సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-743
క్షీర పాషాణ న్యాయము
*****
క్షీరము అనగా పాలు. పాషాణము అనగా బండ లేదా రాయి అనే అర్థాలు ఉన్నాయి.
పాల కొరకు ఱాల మోసినట్లు.కావడిలో నొక ప్రక్కను పాల కుండను బెట్టుకొని రెండో ప్రక్క దాని బరువు సరి తూగుటకై ఱాళ్లను బెట్టుకొనుట అనేది కొన్ని ప్రాంతాల్లో చూస్తూ వుంటాం.
 మొదట మనం కావడి అంటే ఏమిటో చూద్దాం. కావడి బరువులను మోయడానికి ఉపయోగించే  సాధనం.ఇది ఎలా ఉంటుందంటే ఒక పొడవాటి కర్రకు రెండు వైపులా బరువైన వస్తువులను ఉంచడానికి తాళ్ళు ఉట్టి రూపంలో కట్టుబడి, వేళ్ళాడుతూ ఉంటాయి. ఏమైనా వస్తువులను కానీ,పాలూ లేదా నీళ్ళను  తీసుకొని పోవడానికి  ముఖ్యంగా అందులో ఒకే సారి రెండింటినీ మోసుకొని పోవడానికి  దీనిని ఉపయోగిస్తారు.
 ఒకే సారి రెండు బిందెల నీళ్ళు కానీ, రెండు క్యాన్ల పాలు కానీ కావడి కర్రకు రెండు వైపులా ఉన్న ఉట్లలో పెట్టి మోసుకొని పోయేవారు.
ఈరోజున సాంకేతికంగా ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందింది. ఎలాంటి  బరువులనైనా సునాయాసంగా ఒక చోటు నుండి మరొక చోటికి త్వరితగతిన నేడు పంపగలుగుతున్నాము.ఇదంతా సైన్స్ సాధించిన అపూర్వమైన ఘనతగా చెప్పుకోవచ్చు.
 నీటి వసతి లేని సాంకేతికత పూర్తిగా అభివృద్ధి కానీ ఆ రోజుల్లో చాలా దూరంలో ఉన్న ఏటి నుండి నీటిని మోసుకొని రావడానికి ఆడవాళ్ళు కుండమీద కుండ లేదా బిందె మీద బిందె పెట్టుకుని వెళ్ళేవారు.ఇక మగవారు ఈ విధంగా కావడిలో మోసుకొని వచ్చేవారు.
 కావడి అనగానే మనకు మరో విషయం వెంటనే గుర్తుకు వచ్చేది, కళ్ళముందు మెదిలేది శ్రవణ కుమారుడి కథ. అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో మోసుకొని ఒక చోటు నుండి మరొక చోటికి వెళ్ళేవాడు. అలా అంధులైన తల్లిదండ్రులకు దాహం అవుతుందని నీటి కోసం  అడవిలో పారే నీటి వద్దకు వెళ్ళి ముంచిన చెంబు శబ్దం జంతువు నీటిని తాగుతున్నట్టు అనిపించి దశరథుడు వేసిన బాణపు దెబ్బకు ఆ శ్రవణ కుమారుడు మరణించడం మనమంతా చిన్నప్పుడు చదువుకున్న విషయమే ఇది.
అయితే ఈ కావడికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ పురాణాల్లో ఉంది. అది కూడా చూద్దాం.
ఇడుంబన్ అనే వాడు హిందూ మతములో కనిపించే ఒక రాక్షసుడు.ఈ ఇడుంబన్ కథ తమిళ పురాణాలలో కనిపిస్తుంది. అయితే దేవతల ఆలయాలకు సంరక్షునిగా ఉంటాడు.
ఒకానొకప్పుడు పురాణ కథల ప్రకారం అగస్త్య మహర్షి శివగిరి మరియు శక్తిగిరి అనే రెండు కొండలను దక్షిణం వైపు ఉన్న తన నివాసానికి తరలించాలని అనుకున్నాడు. వెంటనే వాటిని మోయడానికి తన శిష్యుడైన ఇడుంబన్ ను నియమించాడు. కొండలను మోయడానికి  అగస్త్యుడు కావడిని కనిపెట్టాడు.ఆ కావడిలో రెండు కొనలకు కుండలు  ఎత్తి కట్టీ  మోసుకుంటూ  వెళ్తూ మధ్యలో అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోవడం వాటిని దించి మళ్ళీ భుజాల మీదకు ఎత్తుకునే వాడు. అలా పళని దగ్గరకు వచ్చిన తర్వాత మురుగన్ లేదా సుబ్రహ్మణ్యుడు పళని ప్రయాణం చేసి ఆ కొండలను తన సొంతమని చెప్పి ఇడుంబన్ వాటిని ఎత్తడానికి వీలు లేకుండా చేశాడు. అలా చేయడంతో ఇడుంబన్ కు కోపం వచ్చింది. సుబ్రహ్మణ్యుడితో యుద్ధం చేసి చంపబడ్డాడు.అయితే మరణం చివర్లో తాను యుద్ధం చేసింది తన ఇష్ట దైవం అయిన మురుగన్ అని గుర్తించి వేడుకున్నాడు.
రెండు కొండలను మోసే కావడిని తన భుజాలపై వేసుకుని ప్రతిజ్ఞ చేసిన ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని కోరుకున్నాడు. 
అలా ఆ ప్రాంతాన్ని దర్శించిన ప్రతి ఒక్కరూ తనను దర్శించుకుని ఆదర్శింప బడవలెనని కోరిక. అదండీ! కావడి కథ. 
ఇక కావడి గురించి బాగా హిట్టయిన ఘంటసాల పాట " కావడి కొయ్యేనోయి- కుండలు మన్నెనోయీ.. ఈ పాట ఎంతో తాత్త్వికతతో రాసిన పాట ఇది.
ఇక విషయానికి వద్దాం.
ఇలా కావడి కుండల్లోని ఒక దాంట్లో  పాలు లేదా నీళ్ళు పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఒక దాంట్లో బరువు తగ్గినప్పుడు. అంత బరువుగా ఉండటం కోసం రాయిని తెచ్చి పెట్టుకునేవారు.
దీనిని కూడా తాత్విక ధోరణితో చూసినట్లయితే మన పెద్దవాళ్ళు చెప్పినట్లు  కొత్తగా తలనొప్పులు లేదా బరువులు పెంచుకునే వారిని చూసి చెప్పారు.
ఏది ఏమైనా ఈ "క్షిర పాషాణ న్యాయము"లో  తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఉన్న బరువు బాధ్యతలు చాలవనీ మరికొన్ని నెత్తికెత్తుకుంటారు.అలాంటి వారికి ఇదొక పాఠం లాంటిదని మనం గ్రహించవచ్చు.*


కామెంట్‌లు