సుప్రభాత కవిత : -బృంద
రెప్పల తలుపులు  వేసాక 
నిద్దుర గొళ్ళెం పెట్టాక 
కనులు నడిచే దారి 
కలల దారి...

కునుకు రానీయనివి 
నిదుర  పోనీయనివి 
ఎదురు చూసినవి
అసలు అనుకోనివి...

కనులు కనే కలలు 
మూసిన రెప్పలకు
దాచిన మనసుకు 
కూడా తెలియదు!

అలరించేవి కొన్నయితే 
అదిలించేవి కొన్ని 
ఆశించేవి కొన్ని కాగా 
అసలు అనుకోనివి ఎన్నో!

ఊహకు రూపం ఇచ్చి 
ఊయలలెన్నో ఊపి 
ఊరుకున్న మనసును 
ఊరించేవి కొన్ని!

ఆరాటానికి రూపం పోసి 
ఆశ తీర్చేవే అయినా 
అద్దంలో బొమ్మల్లే 
అందనివే అన్నీ!

సవ్వడిలేని సిరిమువ్వల్లే 
సందడి చేసే స్వప్నాలు 
అందమైన ఊహలతో 
అల్లుకున్న బంధాలు 

సత్యమై సాక్షాత్కారించి 
స్వప్నాలు సాధించుకోమని 
నిత్యము అలరించే 
ప్రత్యక్ష నారాయణుడి రాకకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు