సుప్రభాత కవిత : -బృంద
కనపడని దైవపు  నిజరూపం
కంటికి విందుగా మెరిసే రూపం 
మింటికి అందం తెచ్చిన రూపం 
తూరుపింట పుట్టిన దీపం...

ఎన్నో కలవరింతలకు కానుకగా 
ఎన్నో చివురింతలకు కారణంగా 
ఎన్నో ప్రశ్నలకు జవాబుగా 
నింగిని వెలిగించే ఆకాశదీపం

విత్తును మొలకగా 
పైరును పంటగా 
చేనును ధాన్యపుబుట్ట గా 
మలచి కడుపునింపే కరుణ

నీటిని ఆవిరిగా మార్చి 
వాటిని మేఘాల దాచి 
అనువైన వేళ వానగా కురిపించి 
తపించు నేలను తడిపే అనుగ్రహం

అనారోగ్యపు జాడలు లేక 
అణువణువూ  ప్రసరించి 
అవనిపై  వసించు జీవుల 
ఆరోగ్యపు ఆధారమైన అభిమానం

రేపటి ఆశను  పెంచి 
నిన్నటి కలతను తుంచి 
నేటిని గడిపే ధైర్యమిచ్చే 
సాటిలేని ప్రభువైన ప్రభాకరునికి 

అంతులేని కృతజ్ఞతచూపిస్తూ 

🌸🌸 సుప్రభాతం 🌸🌸

 

కామెంట్‌లు