తెలంగాణబడ్జెట్లో విద్యకు 15% పైనే కేటాయించాలి ఎన్. జనార్ధన్, రిటైర్డ్ టీచర్  రాష్ట్రపతి అవార్డు గ్రహీత ప్రభుత్వ ఉపాధ్యాయ బాల కార్మిక విమోచన వేదిక,   తెలంగాణ.   9441720413

 తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్య ప్రతి పిల్లవానికి అందాలంటే 15% పైనే రాష్ట్ర బడ్జెట్లో విద్యకు కేటాయించాలి.....
పాఠశాల విద్యకు గతంలో బడ్జెట్ కేటాయించడంలో శ్రద్ధ చూపకపోవడం వల్ల ప్రభుత్వ విద్య ఈరోజు తీవ్ర సంక్షోభంలో కూర్చుని పోయినట్లుగా అగుపిస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో విద్య కొరకు గత ఎనిమిది సంవత్సరాల లో కొత్త పథకాలు ప్రవేశపెట్టడం కానీ ,మౌలిక వసతులకు అదనపు నిధులు కానీ, టీచర్లు మరియు పర్యవేక్షణాధికారుల నియామకాలు చేపట్టలేదనేది కనిపిస్తున్నది. ఈ విషయంలో మన రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న విషయాలను విశ్లేషణ చేసుకున్నట్లయితే ఈ క్రింది కొన్ని అంశాలు మనకు అగుపిస్తాయి. 2021-2022 రాష్ట్ర బడ్జెట్లో రెండు సంవత్సరాలకు గాను స్కూలు మౌలిక వసతుల కల్పనకు రూపాయలు 4000 కోట్లు కేటాయించారు. కానీ ఆ నిధులు ఖర్చు చేసే ప్రణాళికలు మాత్రము చేయలేదని అనిపిస్తున్నది. 
            నేడు కనిపిస్తున్న విషయాలను చూస్తుంటే 58 శాతం మంది బాలబాలికలు ప్రైవేట్ బడులలోనే చదువుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్న 40898 బడులలో ఒకటి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు 5926253 చదువుతున్నారు. అదేవిధంగా 10500 ప్రైవేట్ బడులలో విద్యార్థులు 34, 37,752 విద్యార్థులు చదువుకుంటున్నారు. అంటే ప్రభుత్వ బడులు ఎక్కువ పాఠశాలలో తక్కువ విద్యార్థులు చదువుతుండగా, తక్కువగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ విద్యార్థులు చదువుతున్న దృశ్యం దీంట్లో కనిపిస్తున్నది.   సమాజంలోని అట్టడుగున ఉన్న బడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్థిక వెనక బాటు తనమున్న తల్లిదండ్రుల పిల్లలు అందరూ చదువుకోవాలంటే, ఈ విషయాలలో ఆర్థిక వసతులు ఎక్కువ కావలసి వస్తుంది. ఎందుకనగా ప్రభుత్వము బడుల నిర్వహణ, కొత్త భవనాల నిర్మాణము టీచర్ల నియామకము నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం ,రవాణా సౌకర్యము, టీచర్లకు విద్యాసామర్ధ్యాలు అందించడానికి శిక్షణ, మొదలైన అంశాలకు ప్రణాళికాబద్ధంగా సరిపడు నిధులు కేటాయించాలి. విద్యాహక్కు చట్టం ప్రకారము ఇది ప్రభుత్వ బాధ్యత. అందుకు ఇప్పుడున్న దానికన్నా ఎక్కువగా విద్య కొరకు బడ్జెట్లో కేటాయించాలి. గతంలో జరిగిన కొన్ని విషయాలను చూస్తే మూడు విడుతలలో అమలు చేయాలని వేసిన మన ఊరు మనబడి లాంటి పథకాల ద్వారా సమస్య పరిష్కారం కాదు. పైపై ప్రతిపాదనలు కాకుండా సమగ్రమైన ప్రణాళికలు రూపొందించాలి. ఇందు కొరకు రాష్ట్ర విద్యారంగంలో మౌలిక వసతుల కల్పన కోసం బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించాలి. దీని కొరకు విజ్ఞానవంతులు ఆలోచించిన కొన్ని గణాంకాలను చూస్తే 28 142 ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతి అభివృద్ధి కోసం 9845 కోట్లు అవసరం. ఎందుకంటే పాఠశాలల్లో అదనపు తరగతి గదులు గ్రంథాలయం కోసం ల్యాబ్స్ కోసం 4480 కోట్లు అవసరమవుతుంది. మన రాష్ట్రంలో ఉన్న 445 రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం సుమారుగా మౌలిక వసతుల గురించి నిర్మాణం కోసం 7120 కోట్లు అవసరం అవుతుంది. ఈ విషయంలో గతంలో విద్య కొరకు విద్యాభివృద్ధి కొరకు సోషల్ డెమోక్రటిక్ ఫోరం ఒక బడ్జెట్ ఆలోచనతో వారు చేసిన ప్రతిపాదన చూస్తే రాష్ట్రంలోని స్కూల్స్ కోసం వాటి మౌలిక వసతుల కల్పన కోసం 21 445 కోట్లు కేటాయించవలసి వస్తుందని ఒక అంచనాను వారు ప్రభుత్వానికి తెలియజేయడానికి ఒక రిపోర్టు తయారు చేసినటువంటిది కూడా మనం చూడవచ్చు. ప్రభుత్వ ఆలోచన ఒక రకంగా ఉంటుంది వాస్తవమైన పరిస్థితి ఇంకోరకంగా ఉంటుంది. దానికిగాను రాష్ట్రంలో టీచర్ స్టూడెంట్ రేషియో నిష్పత్తి 1:20 మెరుగ్గా ఉందని ప్రభుత్వ ప్రకటనలు ప్రకటిస్తున్నాయి. కానీ ఫీల్డ్ పై కొన్ని గణాంకాలతో మనం చూస్తే బడ్జెట్లో కేటాయింపు ఎందుకు ఎక్కువగా కావాలనేది తెలుస్తుంది. టీచర్ల విషయంలో చూసినట్టయితే విద్యా వ్యవస్థలో సరిపడా టీచర్లు లేరనేది అవగతం అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ రంగంలో 18,240 ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్నాయి. ఒక్కొక్క స్కూలుకు కనీసం ఐదుగురు టీచర్లు ఉండాలి. ఇంకా చూసినట్లయితే కనీసం గ్రామపంచాయతీలో ఐదుగురు టీచర్లు ఉండాలి. దీని ప్రకారం మన రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలకు 63,845 మంది టీచర్లు అవసరమవుతారు. కానీ ఈ స్థాయిలో ప్రస్తుతం పని చేస్తున్న వరు  41587 ఉపాధ్యాయులు మాత్రమే. డైస్ 2019- 20 అంటే అదనంగా 22268 టీచర్లు అవసరం అవుతుందనేది తెలుస్తుంది. రాష్ట్రంలో 3164ప్రాథమికోన్నత పాఠశాలలు ఒకటి నుండి ఏడో తరగతి వరకు నడిచే పాఠశాలలు ఉన్నాయి. వీటికి ప్రతి స్కూల్ కు 5 ప్రైమరీ టీచర్స్ ప్లస్ ఇద్దరు పండితులు ప్లస్ ఇద్దరు స్కూల్ అసిస్టెట్లు  మొత్తం తొమ్మిది మంది ఉపాధ్యాయులు కావాలి. అంటే రాష్ట్రంలోని 3164 ప్రాథమికోన్నత పాఠశాలకు 9 మంది చొప్పున 28,476 మంది ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ప్రస్తుతము పనిచేస్తున్న వారు 17203 ఉపాధ్యాయులు మాత్రమే, కావున ఈ పాఠశాలలకు ఇంకా 11273 ఉపాధ్యాయులు భర్తీ కావలసి ఉంది. 
రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల యొక్క స్థితిగతులు చూసినట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం 4661 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుండి పదో తరగతి వరకు తరగతులు ఉంటాయి. ఆ ఉన్నత పాఠశాల   ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య 46,248 మంది. కానీ ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక హెచ్ఎం ప్లస్ ఒక పి ఈ టి ప్లస్ ఏడుగురు సబ్జెక్టు ఉపాధ్యాయులతో కలిసి 9మంది ప్రతి పాఠశాలకు ఉండాలి. దీని ప్రకారం 4661 ఉన్నత పాఠశాలలకు ఉండవలసిన ఉపాధ్యాయులు 41949 టీచర్లతో పాటు, ఆ పాఠశాలలో 250 ఆ పైన ఉన్న విద్యార్థులకు అదనంగా నలుగురు ఉపాధ్యాయులు అవసరం అవుతారు. ఉన్నత పాఠశాలలో 250 నుంచి 500 విద్యార్థులు అయితే ఏడుగురు ఉపాధ్యాయులు అదనంగా ఉండాలి. ఈ పద్ధతిలో పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి బడ్జెట్లో నిధులు అదనంగా కేటాయించవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడున్న బడ్జెట్ కాకుండా విద్య కొరకు 15% బడ్జెట్లో కేటాయించవలసిన అవసరం ఉంది. వీటి ద్వారా పై లెక్కల ప్రకారం పోస్టులను కొత్తగా ఏర్పాటు చేసి వెంటనే భర్తీ చేయవలసిన అవసరం ఉంది కాబట్టి.   
             ఈరోజు చదువుతున్న విద్యార్థుల యొక్క ఇంగ్లీష్ మీడియం యొక్క ప్రాధాన్యత పెరుగుతున్నది. మన రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో కలిసి దాదాపు 73.6% మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం లో చదువుతున్నారు. ఈ సంఖ్య ఇంగ్లీష్ మీడియం లో ఏటా పెరుగుతూ వస్తున్నది. కావున ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఇంగ్లీష్ టీచర్ల ఆవశ్యకత చాలా ఉంది. ప్రభుత్వం కూడా స్కూళ్లను ఇంగ్లీష్ మీడియాలుగా మార్చడం నిర్ణయాలు తీసుకుంటున్నది. ఈ ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందించడానికి అదనంగా క్లస్టర్ కు ఒక ఇంగ్లీష్ రిసోర్స్ టీచర్ను నియమించవలసిన ఆవశ్యకత ఏర్పడుతున్నది. అంటే 594 మండలాల్లో మండలానికి మూడు క్లస్టర్లు చొప్పున చూసినట్టయితే  1728 ఇంగ్లీష్ శిక్షణ పొందిన టీచర్స్ అవసరం అవుతున్నది. 
                   విద్యాభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో మానిటరింగ్ సిస్టం అనేది చాలా బాగుండాలి. ఆ విషయంలో మన రాష్ట్రాన్ని చూస్తే పర్యవేక్షణ కొరకు 33 జిల్లాలకు గాను పది జిల్లాల పూర్తి కాలపు జిల్లా విద్యాధికారులు ఉన్నారు. 66 మంది ఉపవిద్యాధికారులకు నలుగురు మాత్రమే పని చేస్తున్నది కనిపిస్తున్నది. మండలాల పరిస్థితి చూసినట్లయితే రాష్ట్రంలోని 594 మండల విద్యాధికారులు ఉండాలి కానీ నేడు 17 మంది మాత్రమే పనిచేస్తున్న విషయము కనిపిస్తున్నది. దీని ద్వారా మనకు నియంత్రణలో అధికారులు కావాలంటే విద్యా వ్యవస్థలో అధికంగా బడ్జెట్ కేటాయించవలసిన అవసరము అవగతం అవుతున్నది. ఈ యంత్రాంగా న్ని నిర్మాణం చేసుకోవడానికి కూడా అధిక బడ్జెట్ అవసరమవుతుందనేది ఈ విషయంలో కనిపిస్తున్నది. 
                   మన రాష్ట్రంలో విద్యార్థులు శారీరికంగా మానసికంగా అభివృద్ధి చెందాలని ప్రతి పిల్లవానికి మధ్యాహ్న భోజనం అందించాలని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కానీ ఆ విషయంలో చూసినట్టయితే వారికి అందించే మధ్యాహ్న భోజన పథకం కు కావలసిన నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉండడం కనిపిస్తున్నది. కావున పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా నిధులు పెంచాలి. ఈ విషయంలో చూసిన బడ్జెట్ పెంచాలని తెలుపుతున్నది. ఇందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిధులు పెంచేటట్లు ప్రణాళిక తయారుచేసి విద్యార్థులందరికీ నాణ్యమైన మధ్యాహ్న భోజన పథకం అందేటట్లు చూడవలసిన అవసరం ఉన్నది. 
            కొన్ని సమస్యలను మనము ఒకసారి చూస్తే ఈ బడ్జెట్ పెంచడం కూడా అవసరమనేది కనిపిస్తుంది. తెలంగాణలో 27.4% విద్యార్థులు పదో తరగతి పూర్తి కాకుండా బడిమాని వేస్తున్న విషయాలు గణాంకాల ద్వారా మనకు తెలియజేస్తున్నాయి. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఆలోచిస్తే, వారికి నాణ్యమైన విద్య అందేటట్లు చూడడం తక్షణ కర్తవ్యం. ఈ విషయంలో కూడా బడ్జెట్ పెంచడం అనేది అవసరం అనేది మనకు తెలియజేస్తున్నది. 
                మనకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నివేదిక అనుసారం అభ్యసన ఫలితాలలో 240 పాయింట్లకు గాను తెలంగాణ రాష్ట్రము 36.6.లతో దేశంలోని 36 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు గాను  తెలంగాణ 35వ స్థానంలో ఉంది. మనకంటే మేఘాలయ రాష్ట్రము ఒకటి వెనుకబాటుతనంతో ఉంది. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్రము మౌలిక వసతులలో ఏర్పాట్లలో కూడా  వెనుకబాటుతో ఉన్నదనేది ఈ రిపోర్ట్ లో కనిపిస్తున్నది. కావున వీటి ఆలోచన తోనైనా రాష్ట్రంలోని విద్యాభివృద్ధిని సరి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించబోయే విద్యా బడ్జెట్  కేటాయింపులు అధికంగా జరగాలి. 
               మన కేటాయింపులో అన్ని ప్రాంతాలకు ఒకే రకంగా అంటే సమానంగా బడ్జెట్ కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. కానీ పట్టణ ప్రాంత విద్యార్థుల అవసరాలు, గ్రామీణ ప్రాంత విద్యార్థుల అవసరాలు భిన్నంగా ఉంటాయి. దీనికి తగ్గట్టుగానే ప్రణాళికలు రూపొందించాలి. కావలసిన నిధులను కేటాయించాలి. ఇది జరిగితేనే అన్ని ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు మంచి విద్యను పొందగలరు. 
                    ఇన్ని విషయాలు పరిశీలిస్తే బడ్జెట్ కేటాయింపు సుమారుగా 15%నుండి 20% వరకు కేటాయిస్తే, మన రాష్ట్రంలో గత పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురి అయిన ప్రభుత్వ విద్యను గాడిలో పెట్టడానికి రాష్ట్ర బడ్జెట్లో పైన తెలిపిన విధంగా కేటాయించాలని అందరి ఆలోచన. 
                ఎందుకంటే నిర్లక్ష్యానికి గురి అయిన విద్యావ్యవస్థను, విద్య హక్కు చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం నేడున్న విద్యా వ్యవస్థను, పటిష్టపరచవలసిన ఆవశ్యకత ఉంది. ప్రభుత్వము నేటి విద్యా వ్యవస్థకు తగ్గట్టుగా విద్యకు కావలసిన సరియైన బడ్జెట్ను కేటాయిస్తే, బడులు నిలబడగలుగుతాయి, తెలంగాణలో దిగజారిన విద్యా ప్రమాణాలు మెరుగు పడగలుగుతాయి. అందుకే తెలంగాణ రాష్ట్రం, రాష్ట్ర బడ్జెట్లో సుమారుగా 15% అయినా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి కేటాయిస్తుందని నమ్ముతున్నాం.  

కామెంట్‌లు