సుప్రభాత కవిత : -బృంద
కలతల వలలో చిక్కిన రేయికి 
వెలుతురుతో విముక్తి ఇచ్చి 
వెతలకు వెరచేవెందుకని 
కథ మార్చే వేకువ!

తీరని ఆశల ఆరాటాలకు 
ఆగని మనసు పోరాటాలలో 
వేసారిన గుండెకు ఓదార్పుగా 
గెలుపు తెచ్చే వేకువ!

ఇడుముల కడలి ఈదలేక
ఇక వల్ల కాదని వదిలేసేవేళ 
ఇంపుగా తీరం వైపు తోసి 
ఇదుగో అని చూపే వేకువ!

చెదిరిన మనసు చిక్కబట్టుకుని 
బెదరిన చూపుతో దిక్కులు చూసే 
సడలిన  ధైర్యపు చేయిపట్టి 
జడవక గమ్యం చేర్చే వేకువ!

వడలిన  మమతల దూరాలు 
వదిలిన తూటాల గాయాలకు 
విజయపు పూతను పూసి 
తెలియని ఎత్తున నిలిపే వేకువ!

ముగిసిన బంధాలు మరువలేక 
బిగిసిన ఉచ్చున ఇమడలేక 
విసిగిన బ్రతుకులు విరిసేలా 
కళలు కురిసి మురిపించే వేకువ!

వేయి వెలుగులు మోసుకొచ్చి 
కోటి దీపాలు ముంగిట నిలిపి 
రేపటి కాంతులు కన్నుల నింపి 
మేటి మార్పులు  తెచ్చే  వేకువకు 

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు