సహాయం..:--- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి- 9441561655
 మారుపాక అనే గ్రామంలో  ఒక  పిల్లి ఉండేది. ఒక రోజు ఆహారం కోసం  వెతుకుతుండగా  దానికి చనిపోయిన కోడి కనిపించింది. వెతికే తీగ కాళ్లకు  తగిలినట్లు పిల్లికి ఆరోజు  పండుగ అనిపించింది. ఎవరు చూడకుండా పొదల చాటున  పెట్టుకుని తిందామని  కోడిని  లాక్కెళ్ళింది. అంతకు మునుపే గుబురు చెట్ల మధ్యన  ఒక కుక్క కనిపించింది. దాంతో పిల్లి గుండె గుబేలుమంది. ఏదో అనుకుంటే ఏదో అవుతుందని భయపడ సాగింది.
         మెల్లగా పిల్లి తన గుండె నిబ్బరం చేసుకొని  " ఏమి కుక్క బావ! బాగున్నావా? " అని         మూలుగుతున్న కుక్కతో మెల్లగా అంది పిల్లి. ఐదు రోజుల నుంచి ఎంత వెతికినా  ముత్యమంతా   ఆహారం ఎక్కడ నాకు దొరకలేదు. వాడ వాడ తిరిగి అలసిపోయాను. పైగా మనుషులు నన్ను కొట్టడం ప్రారంభించారు. ఇప్పుడు లేచే శక్తి నాకు లేదు. ప్రాణం పోయేలా ఉంది " అని కుక్క అంది నీరసమైన గొంతుతో.
    అయ్యో!  అలాగా... నాకు పెద్దగా ఆకలి లేదు. నీ ప్రాణమే నాకు ముఖ్యం. ఈ కోడిని  ఆహారంగా స్వీకరించు. నాకు ఇంతకన్నా పుణ్యమేమి ఉంటుంది?" అని పిల్లి కోడిని కుక్క ముందు ఉంచి వెళ్లిపోయింది.
కుక్క అంతులేని ఆనందంతో  సంబరపడి కడుపునిండా తినింది.
       కొంత కాలం తర్వాత  ఒకరోజు కుక్క తన పిల్లలతో దారి గుండా వెళ్తుంటే  పిల్లి దాని ఏడుస్తున్న  పిల్లలు కనిపించాయి. పిల్లి తనకు గతంలో చేసిన సహాయం గుర్తుకొచ్చి  కృతజ్ఞతలు చెబుదామని  కుక్క దగ్గరకు పోసాగింది.  " దాని రాకను గమనించిన పిల్లికి జెర్రీ పారినంత భయమేసింది. చెమటలు పడ్డాయి. నా పిల్లల్ని తింటుందా ఏమి? అని మనసులో భయపడుతూ   పరుగు పెట్ట సాగింది.
   కానీ కుక్క ఏమి చేయకుండా, భయపడకండి అల్లుడు అని పిల్లితో అంటూ... గతంలో నీవు నాకు ప్రాణం పోసావు. నీకు థాంక్స్ చెబుదామని దగ్గరకు వస్తున్నాను. అవును నీ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు ? అని కుక్క ఆప్యాయంగా అడిగింది.
     "నా దగ్గర పాలు వాటికి సరిపోవడం లేదు. ఆకలితో ఏడుస్తున్నాయి " అని పిల్లి బాధతో కన్నీరు కార్చింది.
      ఓహో! అలాగా.. నేను ఓ తల్లినే. నీ బాధను అర్థం చేసుకోగలను.  నా దగ్గర పాలు పుష్కలంగా ఉన్నాయి. నీకు అభ్యంతరం లేకపోతే  నా పిల్లలుగా భావించి నీ పిల్లలకు పాలు ఇస్తాను. ఇప్పుడే కాదు పెరిగి పెద్దయ్యే దాకా సహాయం చేస్తాను. ఇలాగైనా నీ రుణం కొంచమైనా  తీర్చుకోనివ్వు " అంటూ  కుక్క పిల్లి పిల్లలకు  పాలు ఇచ్చింది.
     చేసిన మేలు మర్చిపోయే ఈ లోకంలో  గుర్తుపెట్టుకుని  కృతజ్ఞతలు చెప్పే వాళ్లు ఎంతమంది ఉంటారు? అని ఆశ్చర్యంతో  నోటి మాట రాక  కుక్క చేసిన సహాయాన్ని తలుచుకుంటూ  పిల్లి ఆనందభాష్పాలు రాల్చింది.
          
   

కామెంట్‌లు