సునంద భాషితం :-వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయాలు-739
సుపేటికా స్థాపన న్యాయము
******
సుపేటికా అంటే మంచి పెట్టె. స్థాపన అంటే స్థాపించుట,నిలుపుట, సమాధి అనే అర్థాలు ఉన్నాయి
అమూల్యమైన వస్తువులను నిరపాయకరమైన, సురక్షితమైన పెట్టెలలో దాచుకొనునట్లు అని అర్థము.
విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు  మొదలైన వాటిని అతి జాగ్రత్తగా ప్రత్యేకమైన పెట్టెలలో పెట్టి దాస్తూ వుంటాం. అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకుని మళ్ళీ వాటిని యథా స్థానములో పెట్టేస్తాం. అది మన అందరికీ తెలిసిన విషయమే.
 మరి దీని గురించి చెప్పుకోవలసిన అవసరం ఏముంది అనిపిస్తుంది కానీ మన పెద్దవాళ్ళు ఈ న్యాయమును జ్ఞానులకు ఆపాదించి చెప్పడం  జరిగింది.కాబట్టి అలాంటి జ్ఞానుల  గురించి తెలుసుకుందాం.
 జ్ఞానులైన వారు తమ మానసమును/ మనస్సును నిర్ణాశమవు  బ్రహ్మమందు నిలిపి యుంచుకుంటారు. అలా పరమాత్మ స్వరూపమైన బ్రహ్మ యందు మనసు నిలిపి వుంచుకున్న జ్ఞానులను ఉద్దేశించి  మన పెద్దలు ఈ  "సుపేటికా స్థాపన న్యాయము" చెబుతుంటారు.
మరి ముందుగా జ్ఞానమంటే  ఏమిటో, జ్ఞానులు అంటే ఎవరో, నిర్ణాశమవు అంటే అర్థమేమిటో ఆధ్యాత్మిక, భౌతిక దృష్టి కోణాల్లో  చూద్దాం.
భౌతిక దృష్టితో పరిశీలిస్తే జ్ఞానము  అనేది అంటే అనుభవము, అవగాహన,ఇంగితంతో పాటు అంతర్దృష్టిని ఉపయోగించి, వివేకం విచక్షణతో‌ ఆలోచించడం తద్వారా ఆచరణలో చూపడాన్నే జ్ఞానము అంటారు.
ఆధ్యాత్మికంగా చూసినట్లయితే  రూపం లేని భగవంతుణ్ణి సత్యమని, జ్ఞానమని పేర్కొన్నారు.సత్యానికి, జ్ఞానానికి రూపం వుండదు. సత్ చిత్ ఆనంద స్వరూపుడు అనే మాటలో చిత్ అనే మాటకు అర్థం జ్ఞానం.అంటే జ్ఞానమే స్వరూపంగా  కలిగిన  వాడు భగవంతుడు.ఆ జ్ఞానమే మానవునిలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి  విజ్ఞానమనే  వెలుగునిస్తుంది.
ఆ విధంగా మానవునికి వెలుగు ప్రసాదించేది ఒక్క జ్ఞానం  మాత్రమేనని చెప్పడంతో పాటు,ఆ జ్ఞానం యొక్క ఆవశ్యకతను గురించి  భగవద్గీతలో ఇలా చెప్పబడింది.
 "సహిజ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే" అంటే "ఈ ప్రపంచంలో జ్ఞానముతో సమానముగా పవిత్రమైనదిక వేరే లేనేలేదని' భగవద్గీత అంటుంది.
మరి అలాంటి జ్ఞానము కలిగిన వారిని జ్ఞానులు అంటారు.వారు ఎల్లప్పుడూ త్రికరణ శుద్ధిగా మంచి పనులు చేస్తూ ఉంటారు. అంటే మనసా వాచా కర్మణాః ఎవరికి అపకారం చేయకుండా కర్మ,భక్తి, జ్ఞాన మార్గంలో యోగ సాధన చేస్తూ వుంటారు. వారు తమ  మానసమును నిర్ణాశమవు అంటే నాశము లేని బ్రహ్మమందు  తమ మనసు నిలిపి వుంచుతారు.అంటే అలాంటి బ్రహ్మ పదమనే పేటిక యందు అంటే  పరమాత్మ నివాస స్థానము నందు మనసును లగ్నం చేసి జాగ్రత్త చేస్తారన్న మాట.
నిర్ణాశమవు అంటే నాశము కానిదని మనకిప్పుడు తెలిసింది కదా! మరి నాశము కానిది ఏమిటో ఈ ప్రపంచంలో నిశితంగా గమనించి చూస్తే...అన్ని పదార్థాలూ ఎప్పుడో ఒకప్పుడు నాశం అయ్యేవే .కానీ నాశము కానిది మార్పు లేనిది, ఎల్లప్పుడూ నిలిచి వుండేది పరమాత్మ తత్త్వం ఒక్కటేనని, దానినే బ్రహ్మ పదము అంటారని  భగవద్గీత మనకు అర్థమయ్యేలా చెప్పింది.మరలాంటి బ్రహ్మ పదాన్ని  ఏం చేయాలో? ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం ఒక్కటే. ఆ బ్రహ్మ పదం అనే సుపేటికలో ఆత్మతో కూడిన మనసును దాచుకోవాలి .సమాజ శ్రేయస్సుకు అవసరమైనప్పుడు ఉపయోగించాలి .అలా ఉపయోగించగలిగే వారే అసలైన జ్ఞానులు.వారే సమాజాన్ని ప్రభావితం చేసే దిశానిర్దేశకులు. వారి యొక్క అమూల్యమైన జ్ఞాన సంపద సమాజ అభివృద్ధికి, శ్రేయస్సుకు కీలకం.
ఇదే "సుపేటికా స్థాపన న్యాయము"నకు సరైన ఉదాహరణ.ఈ న్యాయమును సదా గమనంలో పెట్టుకుందాం .
 
ఈ న్యాయంలో చెప్పినది ఆధ్యాత్మికమా?భౌతికమా? అనే అనవసరపు ఆలోచనలు, సందేహాలతో  మీన మేషాలూ లెక్క పెట్టుకోకుండా  విజ్ఞత,వివేకం కలిగిన మనము మనకున్న జ్ఞానాన్ని  సమాజ సేవకై ఉపయోగిద్దాం.

కామెంట్‌లు