కలల కౌగిలి నుండీ
వెలికి రమ్మని పిలుపులా?
వెలుగు గొడుగు కిందికి
కదిలి రమ్మని మేలుకొలుపులా?
కుసుమాలు కులుకులతో
వసుమతికి వన్నెలద్ది
ఇసుమంత ఈసులేక
ఊసులెన్నో చెబుతోంది చూడు!
తెలవారి వెలుగుల్లో
తెలిమంచు తెరలు తీసి
తలిరు తీగలు పూలతో
కదిలి ఊగుతున్న నాట్యం చూడు!
అలముకున్న వెలుతురులో
అలజడులు లేక హాయిగా
అటునిటు పరుగులతో
అన్నిటా తానైన గాలిని చూడు!
రారమ్మని మనసారా పిలిచి
రారాజువు నీవేనంటూ
చూపులు పరచి నీకై
వేచి వుంది రహదారి చూడు!
నవ్వుతూ నవ్విస్తూ
ఆడుతూ పాడుతూ
కరగనివ్వు కాలాన్ని
తరుగుతుంది దూరం చూడు!
పచ్చని ప్రకృతి మనకందించే
ప్రకంపనలను అనుభవిస్తూ
ప్రశాంత ప్రయాణ సమయాన్ని
పూర్తిగా అస్వాదించమని
ఆహ్వానిస్తున్న వేకువకు
🌸🌸 సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి