పందేల పరమేశ : సరికొండ శ్రీనివాసరాజు

 వరమేశుకు ప్రతి చిన్న విషయానికి పందెం కాసే అలవాటు.  తాను ఖచ్చితంగా గెలుస్తాను అని నమ్మకం ఉన్న విషయాలకు పందెం కాసి, అవతలి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసేవాడు. పాపం ఎంతో మంది బలై పోయారు. ఎక్కువగా క్రికెట్ ఆటలపై పందెం కాసేవాడు.  ఇది వాసు దృష్టికి వచ్చింది.  ఎలాగైనా పరమేశుకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు.  వాసు ఆ తరగతిలో మొదటి ర్యాంకు విద్యార్థి. 
       ఇద్దరూ 10వ తరగతికి వచ్చారు.  10వ తరగతి ప్రారంభంలో వాసు పరమేశును కలిసాడు.  ^పరమేశా! నీతో ఒక పెద్ద పందెం కాద్దామని అనుకున్నా. నువ్వు గెలిస్తే నేను లక్ష రూపాయలు ఇస్తాను. నేను గెలిస్తే నువ్వూ లక్ష రూపాయలు ఇవ్వాలి ." అన్నాడు.లక్ష రూపాయలు వస్తాయని మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నాడు పరమేశం.  10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఆ ఇద్దరిలో ఎవరు ఫస్ట్ వస్తే వారిది గెలుపు.  ఓడిపోయిన వారు గెలిచిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలి.  అదీ పందెం. తాను గెలవడం అసాధ్యం అని తెలిసినా లక్ష రూపాయలు వస్తున్నాయంటే ఆశ పుట్టింది.  ఎలాగైనా గెలవాలని పరమేశు నిశ్చయించుకున్నాడు. 
       అప్పటి నుంచి పరమేశు ప్రతిరోజూ సమయం వృధా చేయకుండా సీరియస్ గా చదవడం మొదలు పెట్టాడు.  అర్థం కాని విషయాలు ఉపాధ్యాయులతో చెప్పించుకుంటూ మార్కులు గణనీయంగా పెంచుతున్నాడు.  ఆటలు బంద్.  పందేలూ బంద్.  10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో వాసు మొదటి ర్యాంకు వచ్చాడు.  పరమేశుకు మొదటి ర్యాంకు రాలేదు కానీ,  చాలా మంచి గ్రేడు తెచ్చుకున్నాడు.  తల్లిదండ్రుల ఆశ్చర్యానికి అంతు లేదు.  వాసు పరమేశు ఇంటికి వచ్చాడు.  పరమేశుకు మంచి మార్కులు వచ్చినందుకు అభినందనలు తెలిపాడు. పరమేశానికి మొదటి నుంచి ఉన్న పందేల పిచ్చి, తాను కాసిన పందెం విషయం పరమేశు తల్లిదండ్రులకు వాసు చెప్పాడు. తన కొడుకులో మార్పు రావడానికి పందెం కారణమా. లక్ష రూపాయలు పోతే పోనీ కానీ,  తన కొడుకు చదువులో పడినందుకు తల్లిదండ్రులు సంతోషపడ్డారు.  "అలాగే బాబూ! త్వరలోనే నీకు డబ్బులు ఇస్తాము." అన్నారు.  "అలాగే అండీ. మీరు ఇచ్చినపుడే తీసుకుంటా. ఇప్పుడు పరమేశం చేతులతో స్వీట్స్ తినాలని ఉంది. " అన్నాడు వాసు.  పరమేశు స్వీట్స్ తేవడానికి లోపలికి వెళ్ళగానే "అంకుల్! లక్ష కాదు కదా! ఒక్క రూపాయి కూడా మీ నుంచి మాకు వద్దు. కానీ నేను డబ్బులు ఆశపడని విషయం పరమేశానికి తెలియవద్దు. ఆ భయానికే పరమేశం పందేలు మానేస్తాడు." అన్నాడు వాసు.  సంతోషంగా "అలాగే " అని అన్నారు. పరమేశం కష్టపడి చదవడం అలవాటు చేసుకొని భవిష్యత్తు బంగారు మయం చేసుకున్నాడు.

కామెంట్‌లు