క్రాంతికారి యుగ పురుషుడు.. సంత్ సేవాలాల్ మహారాజ్ జయింతి..:- రాథోడ్ శ్రావణ్ -9491467715


 🔹 దేశంలోని పదిహేను కోట్ల  బంజారాల ఆరాధ్య దైవం. 
🔹 ట్యాంక్ బండ్ పై సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు నేతల డిమాండ్.  
🔹 ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలంటున్న రచయితలు!
🔹 ఆయన జీవిత చరిత్ర యువతరాలకి స్ఫూర్తిదాయకం!
🔹 బంజారా సమాజం ఆయనను ఆధ్యాత్మిక గురువు గా గౌరవిస్తారు.
🔹 మూఢ నమ్మకాలను తొలగించి వారి జీవన విధానాలలో సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప సంఘ సంస్కర్త, సంత్ సేవాలాల్!
 🔹 శ్రీ సద్గురు సంత్  సేవాలాల్ మహారాజ్ గారి 286 వ జయంతి సందర్భంగా  వ్యాసము ...

సంత్ శిరోమణి 
సేవాలాల్ మహారాజ్ 
బంజారాలను మంచి మార్గంలో నడిపించడానికి కృషి చేసి, ఆయన భక్తి, ప్రబోధనల ద్వారా బంజారా సమాజాన్ని చైతన్య పరిచి, దిశానిర్దేశం చేసిన యుగ పురుషుడు, ధర్మ పరిరక్షకుడు, ఆధ్యాత్మిక గురువు,
సంత్ సేవాలాల్ మహారాజ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లా గుత్తి తాలూకాలోని, గుత్తి కోట రామచంద్రకొండకు మధ్యలో ఉన్న చౌడేశ్వరి కొండ పాదంలోని  రాంజీ నాయక్ తాండ (ప్రస్తుతం  సేవాగడ్ ) లోని రామావత్  భీమా నాయక్,  ధర్మణియాడి అను బంజారా దంపతులకు 1739 లో ఫిబ్రవరి నెల 15వ‌ తేదిన జన్మించారు. సేవాలాల్ తల్లి ధర్మణియాడి కర్ణాటక రాష్ట్రం, దావణగెరె జిల్లా సుర్గొండన్ కొప్ప
 గ్రామానికి చెందిన జయరాం వడ్త్యా గారి కుమార్తె. ఈమెకు
గుత్తి కోట ప్రాంతానికి చెందిన 
రాంజీ నాయక్  పెద్ద  కుమారుడు 
భీమా నాయక్ తో  వివాహం జరిగింది. కాని ఆమెకు 12 ఏళ్ళ వరకు సంతానం కలగలేదు.  భార్యాభర్తలు ఇద్దరు చింతాగ్రస్తులై ఉండిరి. ధర్మణియాడి తన భర్త భీమా నాయక్తో తనకు సంతాన ప్రాప్తి కలిగించమని బంజారాల ఆరాధ్య దేవత జగదాంబ దేవిని వేడుకుంది. ఆమెను ఓదార్చుతు భీమా నాయక్  సంతాన ప్రాప్తికై ఘోర తపస్సు చేసారు. వీరికి సాతీ భవానీ అను ఏడుగురు దేవతలు ప్రత్యక్షమై తమ కోరికను అడుగుతారు. మాకు పుత్ర సంతానం పెట్టమని వేడుకుంటారు. అమ్మవారు అంటారు..పుత్ర సంతానం కలుగుతుంది, కాని, నీ మొదటి సంతానాన్ని 12 సంవత్సరాల తరువాత మాకే ఇవ్వాలని ఒప్పందం  కుదుర్చుకుంటారు. కొన్ని రోజుల తర్వాత ధర్మణియాడి గర్భం ధరిస్తుంది. బిడ్డ పుట్టిన తర్వాత సాతీ భవానీ ఆ బిడ్డకు ఉయ్యాలలో వేసి సేవాలాల్  అని నామకరణం చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత భీమా నాయక్ 
 వారు తమ బిడారు (లదణి)లతో కర్నాటకలోని శివమొగ్గ ప్రాంతమునకు వెళ్ళిపోతారు. సంవత్సర ప్రాయంలో ఉన్నప్పుడు బాలుడు కొండమీద గుడిలో చాముండేశ్వరి మాతతో ఆడుకుంటున్నపుడు తండ్రి గమనిస్తాడు.
 అప్పుడు బాలుడు అంటాడు  మేము రోజు ఆడుకుంటాము అని సమాధానం చెబుతాడు.
 బాల్య జీవితం:- 
సేవాలాల్ మహారాజ్ తండ్రి భీమా నాయక్ ఇంట్లో  మొత్తం 3755  ఆవులు, ఒక ఆంబోతు, పేరు గరాస్యాసాండ్ , ఒక గుర్రము  పేరు తోళారాం ఘోడో , మరియు 6,400 బిడారి ఎద్దులుండేవి.
సేవాలాల్ గోవులను మేపెటప్పుడు  తన వెంట తీసుకొని వచ్చిన సద్ది మూటను గోవులకు తినిపించే వారట, ఆకలి అయినప్పుడు మట్టితో  సిరా  నైవేద్యం తయారు చేసి తినే వారట. ఆవులను కాసేటప్పుడు ఎప్పుడూ  భజన  చేస్తుండేవారు, రాళ్ళను కంచు పళ్ళెములుగా, మోదుగ ఆకులను తాళాలుగా చేసి భజన చేసేవారు. సేవాలాల్   జగదాంబ దేవి అనుగ్రహముతో పుట్టిన అమ్మవారి భక్తుడు.
12 సంవత్సరాల వయస్సులోనే అద్భుతమైన చమత్కారం చేసారని అప్పటి నుండి తల్లిదండ్రులు, తాండ ప్రజలు, సేవాలాల్ను దైవాంశ సంభూతుడుగా కొనియాడారు!
సేవాలాల్ కు 12 ఏళ్ళ వయస్సు వస్తుంది. ఏడుగురు 
దేవతలు ప్రత్యక్షమై భీమా నాయక్ను తన మొదటి సంతానం సంత్ సేవాలాల్ మహారాజ్ని  పంపమని కోరతారు. 
కాని సేవాలాల్ అందుకు ఒప్పుకోడు.
తల్లిదండ్రుల సేవ చేయాలని అంటాడు.
సేవాలాల్ను జగదాంబ దేవికి అప్పగిస్తుంటే  సేవాలాల్ అంటారు,  "హే జగదాంబ! నేను నిన్ను భక్తి శ్రద్ధలతో పూజిస్తాను . కానీ, నీవు పూజకో  బలి కోరుతున్నావు అది నాతో సాధ్యం కాదు, నేను ఇవ్వలేను. నేను శాఖాహారుని నీవు మాంసాహారివి ఆలా కుదరదు. ఆధ్యాత్మిక చింతనతో చూస్తే అది పూర్తిగా విరుద్ధము" అని చెబుతాడు.
అప్పుడు 
జగదాంబ దేవి సేవాలాల్తో పాటు 
తాండ  వాసులను  ఎన్నో కష్టాల పాలు చేస్తుంది. 
లక్షల ఆస్తి నష్టం వాటిల్లుతుంది. భీమా నాయక్ కుటుంబాన్ని దేవి  అన్నం దొరకకుండా కష్టాల పాలు చేస్తుంది. అయినా,
సేవాలాల్ లొంగిపోడు. అందువలన దేవి  ఆఖరికి విధి లేక,  ''సరసిలోయా'' అను ప్రాంతంలో ప్రత్యక్షమై  కోరికలను కోరుకోమని చెబుతుంది. జగదాంబ దేవి సేవాలాల్ కు  తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. సూర్య, చంద్రులను తన కళ్లుగా మొత్తం విశ్వం తన శరీరంగా దర్శనమిస్తుంది. అది చూసిన సేవాలాల్  ఆశ్చర్యచకితుడౌతాడు. ఆమె చెప్పినదంతా వింటూ కోరికలను కోరుతాడు. మా చనిపోయిన ఆవులను, ఎద్దులను ఇవ్వమంటాడు. జగదాంబ దేవి ' సరే ' అంటుంది. నా సంతతి వారికి పద్నాలుగు తరాలు నీ పూజలు చేసుకునేటట్లు వరము ఇమ్ము అన్నాడు. అమ్మవారు, సరే అని చెప్పింది. నా నోటి నుండి వచ్చే  ప్రతి వాక్కు అమలు కావాలి అన్నాడు. సరే అని చెప్పింది, అమ్మవారు. అన్ని వరాలను పొందిన సేవాలాల్  తన చేతితో  దేవి పూజ
చేయాలని ‌నిశ్చయించుకుంటాడు. అప్పుడు వారి వద్ద పన్నెండు సేర్ల బియ్యం మాత్రమే ఉంటాయి. కానీ మనుషులు చూస్తే పదివేల మంది పై బడి ఉంటారు. ఈ బియ్యంతో ఇంత మంది భోజనాలు ఎలా చేస్తారు? అని అంటాడు. సేవాలాల్ తో జగదాంబ దేవి అంటుంది ,
నీకు ఎందుకు భయం అవే బియ్యం సరి పోయి ఇంకా మిగులుతాయి. ఆ బియ్యం మీ తల్లికి ఇచ్చి చుట్టూ ఢేరా కట్టండి, వంట చేసి 
మీ తల్లి ధర్మణి చేతుల మీదుగా దేవి పూజ చేయించు, అదే బియ్యం పది వేల మంది భోజనాలు చేసిన ఇంకా మిగులుతుంది. నేను పెట్టిన అన్ని  పరీక్షలో నెగ్గావు 
కనుక నీవే అసలైన భక్తుడివి అని చెప్పి జగదాంబ దేవి ఆశీర్వదిస్తుంది. అప్పటి నుండి 
సేవాలాల్  చెప్పిన మాటలు నిజం కావడంతో  తాండ వాసులందరు మానవ రూపంలో అవతరించిన దేవుడని పూజలు చేయడం ప్రారంభించారు.
 ఆరాధ్య దైవం :-
జీవితాంతం బ్రహ్మచర్యం పాటించిన సంత్ సేవాలాల్ మహారాజ్ 
క్రీ.శ 18 వ శతాబ్దంలో  భారత దేశం మొత్తం సంచరిస్తూ ఆవులను మేపుకుంటు  సమస్త బంజారా సమాజాన్ని జాగృతం చేసి,  సంచార జీవితం నుండి తాండ రూపంలో స్థిర నివాసం ఏర్పరుచుటకై తన వంతు కృషి చేశారని అందుకే ఈ రోజు 15 కోట్ల బంజారా ప్రజల ఆరాధ్య దైవంగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు‌.

 భవిష్యవాణి:- 

కలియుగం గూర్చి ఇలా ముందే చెప్పారు. ఇది సతియుగము ఆ తర్వాత కలియుగం వచ్చును, కలియుగంలో లోకం అల్లకల్లోలమగును, అమ్మకు బిడ్డ భారమగును, నీళ్ళ బాటిళ్లు  అమ్మబడును, 
 ఒక రూపాయికి పదమూడు శెనగలు అమ్ముడు పోవును.
 మహమ్మారి గురించి ఇలా అన్నారు మనుషులకు రకారకాల రోగాలు రావచ్చు, వైద్యులు రోగాల పరీక్షలు చెయ్యొచ్చు, కాని రోగం ఏదో తెలియక పోవచ్చు, మాట్లాడుతూ మాట్లాడుతూ రోగి చనిపోవచ్చు. ఇంటింటికి నాయకులు కావచ్చు, అకాల కష్టవిపత్తులు సంభవించవచ్చు. ఊరి పెద్దలు పంచాయతీ చేసి పేద ప్రజలను దండించి తినొచ్చు. వాళ్ళ వంశం నరకం అనుభవించవచ్చు. అడవి నెమళ్ళలను తినొద్దు, గోవులను కసాయిలకు అమ్మొద్దు అనే ప్రచారం వస్తుంది. ఈ ప్రపంచంలో మహిళల రాజ్యం రావచ్చు. చరవాణి గురించి అప్పట్లో చెప్పిన మాటలు
క్షణంలోనే సమాచారం అంతటా  వ్యాపించవచ్చు(మల్కెర్ వాతే పల్కేం కళియ)
అన్నదమ్ముల, తండ్రికొడుకుల, అత్తకోడళ్ళ కొట్లాటలు జరగవచ్చు. తోళారామ్ అనే పేరు గల అశ్వం పై కుర్చోని దక్కన్ పీఠభూమి ప్రాంతంలో "గో' దళము‌ తీసుకొని తిరుగుతూ నైజాం నవాబు గోదళమును చూసి భయపడి ప్రజలందరిని గమనించి బంజారా హిల్స్ లో ఉండమని చెప్పారు.
ఎవరి పరిపాలన సాగునో వారు అబద్ధం చెప్పిన నిజమగును. సత్యం అసత్యమగును. స్త్రీల పై అత్యాచారాలు జరుగును, పాపిష్టుల కాలం రావచ్చు, వారి ఇంట్లో డబ్బులు కొదవ ఉండక పోవచ్చు. వీరి పాలన భరించలేక మనుషులు అడవీ బాట పట్టవచ్చు. ఒక ఆవు ఖరీదు లక్ష కావచ్చు గోవులకు మేత దొరక్కుండా అవి చని పోవచ్చు. వాటిని ఎవరు పట్టించుకోకపోవచ్చు. గోవు కళేబరాలు కుప్పలు తెప్పలుగా పడొచ్చు, నేను చెప్పిన మాటలు అక్షరాలా నిజం కావచ్చు. 
 జాదుగర్ వడ్త్యా :-

జాదుగర్ వడ్త్యా  పేరు నర్సింగ్ దాదా  గల వ్యక్తి సంత్ సేవాలాల్ ను పరీక్షించుటకు తన స్వంత మనుమడు పేరు చింగ్ర్యా ను
ఆడపిల్ల వేశంలో తీసుకొనిపోయి తన కోడలికి ఇంత వరకు సంతానం పుట్టలేదు. ఈమె పై దయ ఉంచి  పుత్ర సంతానం ప్రసాదించాలని కోరుతారు.
మీ కోరిక నెరవేరుతుంది అని సేవాలాల్ దీవిస్తాడు. అప్పుడు జాదుగర్ వడ్త్యా  నవ్వుతూ, ఎగతాళి చేస్తూ మగవారికి సంతానం ఎలా కలుగుతుంది, అని చెప్పేసరికి చింగ్ర్యా అనే పేరు గల అబ్బాయికి మూత్రం వస్తుంది, విప్పి చూసే సరికి నిజంగా స్త్రీ రూపంలో చింగ్ర్యి గా మారుతాడు,
మళ్ళి వెనుతిరిగి మహారాజ్ వద్ద వెళ్ళి కాళ్ల పై పడి జాదుగర్ వడ్త్యా క్షమించమని వేడుకుంటాడు. సేవాలాల్ అంటారు, నా వాక్కుకు తిరుగులేదు అని చెప్పేసరికి  ఆ అబ్బాయి లభో- దిభోమని ఏడుస్తారు. నరులను నారి చేసి, 
రాళ్ళతో డప్పు చేసి,  మట్టితో నైవేద్యం చేసి, నిర్జీవిని సజీవంగా చేసిన సేవాభాయా, కులమత భేదాలు లేకుండా ఆధ్యాత్మిక చింతనతో అద్భుతాలు సృష్టించి, అహింసా, పాపము, మత్తు మందు శాపము, చెప్పిన సేవాభాయా బంజారా ప్రజలను సన్మార్గంలో నడిపించిన దేవుడు.

 మరణం :-

సంత్ సేవాలాల్ మహారాజ్ తేదీ: 06 డిసెంబర్ 1806 లో మహారాష్ట్రలోని వాసీం జిల్లా మనోరా తాలుకా లోని ఉమ్రి సమీపంలో  రూయిగడ్  తాండలో మరణించారు. ఆయన సమాధి బంజారాల కాశీ అని పిలువబడే ప్రసిద్ధి చెందిన పోహారాగడ్ లో  ఉంది .అచట మహారాష్ట్ర ప్రభుత్వం  ఐదు అంతస్థుల బంజారా మ్యూజియం ఏర్పాటు చేసి నంగారా భవన్ అని నామకరణం చేశారు.
 సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క గుర్రపు స్వారీ విగ్రహాం  చూపరులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
నేటి ఆధునిక యుగంలో ఘన కీర్తి ప్రతిష్టలు పొందుతున్న సంత్  సేవాలాల్ మహారాజ్  జీవితం బంజారా సమాజానికి స్ఫూర్తి దాయకం. 
(వ్యాసకర్త  ఇన్చార్జి ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ ఆదిలాబాద్ జిల్లా)


కామెంట్‌లు