ఒకూర్లో ఒక అత్త వుండేది. ఆమెకు కోడలంటే అస్సలు పడేది కాదు. చీటికీ మాటికీ ఆమెను తిడతా కొడతా ఏడిపించేది. ఒకరోజు అత్త తన ఇంటి పెరట్లో ఒక బీరగింజ నాటింది. కొద్ది రోజులకే అది బాగా పెరిగి పెద్దదై కుప్పలు తెప్పలుగా కాయలు కాయసాగింది...
కోడలికి ఆ బీరకాయలు తెంపుకోని మంచిగా కూర చేసుకొని తినాలని ఎంతో ఆశ. కానీ అత్తేమో ఆ కాయలన్నీ తెంపి తానొక్కతే వండుకోని బాగా తినేది. మిగిలితే ఎదురింటోళ్ళకు, పక్కింటోళ్ళకు ఇచ్చేదేగానీ కోడలికి మాత్రం ఒక్క ముక్క కూడా పెట్టేది కాదు.
ఒక రోజు వాళ్ళింటికి అత్త చిన్న తమ్ముడు వచ్చి "ఆకా... అకా... ఈ వారం నా కూతురి పెళ్ళి. నువ్వు తప్పకుండా మా వూరికి రావాల" అని పట్టుపట్టినాడు. సరేనని అత్త తమ్మునితోబాటు పెళ్ళికి పోయింది. అంతే... అత్త అట్లా బైటికి పోవడం ఆలస్యం, కోడలు సంబరంగా వురుక్కుంటా పెరట్లోకి పోయి బీరకాయలన్నీ తెంపి కూర వండుకోని బాగా తిని, తీగ మొత్తం పీకి దిబ్బలో పడేసింది.
నాలుగు రోజుల తర్వాత అత్త వచ్చి చూస్తే ఇంగేముంది తీగా లేదు, కాయలూ లేవు. ఇదంతా కోడలు పనేనని గ్రహించిన అత్తకు ఆమె మీద పీకల దాకా కోపమొచ్చింది. రాత్రి కోడలు అన్నం తిని నిద్రపోగానే ఓ పెద్దకర్ర తీసుకోనాచ్చి ఆమె నెత్తిన ఒక్కటేసింది. అంతే ఆ దెబ్బకు కోడలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి అచ్చం శవం మాదిరి పడిపోయింది. ఎంత కదిపినా లెయ్యలేదు. అది చూసి కోడలు చచ్చిపోయిందని అనుకోనింది అత్త.
అంతలో ఆమె కొడుకు పొలం నుండి ఇంటికి వచ్చినాడు. వెంటనే అత్త దొంగ ఏడుపు ఏడుస్తా "రేయ్! నీ పెండ్లానికి ఏమయిందో ఏమో... ఎంత పిల్చినా పలకడం లేదు. పో! పోయి చూడుపో" అనింది. దాంతో వాడు పోయి పెండ్లాన్ని అటూ యిటూ కుదిపినాడు. గట్టిగా పిలిచినాడు.
ఆమె స్పృహలో లేదు కదా. అందుకే ఏమీ మాట్లాడ లేదు. దాంతో వాడు కూడా పెండ్లాం చచ్చిపోయిందని అనుకున్నాడు.
ఇద్దరూ శవాన్ని తీసుకోని చీకట్లోనే శ్మశానానికి పోయినారు. దాన్ని కట్టెల మీద పడుకో బెట్టి అంటిద్దామని చూస్తే అగ్గిపెట్టె లేదు. దాంతో అత్త "రేయ్! నువ్వు ఇంటికాడికి పోయి అగ్గిపెట్టె తీసుకోని రాపో" అని కొడుక్కి
చెప్పింది. దానికి వాడు "నాకొక్కనికే చీకట్లో పోవాలంటే భయం. నువ్వు కూడా తోడుగా రా" అన్నాడు. సరేనని ఆమె కొడుకుతో పాటు వూళ్ళోకి పోయింది.
వాళ్ళట్లా వూళ్ళోకి పోయిన కాసేపటికే కోడలికి స్పృహ వచ్చింది. లేచి చూస్తే ఇంకేముంది... శ్మశానంలో కట్టెల మీదుంది. ఆమెకు జరిగిందంతా అర్ధమై నెమ్మదిగా లేచి పక్కనే పడున్న తుమ్మమొద్దుకు తన తెల్లచీర సగం చించి కట్టి, దానిని కట్టెల మీద పెట్టింది. తానేమో పక్కనే వున్న చింతచెట్టు మీదకు ఎక్కి ఏం జరుగుతుందా అని చూడసాగింది. కాసేపటికి అగ్గిపెట్టె తీసుకోని కొడుకుతో అక్కడికొచ్చింది అత్త. చీకటి కదా సరిగా కనబడక తుమ్మ మొద్దునే కోడలనుకోని నిప్పు పెట్టింది. బాగా మంట అంటుకోని, కాలి బూడిదైపోగానే వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినారు.
కోడలు చింతచెట్టు దిగుదామనుకుంటుండగానే నలుగురు దొంగలు అక్కడికి వచ్చినారు. వాళ్ళు చింతచెట్టు కిందనే కూర్చుని చుట్టుపక్కల వూళ్ళలో ఎత్తుకొచ్చిన బంగారం, రత్నాలు, వజ్రాలు, నగలు కుప్పలు కుప్పలుగా పోసి ఎవరి భాగం వాళ్ళు పంచుకోసాగినారు. ఇదంతా పైనుండి చూస్తా వున్న కోడలు ఎట్లాగైనా సరే ఆ బంగారం కొట్టేయాలనుకోని 'ఓ' అని దయ్యం మాదిరి భయంకరంగా అరుస్తా దభీమని వాళ్ళ మీదకు దుంకింది. అంతే నలుగురు దొంగలు అదిరిపడినారు. చూస్తే యింకేముంది తెల్లచీరతో, జుట్టంతా విరబోసుకుని 'ఓ' అని ఊగుతా వుంది. వాళ్ళు వచ్చింది దయ్యమేననుకోని భయంతో గజగజా వణుకుతా ఎక్కడివక్కడ వదిలేసి తలో దిక్కు పారిపోయినారు. కోడలు బంగారమంతా మూటగట్టుకోని సంబరంగా ఇంటికి పోయింది. తలుపులేమో మూసి వున్నాయి. దాంతో 'అత్తా! అత్తా!" అని పిలుస్తా తలుపు కొట్టసాగింది. ఎవరబ్బా అని లేచి తలుపు తెరిచిన అత్తకు ఎదురుగా కోడలు కనబడేసరికి ఇది దయ్యమై నన్ను పీక్కుతినడానికే వచ్చిందనుకోని భయపడి అక్కడికక్కడే గుండె పగిలి దభీమని కిందపడి చచ్చిపోయింది. పెండ్లాన్ని చూసి మొగుడు గజగజా వణుకుతా వుంటే ఆమె జరిగినదంతా చెప్పింది. వాడు “అలాగా" అని సంబరపడినాడు. ఆమె తెచ్చిన బంగారంతో పదంతస్తుల మిద్దె కట్టుకోని హాయిగా బతకసాగినారు.
***********
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి