పువ్వుగా పుట్టి..!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
గదుల్లో బంధించబడ్డ మనకు 
గోడలు కాదు 
కాంతి ఆరుబయలైంది. 
పనులు మునుల్లా మారితే 
మెదళ్ళు 
కుందేళ్లు లేళ్ళలా పరిగెత్తుతాయి. 

కాంతి తాళ్లతో తాబేలు 
కాళ్ళను తయారు చేస్తే 
నీళ్లు కళ్ళు మూసుకుంటాయి. 
మోహము మోముల్లో కన్నెపిల్లలు 
వెన్నెల్లా మారిపోతున్నారు. 

కాంక్ష శుభాకాంక్షలతో బయలుదేరి 
గాల్లో కలిసిపోయింది. 
గమ్యం మత్తులో తప్పుగా ప్రార్థించింది. 
తధాస్తు దేవతలు పట్టు వస్త్రాల కోసం 
పట్టుబడ్డారు. 

మనసుకు ఆడామగాలు లేవని 
ప్రేమ చెప్పింది. 
కోరికలు మాత్రం శరీరాలు గానే పుడతాయి. 

అందం మనసులో పుడుతుంది 
కళ్ళల్లో పెరుగుతుంది శరీరాల్లో 
దాక్కుంటుంది. 
అభ్యంగన స్నానం వానల్లో కాదు 
వీణల్లోనీ తీగల్లో చేస్తాం.
స్నానం సంగీతం ఒకటే. 

రంగు రుచి వాసన ఉంటేనే ఏదైనా 
మగువలా మారుతుంది.
పరిమళం పువ్వు గా పుట్టి గాలిని 
ప్రేమిస్తుంది...!!?

డా ప్రతాప్ కౌటిళ్యా పాలెం నాగర్ కర్నూల్ జిల్లా.

కామెంట్‌లు