విద్యానగర్ ఉన్నత పాఠశాలలో అనిత మరియు విజయ 9వ తరగతి చదువుతున్నారు. చదువులో ఎప్పుడూ ఇద్దరికీ సమానమైన మార్కులు వస్తాయి ఆ పాఠశాలలో ఉన్న నిబంధనల ప్రకారం అన్ని సబ్జెక్టులలో కలిపి మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులు ఆ తరగతికి నాయకురాలిగా ఉండాలి. కానీ ప్రతీసారీ ఇద్దరికీ నాయకత్వ బాధ్యతలను ఇవ్వక తప్పడం లేదు. కానీ ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి ఈర్ష్యా భావం ఉండేది. ఇద్దరూ ఒకరితో మరొకరు మాట్లాడుకోక పోయేవారు. ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా ఈ సమాంతర రేఖలను కలపలేకపోయారు.
ఒకరోజు అనిత ఒక తప్పు చేసిందని తరగతిలో ఉపాధ్యాయుడు నిందించాడు. ఆ రోజు రాత్రి అంతా నిద్ర పోకుండా బోరున ఏడ్చింది అనిత. మరుసటి రోజు ఈ విషయం పాఠశాల ఉపాధ్యాయుల దృష్టికి వచ్చింది. అనిత సన్నిహితుల ద్వారా తెలిసింది ఏమిటంటే అనిత అంతలా ఏడువడానికి కారణం ఉపాధ్యాయుడు నిందించడం కాదు, ఉపాధ్యాయుడు అనితను నిందించిన వెంటనే విజయ పక్కమని నవ్విందట. విషయం తెలుసుకున్న ఉపాధ్యాయులు తల పట్టుకున్నారు.
క్లాస్ టీచర్ ఇద్దరినీ నాయకత్వ బాధ్యతల నుంచి తెప్పించింది. "క్లాస్ లీడర్ అందరితో స్నేహ పూర్వకంగా ఉండాలి. ఎవరితోనూ విభేదాలు ఉండకూడదు. కేవలం చదువులోనే ఫస్ట్ వచ్చినంత మాత్రాన నాయకరాలు కాలేదు. ప్రవర్తనలో అందరి కంటే గొప్పగా ఉండాలి. అందరితో కలిసిపోయి, చదువులో వెనకబడిన వారితో సన్నిహితంగా ఉంటూ, వారిని నిరంతరం ప్రోత్సహిస్తున్నది వినత అనే అమ్మాయి అని తెలిసింది. "వినతను క్లాస్ లీడరుగా ప్రకటిస్తున్నాను" అన్నారు క్లాస్ టీచర్.
వినత, శ్రావణి బెస్ట్ ఫ్రెండ్స్. వినత లీడర్ అయ్యాక చదువులోనూ తాను అందరి కంటే బెస్ట్ రావాలని అనుకుంది. శ్రావణి సహకారం కూడా తీసుకుంది. వినత శ్రావణితో కలసి కంబైన్డ్ స్టడీ చేస్తూ, వచ్చిన సందేహాలను ఉపాధ్యాయుల సహాయంతో నివృత్తి చేనుకుంటున్నాడు. అనతి కాలంలోనే ఇద్దరూ కలసి క్లాస్ ఫస్ట్ వచ్చారు. నివ్వెరపోయారుఅనిత, విజయలు. ఆ తరగతి బోధించే ఉపాధ్యాయులు ఆ తరగతి పిల్లలను అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ నిర్వహించారు. వినత, శ్రావణిలు అనతీ కాలంలోనే చదువును బాగా మెరుగు పరచుకొని ఏకంగా చిన్న తనం నుండి క్లాస్ ఫస్ట్ వచ్చే ఇద్దరినీ మించిపోయి ఇద్దరూ ఏకంగా క్లాస్ ఫస్ట్ రావడానికి కారణం ఇద్దరి మధ్యా ఉన్న ప్రాణ స్నేహబంధమే కారణమని, ఇద్దరి మధ్యా ఈర్ష్య అసూయలు ఉంటే అది వారికే నష్టమని ఉపాధ్యాయులు చెప్పారు. విద్యార్థులు అనిత, విజయలను చూస్తూ పగలబడి నవ్వారు. ఇద్దరూ సిగ్గుతో తల దించుకున్నారు. తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, కలసిపోయారు. వినత, శ్రావణిలతో కలసి కంబైన్డ్ స్టడీ చేస్తూ మంచి విద్యార్థులు అయినారు. ఉపాధ్యాయులు సంతోషించారు.
స్నేహ బంధము : సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి