న్యాయాలు-745
సర్వం జ్ఞానం ధర్మిణ్య భ్రాన్తం ప్రకారేతు వ్యత్యయః న్యాయము
****
సర్వం అనగా మొత్తము సమస్తము,అంతయూ.జ్ఞానము అనగా తెలిసికొనుట,అర్థం చేసుకొనుట, పరిచయము పొందుట,ప్రవీణుడగుట,జ్ఞానము నేర్చుట,చేతన, మోక్ష విషయకమగు బుద్ధి.ధర్మిణ్య అనగా ధర్మ విరుద్ధం కానిది, ఆచరణీయ కార్యం.భ్రాంతం అనగా తిరుగుట ,భ్రమ, లేనిది ఉన్నట్లు తలంచుట. అభ్రాంత అనగా కూర్చిన, స్పష్టమైన ప్రకారేతు అనగా పద్ధతితో.వ్యత్యయ అనగా వ్యత్యాసం.తడబాటు అనే అర్థాలు ఉన్నాయి.
సమాన ధర్మములు గలది ధర్మి. (ధర్మి అనేది లెక్క లేని ధర్మాల ప్రోవు లేదా రాశి)ధర్మి యందు గల ద్రవ్యము,ఆ ద్రవ్యానికి యోగ్యత ఉన్న శక్తియే ధర్మము.ధర్మము అనగా గుణం.నిప్పుకు ఉండే దాహక శక్తి దానికి గల ధర్మముగా చెప్పవచ్చు.ఏ గుణం చేత వస్తువు మనకు బోధపడుతుందో అదే వస్తువు యొక్క ధర్మం.ఇలాంటి ధర్మములతో కలుగు జ్ఞానము అభ్రాంతజ్ఞానము అనగా భ్రమ రహితమైన జ్ఞానము అవుతుంది.
ఇక ధర్మిని చూసినట్లయితే ధర్మిలో వర్తమాన ధర్మాలు మాత్రమే కనబడుతాయి.మిగతావన్నీ ఉన్నవి ,అన్నట్లు అనే భావనతో ఊహింపబడుతాయి.కాబట్టి వ్యక్తావ్యక్త ధర్మాలకు కూటమిగా ధర్మిని చెప్పుకోవచ్చు.
ప్రకారే అనగా ఆ పద్దతిలో విధర్మియందు ధర్మిధర్మ ప్రవృత్తమైన జ్ఞానము భ్రాంత జ్ఞానము అనగా భ్రాంతిచే గలిగిన జ్ఞానము అవుతుంది.రజతమందు( వెండి) రజతధర్మాలను తెలిసిన జ్ఞానము అభ్రాంతజ్ఞానము.అదే విధంగా రజతేతరమయిన శుక్తియందు కలుగు రజతజ్ఞానము భ్రాంతజ్ఞానము అవుతుంది అని అర్థము.
ధర్మి అనే పదం కొంచెం కొత్తగానే ఉంది.కాబట్టి అయ్యో ! నాకు అర్థం కాలేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. ముందే కున్నాం ధర్మి అనేది ధర్మాల రాశి.
అలాంటి ధర్మాలలో వాస్తవాలూ,వైకల్పికాలూ ఉన్నాయి.చెప్పకుండా తెలిపేవి,ఆర్థమయ్యేవి వాస్తవాలు.ఉదాహరణకు చంద్రునికి తెల్లదనం,ఎండమావికి జలత్వం ఆరోపితం వాస్తవం.అనంతత్వం,సత్తా, ప్రకృతి మొదలైనవి వైకల్పికాలు.వైకల్పికాలు అనగా ఒకసారి జరిగేవి, మరోసారి జరగనివి.
మొత్తంగా చూస్తే సమస్త జ్ఞానమును తెలుసుకునే క్రళ్టమంలో లేదా ప్రావీణ్యత పొందే సమయంలో ధర్మి ధర్మాలు ఏది భ్రాంతి కానిది ?ఏది భ్రాంతి? అనేది ఒక పద్ధతి ప్రకారం తెలుసుకోవడం, అందులో గల భేదాలు లేదా వ్యత్యాసాలను అవగాహన చేసుకోగలగడమే ఈ న్యాయము లోని అంతరార్థము.
భ్రాంతి అంటే వాస్తవానికి లేని దాన్ని చూడటం, వినడం, అనుభూతి లేదా రుచి చూడటం వంటి అనుభవాలు.ఇవి మనస్సు ద్వారా సృష్టించబడతాయి.ఇవిఇంద్రియాలను ప్రభావితం చేస్తాయి.
అభ్రాంతి అంటే భ్రాంతి కానిది.వాస్తవం.మరి వాస్తవం అంటే నిజమైనది లేదా నిజమని నిరూపించబడినది.వాస్తవాలను తెలుసుకోవడం ద్వారా నిజ జీవితంలో వ్యక్తి పరిస్థితులను చక్కగా అర్థం చేసుకోగలడు.
వాస్తవానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు 'భూమి గుండ్రంగా ఉంది', ఋతువులు,సైన్స్, శాస్త్రీయ ప్రయోగాలు, ఈనాడు మనం పొందుతున్న సాంకేతిక సౌలభ్యం, సౌకర్యాలు.. మరి ఇవన్నీ ఊహలు, భ్రాంతులు కావు నిక్కమైన నిజాలు.
ఇలాంటివి ఎన్నో పరిశోధనలు ,నిశిత పరిశీలనల ద్వారా ఆయా వస్తువుల వాస్తవ గుణాలు /దమ జ్ఞానాన్ని నేడు తెలుసుకోగలుగుతున్నాం. వివిధ రకాల అనారోగ్యాల కారకాలు గ్రహించి వాటిని నివారించడానికి ఎన్నో రకాల టీకాలు, మందులు కనిపెట్టడం వల్ల నేడు మశూచి, పోలియో,క్షయవంటి వ్యాధులు అరికట్టబడినవి. ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి.
ఇలా భ్రాంతం,అభ్రాంతం అంటే ఏమిటో వాటి మధ్య గల తేడాలను,ధర్మం-ధర్మి మధ్యలో ఉన్న అర్థభేదం ఏమిటో తెలియజేయడమే ఈ "సర్వం జ్ఞానం ధర్మిణ్య భ్రాన్తం ప్రకారేతు వ్యత్యయః న్యాయము" యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానం.తెలుసుకున్నవి గమనంలో పెట్టుకొని అవసరమైనప్పుడు ఉపయోగించుకుని, మనదైన శైలిలో ఉదహరించగలగడమే విజ్ఞత.ఉపాధ్యాయ స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రమే విద్యార్థి కాదు. లోకంలో ప్రతి మనిషీ నిత్య విద్యార్థియే.ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవలసింది అనంతమై వుంటుంది. అది ఎప్పుడూ మననం చేసుకుంటూ ఆచరణలో పెడితే జ్ఞానం మరియు గౌరవం రెండూ దక్కుతాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి