న్యాయములు-746
సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండిత న్యాయము
******
సర్వ అనగా మొత్తము సమస్తము,అంతయూ. నాశ అనగా అగపడమి, నాశము, చేటు, చావు. సముత్పన్నే అనగా ఉద్భవించినపుడు.అర్థం అనగా సగము.త్యజతి అనగా విడిచి పెట్టు,వదిలించుకొను.పండిత అనగా విద్వాంసుడు, బుద్ధి మంతుడు, చతురుడు,కుశలుడు, విద్వాంసుడు అనే అర్థాలు ఉన్నాయి.
సర్వనాశము సంభవించినప్పుడు పండితుడైన వాడు సగము విడిచి వేయును.అనగా తక్కిన సగముతో తన కార్యము సాధించుకొనును. "అర్థ నాశే సముత్పన్నే సర్వం త్యజతి దుర్మతిః" అనగా అవివేకి అయిన వాడు సగమునకు నాశనము సంభవించినప్పుడు పూర్తిగా అంతయూ వదిలి వేస్తాడు" అర్థముతో ఈ న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
వివేకవంతుడు, లౌక్యం తెలిసిన పండితుడు ఎల్లప్పుడూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తాడు.ఆపద సమయంలో తనను తాను రక్షించుకుంటాడు.ఎప్పుడూ సంయమనం కోల్పోకుండా ఉంటాడు. అవసరమైతే ఒకడుగు తగ్గడానికి కూడా వెనుకాడడు. దీనికి సంబంధించిన కథ మనందరికీ తెలిసిందే. ఒకానొక దేశపు రాజుకు ఒక మూఢనమ్మకం ఉండేది. తాను పొద్దున్నే లేచి బయట వ్యాహ్యాళికి తిరిగే సమయంలో ఇతరులు ఎవరైనా ఎదురైతే తనకూ,తన దేశానికి ఆరోజంతా మంచి జరుగదని నమ్మేవాడు. అందుకని మంత్రులను తన ఎదుటికి ఎవ్వరూ రాకుండా చూడమని ఆదేశాలు జారీ చేశాడు. వెంటనే అమలులోకి వచ్చింది.ఒకవేళ పొరపాటున వచ్చిన వాడు ఇక చచ్చినట్లే శిరశ్చేదం విధించే వాడు.
అలా రోజులు గడుస్తున్నాయి. ఇదంతా తెలియని పక్క దేశపు పండితుడు రావడం. వస్తూనే పొద్దున్నే వ్యాహ్యాళికి వెళ్ళిన రాజుకు ఎదురు పడటం జరిగింది. రాజు కోపంతో ఎందుకు నాకు ఎదురు పడ్డావు? నీవల్ల నాకు నా దేశానికి ఏదో ముప్పు రాబోతున్నట్లుంది.నీకు మరణశిక్ష తప్పదు అన్నాడా రాజు. విషయం అర్థమైంది ఆ పండితుడికి. రాజు మూర్ఖత్వం తెలిసింది.దీనిని ఈరోజే తొలగించాలని లోలోపల అనుకుంటూ ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు.
ఆ పండితుడి చిరునవ్వు చూసి ఆశ్చర్యపోతూ "మరణ శిక్ష అన్నా కూడా ఇంత ధైర్యంగా ఎలా నవ్వగలుగుతున్నావు.నీకేమైనా మతి స్థిమితం లేదా" అన్నాడు. ఆ మాటలను విన్న పండితుడు"అయ్యా! వేదాలు,పురాణాలు, శాస్త్రాలు చదువుకునే పండితుడిని.నా వల్ల మీకు చెడు జరగడమేమిటి? ఇప్పుడు నాకే ప్రాణహాని కలుగబోతోంది మీ వల్ల. అలా ఎంత మంది మీ ముఖం చూసి మృత్యువాత పడ్డారో?" నిర్భయంగా అన్న ఆ పండితుడి మాటలకు రాజు ఆలోచనలో పడిపోయాడు. తన మూర్ఖత్వం,తప్పిదం తెలిసింది.వెంటనే ఆ పండితుడిని తన ఆస్థానానికి సగౌరవంగా ఆహ్వానించి సత్కరించాడు. ఈ కథను మనం అనేక రకాలుగా విన్నాం.వివేకి తనను తాను ఎలా రక్షించుకున్నాడో తెలుసుకున్నాం.
ఇక అవివేకి అయిన పండితుడు ఎలా భంగపడతాడో చూద్దాం. ఈ కథ కూడా మనందరికీ తెలుసు.ఒకానొక పండితుడికి తాను పండితుడిని అని మహా గర్వం ఉండేది. అలాంటి వాడు ఒకసారి నదిని దాటడానికి ఓ పడవ ఎక్కాడు. ఎక్కినవాడు ఆగకుండా తన గొప్పదనాన్ని అతడికి చెప్పాలని అనుకున్నాడు. పాండిత్యానికి, చదువుకు సంబంధించిన అనేక ప్రశ్నలు వేసి వాటన్నిటికీ రాదు, తెలియదు అనే సమాధానాలు విని హేళనగా "ఇక నీ జీవితం వ్యర్థమే.పాండిత్యం మాటేమో కానీ కనీసం చదువు కూడా రాదు" అన్నాడు.
"నిజమేనయ్యా! నా జీవితం వ్యర్థమే. ఇప్పుడు అసలే వర్షం, గాలి మొదలయ్యాయి. పడవ ఒడ్డుకు వచ్చే లోపు మరింత ఎక్కువయ్యాయి. "మరి మీకు ఈత వచ్చా! అయ్యా! ఇప్పుడు పడవ మునిగి పోబోతోంది." అన్న మాటలకి పండితుడు ఈత రాదని చెప్పాడు. "మరి ఈత రాకపోతే మీ జీవితమేమౌతుందో? అని గబుక్కున నదిలోకి దూకి ఈదుతూ పండితుడి వైపు చూశాడు.మునిగి పోతున్న అతడిని ఒడ్డుకు చేర్చాడు.పండితుడిలో అప్పటి వరకు ఉన్న అహం, గర్వం అన్నీ నశించి పోయి క్షమించమంటూ అడిగాడు.
పాండిత్యం ఉండగానే సరికాదు.ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం కూడా ఉండాలి.సందర్భోచిత సమయస్ఫూర్తి కావాలి.తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్న వాటితో సర్దుకు పోయే గుణం ఉండాలి.అహం, గర్వం ఎప్పటికైనా వినాశనానికే దారి తీస్తాయి.
అయితే భగవద్గీత పండితుడి గురించి "నాను శోచంతి పండితా..."ఎవరి కోసం,ఎందు కోసమూ దుఃఖించని వాడు పండితుడు" అని చెబుతోంది.
ఇదండీ! "సర్వనాశే సముత్పన్నే అర్థం త్యజతి పండిత న్యాయము" లోని అంతరార్థము.పండితుడుఅనే వాడు ఎలా ఉండాలి? ఎలా వుండకూడదు? పండితుడు వివేకి లేదా అవివేకి అయితే ఎదుర్కొనే సమస్యలు, వాటి పరిష్కారం ఎలా ఉంటుందో మనం ఈ న్యాయము ద్వారా కూలంకషంగా తెలుసుకోగలిగాము.
మరి మనం ఎలా వుండాలో ఎవరికి వారే ఇందులోని కథలను అన్వయించుకోవచ్చు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి