కృతజ్ఞత : సరికొండ శ్రీనివాసరాజు



 మల్లన్న కిరాణా షాపు నడుపుతున్నాడు. అందులో పని చేయడానికి రాఘవ అనే కుర్రాడు ఆసక్తి చూపించాడు. "బడికి వెళ్ళి చదవాల్సిన వయసులో షాపులో పని చేస్తావా? ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది." అన్నాడు మల్లన్న.  "బడికి వెళ్ళే సమయంలో బడికి వెళ్తా. మిగిలిన సమయాల్లో మీ షాపులో పనిచేస్తా. పేదవారిమి.  రెక్కాడితే కానీ,  డొక్కాడని వారిమి.  దయ చూపండి. " అన్నాడు రాఘవ. మల్లన్న ఒప్పుకున్నాడు.  
     రాఘవ నిజాయితీగా పని చేస్తూ, మంచి పేరు తెచ్చుకున్నాడు. అలా నాలుగు సంవత్సరాలు నిజాయితీగా షాపులో పనిచేసినాడు రాఘవ. హఠాత్తుగా రాఘవ షాపుకి రావడం మానేశాడు.  షాపులో భారీగా డబ్బు చోరీ అయింది.  రాఘవ డబ్బులతో సహా పరారైనాడని తెలుస్తుంది.  లబోదిబోమన్నాడు మల్లన్న.  
        మల్లన్న ఎవరినీ నమ్మకుండా,  ఎవరినీ పనిలో పెట్టుకోకుండా షాపును నడుపుతున్నాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మొదటి నుంచి అంతంత లాభాలతోనే నడుస్తున్న దుకాణం. ఇప్పుడు కూడా  మల్లన్న వ్యాపారం అంతంత మాత్రంగానే సాగుతుంది. రాను రాను నష్టాలు వచ్చి, షాపును మూసి వేసినాడు. ఏదో ఒక కూలి పని చేసుకుని బతుకుతున్నాడు. 
      హఠాత్తుగా మల్లన్నకు భారీగా డబ్బు అవసరం పడింది.  అప్పు చేద్దామంటే దొరకడం లేదు. కొడుకులు సరిగా చదవలేదు.  పైగా సోమరులు. డబ్బులు విచ్ఛలవిడిగా ఖర్చు పెట్టడం తప్ప సంపాదించడం వారికి చేత కదు .ఇంట్లో బాధలు వారికి పట్టలేదు. కూచుని తింటే మరి కొండలే కరుగవా? 
    మల్లన్న ఇంటికి అనుకోకుండా రాఘవ వచ్చాడు.  మల్లన్న వెంటనే గుర్తు పట్టలేదు.  "క్షమించండి ప్లీజ్! నేను మీకు ద్రోహం చేశాను. ' అన్నాడు రాఘవ.  ఆశ్చర్యంగా చూశాడు మల్లన్న.  "నేను గతంలో నా చదువు ఖర్చులు వెళ్ళదీసుకోవడానికి మీ షాపులో పని చేశాను.  ఉన్నత చదువులు చదవడానికి పట్నం పోవాల్సి వచ్చింది.  పైగా పుస్తకాలు మరియు ఫీజులకు డబ్బులు కావలసిన వచ్చింది.  కాబట్టి షాపులో పెద్ద దొంగతనమే చేశాను.  నా నిరంతర కృషి ఫలితంగా పెద్ద ఉద్యోగమే వచ్చింది.  మీకు కృతజ్ఞతలు చెప్పడం నా విధి.  మీకు వడ్డీతో సహా మీ దగ్గర దొంగతనం చేసిన డబ్బులు ఇస్తున్నా. తీసుకోండి." అని తాను తీసుకున్న డబ్బులకు చాలా చాలా  రెట్లు సొమ్మును చెల్లించాడు. మల్లన్న మరీ ఇంత ఎక్కువా? వద్దు." అంటే  "  నేను మీ కొడుకును అనుకోండి.  తీసుకోక పోతే నా మీద ఒట్టు." అన్నాడు రాఘవ.  మల్లన్న తీసుకున్నాడు.
    మల్లన్న తిరిగి షాపును ప్రారంభించాడు. తరచూ రాఘవ మల్లన్నను కలుస్తూ వ్యాపారం బాగా సాగడానికి సలహాలు ఇచ్చాడు. రాఘవను చూసి,  మల్లన్న కొడుకులు బుద్ధి తెచ్చుకున్నారు. వారూ సంపాదనాపరులు అయ్యారు.


కామెంట్‌లు