సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-734
స్తన శల్య పరీక్షా న్యాయము
******
స్తన అంటే చన్ను, రొమ్ము. శల్య అనగా ఎముక, బాణము, మేకు,ఏదుపంది, ఒక రాజు. పరీక్ష అనగా మూల్యాంకనం, నిశితంగా పరిశీలించుట అనే అర్థాలు ఉన్నాయి.
స్తనాల్లో ఎముకలు ఉన్నాయా? లేదా? అని చేసే పరీక్షను స్తన శల్య పరీక్ష అంటారు.
ఇదొక విచిత్రమైన న్యాయము. ఎముకలే లేని స్తనాలలో ఎముకల గురించి చేసే పరీక్ష.
నాలుకలో లేనట్లే స్తనాల్లో కూడా ఎముకలు వుండవు. ఒకవేళ ఉన్నాయా? లేదా?*పరీక్షించాల్సి వచ్చినప్పుడు స్తనాల క్రింద ఉన్న ఎముకల గూడును పరీక్షించి తెలుసుకోవచ్చు.
కానీ అలాంటి పరీక్షను నమ్మకుండా స్తనాల్లో ఎముకలు ఉన్నాయనడానికి చేసే పరీక్ష చాలా గంభీరమైనది. చెప్పుకోవడానికి కూడా  మంచిగా అనిపించదు ఈ న్యాయము చదువుతుంటే...
అయితే కొందరు ప్రతి విషయాన్ని  తు‌.చ తప్పకుండా ఎందుకు? ఏమిటి? ఎలా అనే శోధనతో  పరీక్షించే విధానాన్ని  "స్తన శల్య పరీక్ష" అంటారు. అంటే ఏదైనా విషయంలో అతి జాగ్రత్త వహించడంతో పాటు తరచి తరచి శోధించి చూసే వారిని "స్తన శల్య పరీక్ష" చేస్తున్నారు." అంటారు.
ఇందులో  అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. ఒకటేమో ఏ విషయాన్నైనా కూలంకషంగా అధ్యయనం చేసి నిశితంగా పరిశీలించి తెలుసుకోవాలనే ఉద్ధేశం ఉన్న వారు చేసే పరీక్ష.
రెండో  అర్థంలో  మగువల అందాలను,అవయవ సౌష్టవాన్ని పొగిడే రసిక ప్రియులు బిగుతుగా ఉన్న స్తన ద్వయాన్ని చూసి ఆ గట్టి తనానికి కారణం లోపల ఏమైనా ఎముకలు ఉన్నాయా? అనడం.అలా అనేవారికి  రసికత తెలియదని విమర్శించేవారు అంటుంటాం అంటారు. అలా అనడానికి, వినడానికి, రాయడానికి ఇలాంటివి చాలా యిబ్బందిగా అనిపిస్తాయి.కానీ విషయాన్ని అనేక కోణాల్లో ఎత్తి చూపేటప్ఫుడు ఇలాంటివి చెప్పక తప్పదు.
ఇక మూడో  అర్థంలో  సాహిత్య విషయానికి వస్తే ఏవైనా పద్యం,గద్యం మొదలైన వాటికి సంబంధించిన విషయాలను ఆస్వాదించే వారిని ఆ సమయంలో తనయొక్క అసంగతమైన, అర్థవంతం కాని ప్రశ్నలతో రసజ్ఞతను తప్పుదారి పట్టించి  చిరాకు పెట్టేవారిని 'స్తన శల్య పరీక్ష" చేస్తున్నారని కూడా అంటుంటారు.
మామూలు అర్థంలో చూశాం కదా! లోతుల్లోకి వెళ్లి నిశితంగా పరిశీలిద్దామనే ఆలోచన. ఇలా ఈ "స్తన శల్య న్యాయము"ను ఎవరి కోణంలో వాళ్ళు చూస్తూ, అన్వయించుకుంటారని ఈ "స్తన శల్య న్యాయము"ను చూస్తూ ఉంటారని ఇవి చదివిన తరువాత మనకు ఈపాటికి అర్థమయ్యే రీతిలో వుంటుంది.
కాబట్టి మనం అలాంటి వాటిల్లో తలదూర్చి అనవసరంగా తలబొప్పి కట్టించుకోకుండ ఉండటమే శ్రేయస్కరమని నా అభిప్రాయం. మరి మీరు కూడా నాతో ఏకీభవిస్తారు కదూ!

కామెంట్‌లు