ఆడ మనసు...:- ప్రమోద్ ఆవంచ - 7013272452

 పడమర తన రోజు వారి సంధ్యారాగం 
ఆలపిస్తుంది 
చీకటి పడ్డ జీవితం చుట్టూ ఒక నైరాశ్యం
వీధులన్నీ నిర్మానుషమయ్యాయి 
వీధి దీపాలు తప్ప ఇండ్లల్లో అంతా చిమ్మన చీకటి 
తప్పతాగి వచ్చిన ఆ ఇంటి మనుషుల గురకలు 
తప్ప ఊరంతా నిశ్శబ్దంగా ఉంది 
గాలి లేదు ఊపిరి ఆడడం లేదు మొగడి గురకతో 
నిద్ర పట్టని ఆడ మనిషి...
నులక మంచం మొగుడికి...పక్కనే కింద నేల చాప 
తనకి ..
ఆ పక్కనే ఇంకో మంచం మీద ఖళ్ళు ఖళ్ళుమనీ 
దగ్గుతూ మామ
తన పక్కన పడుకున్న పిల్లలు దొర్లుకుంటూ చెల్లాచెదురుగా పడివున్నారు 
అందరినీ దగ్గరకు తెచ్చుకొని చలి పెట్టకుండా 
కప్పు కప్పింది.
కొడుకు వైపు ప్రేమగా చూస్తూ వంటికి 
కరుసుకుంది 
ఎప్పుడో అపరాత్రి కన్ను మలిగింది 
కోడి కూసింది మెలుకువ వచ్చింది 
పొరక చేతబట్టి వాకిలంతా ఊడ్చింది పెండ నీళ్ళతో 
చానిపి చల్లింది ముగ్గు పెట్టింది 
కోళ్ళపై కమ్మిన బుట్టను తీసింది పిల్లల కోడి తన 
పిల్లలతో బయటకు పరుగు తీసింది 
బర్రె పాలు పితికింది దూడెను వదిలింది 
కట్టెల పొయ్యి మీద అన్నం ఉడుకుతుంది 
ఎదుగూ బొదుగూ లేని తన జీవితం కరిగిపోతుంది 
సాగిపోతుంది...
మస్తిష్కంలో ఆలోచనలు ఎసట్లో వేడి నీళ్ళలా మరిగిపోతున్నాయి
చేసిన అప్పు ఇంకా తీరలేదు పిల్లల చదువుల
ఖర్చు, పండుగ పబ్బాలు,చుట్టపోళ్ళ చేయి 
కడగడాలు, ఆడపడుచు వడిబియ్యాల తంతు 
అన్నం ఇంకా ఉడకలేదు....కానీ మస్తిష్కంలో 
ఆలోచనలు ఉడుకుతూనే ఉన్నాయి...
ఒకవైపు ఆలోచనలు... మరోవైపు ఇంటి పనులు 
పరుగులు పెడుతూనే ఉన్నాయి .....
పిల్లలు లేచారు.. వాళ్ళ ముఖాలు కడిగి శుభ్రంగా 
స్నానం పోసి స్కూలుకి తయారు చేసింది 
పొయ్యి మీద అన్నం అడుగంటిన వాసన...
జీవితమే కడగంటుకుపోతే అన్నం అడుగంటితే 
ఒక లెక్కా...అని..అనుకుంటూనే....
ఉరుక్కుంటూ పోయి అన్నం గిన్నెను కిందికి 
దించింది 
మూడు రాళ్ళ మధ్య మండే మంటలు తన 
ఆలోచనలకు ఇంకొంచెం ఆజ్యం పోసాయి 
ముఖం వర్ణాన్ని మార్చిన మంటలు మనసును 
దావానలంలా వ్యాపించాయి 
ఆలోచనలు... వందల్లో..వేలల్లో.. లక్షల్లో..
పిల్ల మీద ప్రేమ చంపుకోలేక భర్త మీద 
కోపం తీర్చుకోలేక చేతిలోని రాతెండి గంటెను 
నేలకు ఇసిరి కొట్టింది 
బయట మామ మంచం నుంచి ఖళ్ళు ఖళ్ళు 
మంటూ శబ్దం 
ఉలిక్కిపడి లేచిన మొగుడు ఏమయ్యిందే అంటూ 
ఇంట్లోకి వెళ్ళాడు 
నిద్ర అవస్థలో ఉన్న అతనికి పరిస్థితి అర్థం 
కావడానికి కొంత సమయం పట్టింది 
అరే చెప్పడం మరిచానే నిన్న నీ కోసం చీర కొన్నాను 
సంచీలో పెట్టి మర్చిపోయాను 
అంటూ...
చీరను తన చేతికందించాడు.. చీరను చూసిన 
భార్య ముఖంలో వేల విధ్యుల్లతలు...
భళ్ళున విచ్చుకుందో నవ్వు...
పండ్లు తోముకోవయ్యా ఛాయ్ పోస్తా.. అంటూ 
పొయ్యి దగ్గరకు వెళ్ళింది.
మంట ఇప్పుడు చలి కాసుకున్నట్టుంది...
ఆలోచనలన్నీ పొయ్యిలో కలిసిపోయి 
చీర వెలుగులు కళ్ళ ముందు 
రంగులమయమయ్యాయి.....
                          
కామెంట్‌లు