సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-749
స్వాంగం స్వవ్యవధాయకం నా భవతి
****
స్వ అనగా తాను,తన.అంగం అనగా అవయవం, శరీరంలోని భాగం, వ్యవస్థలోని శాఖ.వ్యవధాన అనగా మరుగు, అవకాశం. న/ నా  అనగా లేదు.భవతి అనగా అవుతుంది, ఉండాలి,ఉంది అనే అర్థాలు ఉన్నాయి.
 నా శరీరంలోని అవయవాలు నాకు అడ్డు రావు అనగా తన దేహం తన కంతర్థిని/అపాయాన్ని కలిగించదు అని భావము.అనగా ఎవరి శరీరము వారి త్రోవకు అడ్డము రాదు" అని అర్థము.
ఈ న్యాయము గురించి చెప్పుకోవాలంటే  తేలికగా అర్థమయ్యే ఉదాహరణ తీసుకుందాం.ముఖ్యంగా  మన నోటిలోని "దంతాలు, నాలుక " గురించి  తెలుసుకుంటే చాలావరకు అర్థమవుతుంది .
మరి మొదట దంతాల గురించి చెప్పుకుందాం.ఈ దంతాలు మానవ శిశువులో పుట్టిన ఆరు లేదా ఏడు నెలల నుండి రావడం మొదలవుతాయి. అలా బాల్యంలో  వచ్చిన 20 దంతాలను పాల దంతాలు అంటారు. ఆ తర్వాత వచ్చే32 దంతాలను శాశ్వత దంతాలు అంటారు. దంతాలు 96%కంటే ఎక్కువ ఖనిజాలతో కూడినవి.ఇవి ఎముకల్ని పోలి ఉన్నప్పటికీ ఎముకలు కావు. ఎందుకంటే ఎముకలు మజ్జను ఉత్పత్తి చేస్తాయి కానీ దంతాలు ఉత్పత్తి చేయవు. అందుకే వీటిని ఎముకలు అనరు.ఇవి కాల్షియం  నరాలు రక్తనాళాలు కలిగి ఉంటాయి.ఈ దంతాలకు కొరికే శక్తి చాలా  ఎక్కువగా వుంటుంది. నిర్మాణాన్ని బట్టి దంతాలు ఎంత బలమైనవో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక నాలుక గురించి కూ రెండు మాటలు తెలుసుకుందాం.
నాలుక నోటిలో ఉండే బలమైన కండరము.ఇది గులాబీ రంగు కణజాలంతో నిర్మింపబడి తేమతో కూడి ఉంటుంది.ఇది నొక్కడం,రుచి చూడటం,శ్వాసించడం, మింగడం మరియు మాట్లాడటానికి ఉపయోగపడుతుంది.నోటి అడుగు భాగంలో కింది పళ్ళ నుండి గొంతు వరకు వ్యాపించి ఉంటుంది.
ఇక అసలు విషయానికి వద్దాం. అలాంటి బలమైన దంతాల మధ్య నాలుక ప్రతిక్షణం కదులుతూ ఉన్నా దంతాల వలన నాలుకకు ఎలాంటి హానీ జరగదు. దంతాలు చేసే పనికి నాలుక అడ్డు కాదు. అనగా శరీర అవయవాల్లో ఏదైనా సరే ఒకదాని పనికి మరొకటి అడ్డు రాదు. ఈ ఉదాహరణ ద్వారా మనం గ్రహించవచ్చు.
అలాగే మరో ఉదాహరణ కూడా చెప్పుకుందాం.
మన శరీరము -మనసు .. ఈ రెండింటినీ తీసుకున్నట్లయితే మనసు  మెదడులో ఉంటుందనే విషయం తెలిసిందే. మెదడులోని ఈ మనసు శరీరంలోని అన్ని అవయవాలతో సంబంధం కలిగి ఉంటుంది.శారీరక మరియు మానసిక స్థితిపై శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీర అవయవాలు సక్రమంగా పని చేయడానికి మెదడులోని మనసు ఆదేశాలు ఇస్తుంది. ఈ ఆదేశాల సమయంలో ఒక అవయవానికి ఇచ్చిన ఆదేశాన్ని మరో అవయవం అడ్డుకునే ప్రసక్తి ఉండదు.అది తన శరీరం తన అవయవాలు అవడం వల్ల అలా జరుగుతుంది .
ఇది పూర్తిగా ఆమోదయోగ్యమైన మాటేనా? అనే సందేహం మనకు కలుగుతుంది. ఇది మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడని వేరే చెప్పక్కర్లేదు.ఆదేశాలు ఇచ్చే మెదడు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి వున్నంత కాలం ఎలాంటి ఇబ్బందీ ఉండదు.
ఎప్పుడైతే మెదడుకు శరీరావయవాలకు మధ్య సమన్వయం లోపిస్తుందో  అప్పుడు ఈ న్యాయము  వర్తించదు.
ఒకోసారి "బ్రెయిన్ డెడ్" అనేది వివిధ రకాల ప్రమాదాల వల్ల సంభవిస్తుంది.ఎప్పుడైతే మెదడు నుండి ఆదేశాలు అందవో క్రమంగా అవయవాలు పని చేయడం ఆగిపోతుంది.
 ఇలా  కేవలం మనుషుల విషయంలోనే కాదు. పెద్ద పెద్ద కొమ్ములు ఉన్న లేళ్ళు, దుప్పులు , జిరాఫీ లాంటి రకరకాల జంతువులను చూస్తుంటే వాటి అవయవాలు వాటికి యిబ్బందేమో అనిపిస్తుంది కానీ  వాటి మనుగడకు అలాంటి యిబ్బందులేం పడకుండా జీవించడం చూసినప్పుడు 'సృష్టి కర్త' సృష్టి భలే విచిత్రం కదా! అనిపిస్తుంది.
మరి ఈ "స్వాంగం స్వవ్యవధాయకం నా భవతి న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెప్పడంలో ఆంతర్యం ఏమై ఉంటుందా? అని ఆలోచిస్తే దీనిని ఆధ్యాత్మిక దృష్టితో చూశారనేది గ్రహించవచ్చు.
ఎందుకంటే ఎవరి అవయవాలు వారికి ఏవిధంగా అడ్డురావో అలాగే ఎవరి మానసిక క్రియలు వారివే.అనగా "ఎవరి బుద్ధి/మనసు తీరు వారిదే అవి తప్పా? ఒప్పా? తర్వాత విషయం కానీ వారు చేయడానికి వారి మానసిక క్రియలు అడ్డు రావు అనే అర్థం ఈ న్యాయములో స్ఫురిస్తుంది.
కాబట్టి బుద్ధి/ మనసు తీరు ఎలా ఉంటుందో ఎవరికి వారే తెలుసుకోవాలి. అది మంచి మార్గంలో నడిచేందుకు ప్రయత్నం చేయాలి .అలా మనసు  చేసే మంచి పనులకి అవయవాలు అడ్డు రావు.

కామెంట్‌లు