రంగు మారిన కుండ:-డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212

 ఒక ఊరిలో ఒక పాలెగాడు వుండేటోడు. పాలెగాడు అంటే  ఆ ఊరికి అతనే అధికారి. అతను చానా నిజాయితీపరుడు. తెలివైనవాడు. ఎటువంటి తగవునైనా సరే చక్కగా తెంచేవాడు. తనవారయినా, పరాయివారయినా, ధనవంతుడయినా, పేదవాడయినా అందరినీ ఒకేలా చూసేవాడు,  దాంతో ఆ చుట్టుపక్కలంతా అతనికి చానా మంచిపేరు వుండేది.
ఒకసారి ఆ ఊరికి ఒక ముని వచ్చినాడు. అతనికి ఆ పాలెగాని నిజాయితీ చానా బాగా నచ్చింది. అతనికి ఒక బంగారు కుండ ఇచ్చి ''చూడు ఇది అలాంటిలాంటి మామూలు కుండగాదు. మహిమలున్న కుండ. మనం ఎంత నిజాయితీగా గొడవ తెంచుతా వున్నా అప్పుడప్పుడు తప్పులు చెబుతా వుంటాం. ఏదయినా తగవు తెంచినాక ఈ కుండవైపు ఒకసారి చూడు. అది అలాగే బంగారు రంగులో ధగధగా మెరిసిపోతా వుంటే నీమాటే వేదం. అలాగాక నల్లగా మసిపట్టిన దానిలాగా మారితే నువ్వు తప్పు చెప్పినట్టు. వెంటనే ఇంకోసారి ఆలోచించి నీ తప్పును సరిదిద్దుకో'' అన్నాడు.
అప్పటినుంచీ ఆ పాలెగాడు ఆ బంగారు కుండను ఒక గదిలో పెట్టి తాను ఏదైనా తగవు  తెంచగానే దాని వంక ఒకసారి చూసేవాడు.
ఒకసారి రామయ్య, సోమయ్య అనే ఇద్దరు ఒక ఆవును తీసుకొని అది నాదంటే నాదంటూ గొడవపడతా ఆ పాలెగాని వద్దకు వచ్చినారు.
రామయ్య పాలెగాని వంక చూసి ''దొరా... ఈ ఆవు నాదే... రెండు నెలల కింద తప్పిపోయింది. చిన్నప్పటి నుంచీ దాని వీపు మీద పెద్ద నల్లని పుట్టుమచ్చ వుంది చూడండి''  అన్నాడు.
దానికి సోమయ్య ''లేదు దొరా... ఇది నాదే... నాలుగు నెలల కిందట కందనవోలు సంతలో కొనుక్కోని వచ్చినా'' అని చెప్పినాడు.
ఆ పాలెగాడు బాగా ఆలోచించి ''దీన్ని తీసుకోని పోయి వూరిబైట అడవిలో వదలండి. అది దారి కనుక్కోని ఎవరింటికి పోతే వాళ్ళది'' అన్నాడు. 'సరే' అని భటులు దాన్ని తీసుకోని పోయి వూరిబైట చానా దూరంగా వదిలినారు. అది దారి కనుక్కుంటా కనుక్కుంటా చక్కగా సోమయ్య ఇంటికి పోయింది. దాంతో అవును సోమయ్యకు ఇచ్చివేసి అలవాటుగా బంగారు కుండవైపు చూసినాడు. ఎప్పుడూ ధగధగ మెరిసిపోయే ఆ కుండ ఒక్కసారిగా నల్లగా మారిపోయింది.
''అరెరే... ఏదో తప్పు చేసినట్టున్నానే'' అనుకుంటా రామయ్య సోమయ్యలను ఆపినాడు. బాగా ఆలోచించి ''మీరు పోయి మీ పెళ్ళాం బిడ్డలను పిలుచుకొని రండి'' అని చెప్పినాడు. కాసేపటికి అంతా వచ్చినారు.
పాలెగాడు రామయ్య, సోమయ్యల పెళ్ళాల వంక చూసి ''పోండి... పోయి మీరు ఆ ఆవు పాలు పితకండి'' అన్నాడు. రామయ్య పెళ్ళాం పోయి పాలు పితికింది. అది ఏమీ చేయలేదు. సోమయ్య పెళ్ళాం పోయి పాలు పితకబోయింది.  అది తల అడ్డంగా వూపుతా ఆమెను కాలితో తన్నింది.
అది చూసిన ఆ పాలెగాడు ''సోమయ్య వంక తిరిగి ''సోమయ్యా... నిజం చెప్పు. ఇది నీది కాదు. పశువులు చాలాకాలం మన దగ్గర వుంటే మనకే కాదు మన ఇంటిలో వుండే అందరికీ మచ్చిక అవుతాయి. కానీ ఇది నీ పెళ్ళాన్ని దగ్గరికి రానివ్వడం లేదు. తప్పు ఒప్పుకొంటావా లేక వంద కొరడా దెబ్బలు శిక్ష విధించమంటావా'' అని హెచ్చరించినాడు.
వెంటనే సోమయ్య పాలెగాని కాళ్ళమీద పడి ''దొరా... నన్ను మన్నించండి. బుద్ధి గడ్డి తిని అబద్ధం చెప్పాను. ఆ ఆవు రామయ్యదే. ఒక రోజు అడవిలో మేతకు పోయినప్పుడు ఎత్తుకొని వచ్చాను. నెలరోజులుగా బాగా తిండి పెడతా మచ్చిక చేసుకొని రోజూ అడవి నుంచి మాఇంటికి బాగా తిప్పాను. అందుకే దానికి మా దారి తెలిసిపోయింది'' అన్నాడు.
ఆ పాలెగాడు ఆవును రామయ్యకు ఇచ్చి వంద వరహాలు సోమయ్యకు జరిమానా వేశాడు.
***********
కామెంట్‌లు