చెన్న వారి ముత్యాల హారాలకు ఆహ్వానం!:- విద్వాన్ గుర్రాల లక్ష్మారెడ్డి.-సహస్ర కవి, కల్వకుర్తి.-ఎం. ఏ .బి .ఈ. డి. నాగర్ కర్నూల్ జిల్లా. తెలంగాణ .-సెల్.9491387977.

 మన మాతృభాష అయిన తెలుగు భాషా సాహిత్యాన్ని ప్రాచీన కాలంలో మన ప్రాచీన కవులు పద్య, గద్య, నాటక, కథ మొదలగు వివిధ ప్రక్రియలలో సుసంపన్నం చేశారు. భాషా పరి ణామ క్రమంలో కొత్త కొత్త ఎన్నో ప్రక్రియలు పుంకాను పుంకలుగా పుట్టుకొచ్చాయి. అలా వచ్చిన వాటిలో" ముత్యాల హారాలు" ప్రక్రియ విశేష ఆదరణ పొందింది. ఈ నూతన ప్రక్రియ సృష్టికర్త శ్రీ రాథోడ్ శ్రవణ్ గారు అదిలాబాద్ జిల్లా. ఇది మాత్రా చందస్సుకు చెందిన లఘు పక్రియ. ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి. నాలుగో పాదాలకు అంత్యప్రాస ఉండాలి. ప్రతి పాదంలో 10 నుండి 12 మాత్రలు ఉండాలి. నాలుగో పాదాలు కలిపి చదివితే భావాత్మకంగా ఉండాలి.
          ఇలా తెలుగు భాష సాహిత్యంలో వస్తున్న నూతన ప్రక్రియలను శోధన, పరిశోధన చేసిన వర్తమాన యువ కవి, ఆదివాసి ముద్దుబిడ్డ, ప్రకృతి ఆరాధకుడు, ఉపాధ్యాయుడు శ్రీ బానోతు చెన్నారావు గారు ప్రధమంగా "హరివిల్లు" ప్రక్రియను ఎన్నుకొని అందులో ఎన్నో హరివిల్లుల కవితలు వ్రాసి పుస్తకాన్ని తీసుకొచ్చారు. తన రెండో ప్రయోగంగా సమ్మోహనాల ప్రక్రియలో "హృదయ లయలు" అను పుస్తకం వేశారు. ఆపై అంతటితో ఊరుకోక ముచ్చటగా మూడోసారి ముత్యాల హారాలు ప్రక్రియను ఎన్నుకొని రంగంలోకి దిగారు. వీరు సుమారు 500 ముత్యాల హారాలు వ్రాశారు. ఇలా నూతన ప్రక్రియను శోధించి సాధించి వాటిలో తక్కువ కాలంలోనే వందల కొలది ముత్యాల హారాలను రాయడం అంటే వారి పట్టుదల, సాహిత్య పిపాస, తీరని కవిత్వ దాహార్తి ఎంతుందో మనం అర్థం చేసుకోవచ్చు.
         ఈ నూతన ప్రక్రియలో అద్భుతమైన ముత్యాల హారాలను లిఖించి పుస్తకాన్ని తీసుకొస్తున్నందుకు వారిని మనసారా అభినందిస్తున్నా. వారు ఈ ముత్యాలహారాల పుస్తకానికి "ముందుమాట "వ్రాయాలని కోరుతూ నాకు అవకాశం కల్పించినందుకు వారికి నా హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదములు. అయితే ముందుమాట వ్రాయాలని కోరే నా తోటి వారికి నేనెప్పుడూ చెబుతుంటాను. ఎవరు ఎప్పుడైనా, ఏ ప్రక్రియలో రాసిన అందులో మౌలికంగా కవిత్వం ఉండాలని, వస్తువు అనేది వారి వారి అనుభవసిద్ధి. శ్రీ బానోతు చెన్నారావు గారు ముత్యాల హారాల కవితల్లో భావన పౌష్కల్యం దండిగాను, నిండుగాను ఉన్నది. చూడండి ఈ ముత్యాల హారం కవిత.
పచ్చని పైరూ పండాలి.
అందరి కడుపు నిండాలి
ఆరోగ్యంగా ఉండాలి
కలసి మెలసి ఉండాలి !
    ప్రకృతి ఆరాధన, ఐక్యత గుణం, ఇరుగుపొరుగు వారితో సాన్నిహిత్యం, వారి క్షేమం, సంక్షేమం కోరి వసుధైక కుటుంబంలా అంతా ఉండాలని, వారు కోరుకునే నిజాయితీగల గుణం ఈ కవితలో పుష్కలంగా ఉంది. కవి గారికి కీర్తి పరుగుల దాహం లేదు. ఆర్తీ, ఆరాటంతో ఉన్న వాస్తవాన్ని విషద పరచడం తప్ప. ఇలాంటి మంచి హృదయం ఉన్నప్పుడే మంచి కవిత్వం నిలబడుతుంది.
రైతు ఉంటేనే మెతుకు
మెతుకు ఉంటేనే బతుకు
బతుకు ఉంటేనే చురుకు
చురుకు ఉంటేనే పలుకు !
   చూడండి కవిగారి స్పందన. అందరికీ అన్నదాత మన రైతన్నే అనే విషయాన్ని అలతి అలతి పదాలతో, గజిబిజి లేకుండా స్పష్టతతో అల్లిన కవిత్వాన్ని మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ, తాను కవితలోకి పరకాయ ప్రవేశం చేసిన విధానం అద్భుతం. అందుకే ఈ కవిత అద్దంలో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉన్న వాస్తవ గుణాన్ని తెలుపుతుంది.
ముచ్చటగా మూడో కవిత
ఓడినంత మాత్రాన
చేయరాదు చులకన
చిట్ట చివర ప్రయత్నించిన
విజయం వచ్చు ఇహమున !
     మనిషికి యత్నం, ప్రయత్నం ఏ పనిని సాధించుటకైన తప్పక కావాలని, అట్టి ప్రయత్నంలో విజయం తప్పక లభిస్తుందన్న సత్యాన్ని ఈ కవితలో మనం గమనించవచ్చు. భావపుష్టి పుష్టికరంగా ఉన్న కవిత ఇది. భావం లేనిదే కవిత లేదు. ఒక భావం కవి మనసులో పుట్టి, రూపు దిద్దుకొని, సంపూర్ణ అవయవాలతో మనసులో నిలవలేక బయటపడాలి. అప్పుడే అది మంచి కవిత్వం అవుతుంది. దీనినే భావ పుష్టి అంటారు. దీన్ని పూర్వం భార వేదార్థ గౌరవం అని మన పూర్వీకులు అన్నారు. తిక్కన సోమయాజి ఏమో భవ్య కవిత వేశం అన్నారు.
ఇక నాలుగో కవితలోకి వెళితే
వనాలను పెంచాలి
వర్షం అంతటా పడాలి
అడవి జీవులు బతకాలి
వాటికి స్థావరం అవ్వాలి !
మనందరి కర్తవ్యాన్ని సూచిస్తూ, వన్యప్రాణులపై ప్రేమను వ్యక్తపరుస్తూ, పర్యావరణ స్పృహను మనలో కలిగిస్తాడు కవి. వనాల ప్రాముఖ్యతను స్పష్టపరుస్తూ, ఇలా తన ముత్యాల హారాలలో భావుకత్వం, కించత్ ప్రేరణ, చెల్లించిపోగల హృదయ స్పందన శక్తిని నింపాడు కవి.
తన ముత్యాల హారాల కవితల్లో అంతర్లీనంగా దాగిన భావ స్పష్టతను ఆలోచనాత్మకంగా, సృజనాత్మకంగా చెప్పగలగడమే ముఖ్యం. అప్పుడే చదివే పాఠకులు నూతన ప్రక్రియ ఏదైనా అటువైపు మొగ్గు చూపుతారు. ఇలాంటి ప్రయత్నం చేసిన నా తోటి కవి మిత్రుడు శ్రీ బానోతు చెన్నారావు గారిని అభినందించకుండా ఉండలేను.
వ్రాసిన కవితలు విమర్శలకు గురికాకుండా నిలవాలంటే ఆ కవితలు భావపుష్టితో పాటు లోక వృత్త పరిజ్ఞానం కూడా ఉండాలి. ఈ పరిజ్ఞానాన్ని పుష్కలంగా కలిగిన శ్రీ బానోతు చెన్నారావు గారు మునుముందు ఇంకొన్ని కొత్త ప్రక్రియలను చేపట్టి, తన కలం నుండి సరికొత్త కవితలను లిఖించి సాహితీ రంగంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని ఆశిస్తూ, దీవిస్తూ నా ఆశీర్వచనాలను వారికి అందిస్తున్నాను.

కామెంట్‌లు