విజయ రహస్యం : సరికొండ శ్రీనివాసరాజు
 అమరేంద్ర 9వ తరగతి పూర్తి అయింది. ఈ సారి వేసవి సెలవుల్లో చుట్టాల ఇంటికి ఎక్కడికీ పోకుండా ఇంటివద్దనే ఉండి 10వ తరగతికి సంబంధించిన సిలబస్ ముందుగానే ప్రిపేర్ కమ్మని, సీనియర్లను, సబ్జెక్ట్ నిపుణుల సహాయంతో అనుమానాలు నివృత్తి చేనుకుంటు, కష్టపడి చదవమని,  సీనియర్లు, శ్రేయోభిలాషులు అమరేంద్ర సలహా ఇచ్చారు.  కానీ మనోడు వింటేనా? వేసవి సెలవలు మొత్తం అమ్మమ్మ ఇంటికి వెళ్ళి,  కరువు తీరా ఆటలు ఆడి వచ్చాడు.  
     ఇప్పుడు అమరేంద్ర 10వ తరగతి విద్యార్ధి. పాఠశాల నుంచి ఇంటికి వచ్చాక గంటకు పైగా బయటకు వెళ్ళి,  ఆడుకొని రావడం,  ఆ తర్వాత ఇల్లు చేరి హోంవర్క్స్ చేసుకోవడం, పొద్దున్న 4:30కు లేచి చదువుకోవడం ఇది అమరేంద్ర దినచర్య.  ఆదివారాలు,  సెలవు రోజుల్లో ఇంటిపట్టున ఉండటం చాలా తక్కువ. స్నేహితులు,  శ్రేయోభిలాషులు ఎంత చెప్పినా మనోడు వినడు.  సంవత్సరం మొత్తం ఇలానే ఎంజాయ్ చేస్తూ పబ్లిక్ పరీక్షల సమయంలో కూడా రోజూ వారీ దినచర్య లాగా గంటకు పైగా  బయట ఆడుకుని రావడం,  ఆ తర్వాత పరీక్షల ప్రిపరేషన్ అమరేంద్ర దినచర్య. 
        పరీక్షల ఫలితాలు వచ్చాయి. అమరేంద్రకు అన్ని సబ్జెక్టులలో 10కి 10  జి. పి. ఎ. పాయింట్లు.  తెలిసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడ్డారు.  మనోడిని కలసి,  విజయ రహస్యం అడిగారు.  "నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నాకు బాగా కథలు చెప్పేది.  నాకు చూచి చదవడం వచ్చాక కథల పుస్తకాలను బాగా చదివించింది. తాను నాకు చెప్పిన నీతులు నాకు జీవితాంతం ఉపయోగపడుతున్నాయి. ఏదైనా ఏకాగ్రతతో వింటే మరచిపోము అని,  ఏరోజు పనిని ఆరోజే చేసుకోవాలని, వాయిదాలు వద్దని చెప్పింది. అది ఆచరించడం వల్లనే ఆడుతూ పాడుతూ ఒత్తిడి లేని చదువు కొనసాగిస్తున్నా.  చిన్న తరగతుల నుంచి ఎప్పటి చదువు అప్పుడే చదివితే 10వ తరగతికి వచ్చాక ఇంత ఒత్తిడి ఎందుకు ఉంటుంది చెప్పండి. ఇంకోసారి చెబుతున్నా. వినండి.  చదువుకు మూలం ఏకాగ్రత.  ఎప్పటి పనులు అప్పుడే చేసుకోవాలి." అన్నాడు అమరేంద్ర.  "నువ్వు చాలా గ్రేట్ అన్నయ్యా! ఈనాటి అమ్మమ్మలు, నాయనమ్మలు ఉన్నారే.  పొద్దస్తమానం సెల్ ఫోన్లలో, టీవీ సీరియళ్లలో మునిగి మనల్ని పట్టించుకోరు. మనకు కథలు,  నీతులు తెలిసే అవకాశం ఎక్కడిది? నీకు అంత మంచి అమ్మమ్మ దొరకడం నీ అదృష్టం. నేను ఈరోజు నుంచి ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను ఏకాగ్రతతో వింటా. ఎప్పటి పనిని అప్పుడే పూర్తి చేసుకుంటా." అన్నది శ్రుతి. 

కామెంట్‌లు