ప్రాణ స్నేహితుడు: - వెంకట రమణా రావు-9866186864-విశాఖపట్నం
 బడికి టైం అయింది తొందరగా తయారవ్వు అంటూ అమ్మ కేక పెట్టింది. ఆ రోజు బడిలో టీచరు అందరినీ ఒక మొక్క తీసుకు రావాలి అని చెప్పారు. . మా ఇంట్లో ఒక్క తులసి మొక్క తప్ప ఇంకో మొక్క లేదు.
అందరివీ ఫ్లాట్స్ , ఎవరూ మొక్కలు పెంచరు. ఎలాగా అని ఆలోచిస్తూ స్కూల్ బస్ ఎక్కాను.ఫ్రెండ్స్ అందరు చిన్న తొట్టెలో మొక్కలు తెచ్చారు. 
బడి రాగానే అందరూ దిగిపోయాము. నా చేతిలో మొక్క లేదు. ఫ్రెండ్స్ అందరు నువ్వు ఇవాళ క్లాస్ బయటే ఉంటావు చూడు అని వెక్కిరించారు.
టీచరు వచ్చి అందరి మొక్కలు చూశారు. నేను తేలేదని గమనించి నన్ను అడిగారు. మా ఇల్లు ఫ్లాట్ అందుకే మొక్కలు లేవు అని చెప్పాను. ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి మీ అపార్ట్మెంట్ లో అని అడిగారు. 20 ఫ్లాట్స్ ఉన్నాయి టీచరు అని చెప్పాను. సరే మరి నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా అని అడిగారు టీచరు.
ఏమో టీచరు నాకు తెలీదు అంటూ బిక్క మొహం వేసాను.
నువ్వు మీ 20 ఫ్లాట్స్ కి వెళ్లి ఒక్క మొక్క తీసుకు రమ్మని చెప్పి ఆ 20 మొక్కలని మీ అపార్ట్మెంట్ టెర్రస్ మీద  ఉంచి రోజు సాయంత్రం నీళ్ళు పోసి పెంచు.  నెల రోజుల తరవాత నేను మీ ఇంటికి వచ్చి మీ టెర్రస్ గార్డెన్ చూస్తా అని చెప్పారు.
అలాగే టీచరు అని తల ఊపాను. ఇంటికి వెళ్లి అమ్మకి చెప్పాను. అమ్మ చాలా సంతోషించి మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి చెప్పింది 
పిల్లలం అందరం రెండు రోజుల్లో మా టెర్రస్ మీద మొక్కలు పెట్టాము. నెల రోజుల్లో మంచి పూల తోట లాగ తయారయింది మా టెర్రస్. 
చెప్పిన ప్రకారం టీచరు నెల రోజుల తరవాత మా ఇంటికి వచ్చి మేము పిల్లలు పెంచిన మొక్కలని చూసి సంతోషించారు. మా అందరికీ పెన్సిల్ బహుమతి ఇచ్చారు.
మా అపార్ట్మెంట్ లో పిల్లలం అందరం మంచి స్నేహితులు గా మారాము. 
అప్పటినుంచి ఎవరి పుట్టిన రోజు అయినా మొక్కలు బహుమతి గా ఇస్తున్నాము.
మా టెర్రస్ తోట చూసి పక్క అపార్ట్మెంట్ లలో ఉన్న పిల్లలు కూడా మొక్కలు పెంచడం మొదలు పెట్టారు.
మేము అందరం మా టీచర్ కి చాలా చాలా థాంక్స్ చెప్పాము .
మొక్కని మించిన మిత్రుడు లేడు. పచ్చని ప్రకృతి మనిషికి ప్రాణ స్నేహితుడు.

కామెంట్‌లు