కనువిప్పు : సరికొండ శ్రీనివాసరాజు

 రామవరం రాజ్యానికి మహేంద్రుడు కొత్తగా రాజు అయ్యాడు. ఆ తర్వాత మరిన్ని రాజ్యాలను కలుపునొని పరిపాలించాలనే ఆశతో ఆయా రాజ్యాలపై  దాడి చేసి, ఆ రాజులను ఓడించి, ఆ రాజ్యాలను తన రాజ్యంలో కలుపుకుంటున్నాడు.
 ఒకరోజు దండయాత్రలు చేసి, తిరిగి తన రాజ్యంలోకి ప్రవేశించాడు. అలసిన మహేంద్రుడు మారు వేషంలో  ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఆ యజమాని ఇంట్లోకి పిలిచి, అతిథి మర్యాదలు చేశాడు. "మా మర్యాదలలో ఎమైనా లోపాలు ఉంటే మన్నించండి. ఇంతకు ముందు ఉన్న మహారాజు సురేంద్రుడు ప్రజలను కన్న బిడ్డలలా చూస్తూ నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వారి కష్టసుఖాలు గమనించే వాడు.. ప్రజల క్షేమమే తమ క్షేమంగా పరిపాలన సాగేది. అప్పుడు మాకు ఉపాధి బాగా దొరికి కుబేర సములమై వచ్చిన అతిథులకు మంచి మర్యాదలు చేస్తూ ఉండే వారిమి.  ఇప్పుడు వచ్చిన రాజు దండ యాత్రల పేరుతో ప్రపంచానికే రాజు కావాలని సమయం మొత్తం యుధ్ధాలకే వృధా చేస్తున్నాడు. ప్రజలను పట్టించుకోవడం లేదు. అందుకే ఇలా పేదరికంలో బతుకుతున్నాము." అన్నాడు ఆ ఇంటి యజమాని. రాజు మహేంద్రునికి కనువిప్పు కలిగింది. యుద్ధాలు ఆపేసి, పరిపాలన వైపు దృష్టి సారించాడు.
కామెంట్‌లు