దోస్తులు::- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
దోస్తులు కలుసుకున్నపుడు/ 
పలకరింపులే ఆహ్వానగీతాలవుతాయి/
కరచాలనాలే విరిదండలవుతాయి/
చాయ్ గ్లాసులే ఫ్లవర్ బొకేలై ఒదిగిపోతాయి/
అరేయ్!ఒరేయ్! లన్నీ స్నేహమంత్రాలవుతాయి/
వారి స్వరాలన్నీ గాలితో సయ్యాట లాడుతాయి/ 
ధ్వని తరంగాలు ఆత్రుతగా పదాలయి/
నవరస అనుభూతి కావ్యాలు సృష్టిస్తాయి/అక్కడి ముచ్చట్లన్నీ/ 
సుస్నేహ పరిమళాలు వెదజల్లుతాయి/
అక్కడున్నవాళ్ళందరూ/ 
తేనెపట్టుపైనున్న తేనెటీగలౌతారు/
అక్కడి శబ్దాలన్నీ/ 
సుమధుర ఝంకారాలవుతాయి/
వాళ్ళంతా కనబడని స్నేహపు వలలో బందీలైనట్లుంటారు/
వర్షంలో తడిసిన భూమి/ 
అమాయకంగా వాసన వెదజల్లినట్లు/ వారి హృదయాలన్నీ /
నేస్తాల స్పర్శతో స్నేహవాసనలు గుబాళిస్తాయి/
దోస్తుల ఆలింగనంలో/ అవ్యక్త మనోప్రవాహాలు/ 
గడిచిపోతున్న కాలం గుప్పిట్లో/ ప్రేమదీపాన్ని వెలిగిస్తాయి/
అప్పుడప్పుడు ఇలా దోస్తులు కలుస్తుంటే/స్నేహపవనాలు/ \
శరీరాల్ని సుతారంగా స్పృశిస్తాయి/
దోస్తుల సంగమం కోసం/ \
కోటికనులతోటి ఎదురుచూస్తారు/కోటిగొంతులతోటి పాడుకుంటారు/
దినదినమూ కన్నులై/
ప్రతిదినమూ గొంతులై/ప్రతిదోస్తునూ తలుస్తారు/
అంతేకదా దోస్తులూ!!!
—-----------------------------------------


కామెంట్‌లు