శివలింగాన్ని అతని చేతిలో పెడుతూ "ఈరోజు నుంచీ నువ్వు నన్ను భక్తితో పూజించు. నీ శక్తి మేరకు ప్రసాదాలు తయారుచేసి పదిమందికి పంచిపెట్టు. అడిగిన వారికి లేదనకుండా నీకున్నదాంట్లో దానం చేస్తూ భగవంతుని ప్రేమా దయల గురించి అందరికీ ప్రచారం చెయ్యి. నీకు తోడుగా నేనుంటా" అంని వెళ్లిపోయాడు.
ఆ పేదవాడు శివలింగాన్ని ఇంటికి తీసుకుని వచ్చి భక్తిగా పూజించాడు. ఇంట్లో వున్న కొద్దిపాటి బియ్యంతో చక్కెర పొంగలి చేసి ప్రసాదంగా పదిమందికి పంచిపెట్టాడు. తర్వాతరోజు పొద్దున లేచి చూస్తే శివలింగం ముందు ధగధగా మెరుస్తా ఏదో కాంతి కనపడింది. పోయి చూస్తే ఇంకేముంది అత్యంత ఖరీదైన వజ్రం. వెంటనే దాన్ని తీసుకొని ఆ ఊరి వజ్రాల వ్యాపారి దగ్గరికి చేరుకున్నాడు. ఆయన వజ్రాన్ని పరీక్ష చేసి "ఆహా ఇంత అరుదైన, అద్భుతమైన వజ్రాన్ని ఈ మధ్య నేను ఎక్కడా చూడలేదు. దీని ధర లెక్క కట్టడం మామూలు మనుషులతో కాదు" అంటూ లెక్కలేనంత డబ్బు అతని చేతిలో పెట్టాడు. పేదవాడు తన కూతురికి కావలసినవన్నీ కొనుక్కొని ఇంటికి చేరాడు. ఆరోజు రాత్రి వాళ్ళ జీవితంలో ఎప్పుడూ తిననంత అద్భుతమైన విందు భోజనాన్ని కూతురికి అందించాడు.
వచ్చిన ధనంలో పావు భాగాన్ని చుట్టుపక్కల ఉన్న పేదవాళ్ళకంతా పంచాడు. మిగిలిన ధనంతో మంచి పంటలు పండే నీళ్లు పొంగిపొర్లే భూమిని కొన్నాడు. ఆ రోజు నుంచీ అతను ఏది పట్టుకున్నా బంగారమే. చూస్తుండగానే ఆ ఊరిలో పెద్ద ధనవంతుల్లో ఒకనిగా మారిపోయాడు.
ఎంత సంపాదించినా అతనికి గర్వం కొంచెం కూడా తలకి ఎక్కలేదు. 'ఇదంతా ఆ భగవంతుని దయ' అనుకుంటూ ప్రతిరోజు భక్తితో పూజలు చేసి అవసరమున్న వాళ్లకు అన్నదానం చేసేవాడు. తన సంపాదనలో పావుభాగం పేదల కోసం ఖర్చు పెట్టేవాడు. కొంతకాలం తర్వాత అతడు ఒకరోజు తన కూతుర్ని పిలిచి "అమ్మా... మాకు ఎప్పటినుంచో కాశీకి పోయి ఆ శివయ్యను చూసి రావాలని ఒకటే కోరిక. నువ్వు గనుక ఆరు నెలల పాటు పూజలకు అన్నదానాలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటానంటే పోయి వస్తాం" అన్నాడు. ఆ పాప 'సరే' అనింది. దాంతో తర్వాతరోజు అతను పెళ్ళాన్ని తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరాడు.
ఆ పాప అప్పటికే చాలా మారిపోయింది. తన పేదరికాన్ని మొత్తం మర్చిపోయింది. విందులు వినోదాలతో పాటు ఖరీదైన స్నేహాలకు అలవాటు పడింది. ఇంటిలో ఒక్క క్షణమైనా ఉండేది కాదు. అమ్మానాన్న కూడా లేకపోవడంతో అడ్డూఅదుపు లేకుండాపోయింది. నాన్నకిచ్చిన మాట కూడా మర్చిపోయింది. తాము ఇంత వాళ్లం కావడానికి కారణమైన శివయ్యను అస్సలు పట్టించుకోలేదు. దీపం పెట్టేవాళ్ళు కూడా లేక పూజగది దుమ్ము కొట్టుకుపోయి బూజు పట్టింది.
ఆ పాపకు రాజకుమార్తెతో మంచి స్నేహం ఉంది. ఇద్దరూ కలసి బాగా తిరిగేవారు. ఒకరోజు ఇద్దరూ తోటలో తిరుగుతావుంటే ఒక మంచినీటి సరస్సు కనబడింది. "అబ్బా... ఎంత తేటగా ఉన్నాయి నీళ్లు. తిరిగీ తిరిగీ అలసిపోయా. కాసేపు ఈత కొడదామా" అంది రాజకుమారి. "అమ్మో... నాకు నీళ్లంటే భయం. నేనిక్కడే ఒడ్డు మీదనే కూర్చుంటా. నువ్వు పోయి స్నానం చెయ్" అంది ఆ పాప.
రాజకుమారి సరేనంటూ తన ఖరీదైన ఆభరణాలన్నీ తీసి ఒడ్డున పెట్టి నీళ్లలో ఈదులాడసాగింది. అంతలో అక్కడికి ఒక కాకి వచ్చింది. దాని కళ్ళు ఒక ఖరీదైన రత్నాల హారం మీద పడ్డాయి. నెమ్మదిగా అక్కడికి వచ్చి ఆ హారాన్ని నోటితో పట్టుకొని ఎగిరిపోయింది. ఈ విషయాన్ని రాజకుమారి గానీ ఆ పాప గానీ గమనించలేదు. రాజకుమారి స్నానం ముగించి బయటికి వచ్చి చూస్తే ఇంకేముంది ఆ ఖరీదైన నగ లేదు. అది వాళ్లకు తరతరాల నుంచి వస్తున్న అత్యంత విలువైన హారం. వడ్డున ఉన్నది ఆ పాప ఒక్కతే. అడిగితే "ఏమో ఎలా మాయమైందో నాకు తెలీదు. ఇక్కడికి ఇంతవరకు ఎవరూ రాలేదు" అంది. దాంతో రాజకుమారి "ఈ పాపనే నగను తీసి ఎక్కడైనా దాచి పెట్టిందేమో" అని అనుమానపడి వాళ్ళ నాన్నకు చెప్పింది. దాంతో అతను కోపంగా ఆ పాపను చెరసాలలో బంధించాడు.
కొన్నాళ్లకు కాశీయాత్ర పూర్తి చేసుకుని ఆ పేదవాడు పెళ్ళాంతో సహా ఇంటికి చేరుకున్నాడు. చూస్తే కూతురు లేదు. ఇల్లంతా పాడుబడిపోయింది. చుట్టుపక్కల వాళ్లతో జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నాడు. పాడుబడిన పూజగదిని చూసేసరికి అతనికి జరిగిందంతా అర్థమైంది. వెంటనే గదంతా శుభ్రం చేసి దీపాలు వెలిగించి "స్వామీ... అది చిన్నపిల్ల. తెలిసీ తెలియని వయస్సు. నీకు మాట ఇచ్చింది నేను కానీ నా కూతురు కాదు కదా. ఈ ఒక్క తప్పును మన్నించి నా కూతుర్ని కాపాడు. ఇంకెప్పుడూ ఏ లోటు రాకుండా ధర్మం ప్రకారం నడుచుకుంటాను" అంటూ ఊరిలోని పేదవాళ్లందరినీ పిలిపించి ఆ దేవుని పేరుమీద విందు భోజనం పెట్టడమే కాక, తాను సంపాదించిన సొమ్ములో సగం దానం చేశాడు.
ఆ తరువాతరోజు రాజు ఆ తోటలో తిరుగుతూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అంతలో అతనికి చెట్టుమీద ఏదో 'టప్... టప్... టప్...' అని కొడుతున్న చప్పుడు వినిపించింది. "ఏముందబ్బా" అని పైకి చూస్తే చెట్ల గుబురులో కాకిగూడులో సూర్యకిరణాలు పడి ఏదో తలుక్కుమని మెరిసింది. రాజు వెంటనే ఒక సైనికున్ని పిలిచి పైన ఏముందో చూడమన్నాడు. భటుడు పైకి ఎక్కి చూస్తే ఇంకేముంది పోయిందనుకున్న రాజకుమారి రత్నాలహారం అక్కడ ధగధగా మెరుస్తా కనపడింది. దానిని చూడగానే రాజుకు అంతా అర్థమయింది.
"అరెరే... పొరపాటున ముందూవెనుకా చూసుకోకుండా రాజకుమారి స్నేహితురాలిపై దొంగ అనే ముద్ర వేసి కారాగారంలో బంధించానే. ఎంత తప్పు చేశా" అనుకుంటూ ఆ పాపని విడిపించి వాళ్ళ అమ్మానాన్నలను పిలిపించాడు. "తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. తల్లిదండ్రులు లేని సమయంలో ఆడపిల్ల అని కూడా ఆలోచించకుండా తొందరపాటుతో ప్రవర్తించాను. ఆ తప్పును సరిదిద్దుకునేందుకు నాకు అవకాశం ఇవ్వండి. మీకు ఇష్టమైతే మీ కూతురిని నా కొడుకు ఇచ్చి ప్రాయశ్చిత్తం చేసుకుంటా" అన్నాడు.
అందరి అంగీకారంతో వాళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. "ఇదంతా ఆ దేవుని దయ. అతన్ని నమ్ముకొని పేదవాళ్లకు అండగా వుంటే ఎప్పటికీ ఎవరికీ ఏ కీడూ జరగదు" అనుకుంటూ అతను ఆ భగవంతునికి మనసులోనే మౌనంగా మొక్కుకున్నాడు. 
*********
కామెంట్‌లు