జీవితచక్రం:- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
వసంతం
వస్తుంది పోతుంది
కింకిరం
కూస్తుంది కనుమరగువుతుంది

కాలం
తిరుగుతుంది పరుగెత్తుతుంది
ప్రాయం
పెరుగుతుంది పైనబడుతుంది

బాల్యం
ఆడిస్తుంది పాడిస్తుంది
యవ్వనం
విఙ్ఞానాన్నిస్తుంది వన్నెలుచిందిస్తుంది

కౌమారం
కవ్విస్తుంది కోర్కెలులేపుతుంది
వృధ్యాప్యం
వెంటబడుతుంది వేధిస్తుంది

జననం
సంభవిస్తుంది సంతసపరుస్తుంది
మరణం
కబళిస్తుంది మట్టిలోకలుపుతుంది

స్నేహం
కుదుటపరుస్తుంది కుతూహలపరుస్తుంది
ద్వేషం
బాధిస్తుంది భయపెడుతుంది

పెళ్ళాం
జతకొస్తుంది అండనిస్తుంది
సంతానం
ఇంటకలుగుతుంది ఇంపునిస్తుంది

ప్రాణం
కొట్టుకుంటుంది గాలిలోకలుస్తుంది
కాయం
కుళ్ళుతుంది కాలుతుంది

సమాజం
అవకాశాలిస్తుంది ఆదరిస్తుంది
జీవితం
పండుతుంది రాలుతుంది

లోకం
అజరామరం అనంతం
జీవితం
క్షణభంగురం  కాలబద్ధం

దీపం
ఉండగానే ఇల్లుచక్కబెట్టుకో
ప్రాణం
ఉండగానే బాధ్యతలుతీర్చుకో

శాశ్వతం
ఏదీకాదని తెలిసినడచుకో
సొంతం
ఏవీకావని ఎరిగిమసలుకో


కామెంట్‌లు