ఊషన్నపల్లిలో ఘనంగా సైన్స్ మేళా


 జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సైన్స్ మేళా పలువురిని ఆకర్షించింది. పిల్లలు తయారుచేసిన వివిధ నమూనాలు, ప్రయోగాలు చూపరులను ఆకట్టుకున్నాయి. మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్, పెద్దంపేట ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుదర్శన్ రెడ్డి, తల్లిదండ్రులు, గ్రామస్తులు సైన్స్ మేళాను సందర్శించి,   పాఠశాల పిల్లల్ని అభినందించారు. సైన్స్ మేళాలో ఒక చిన్నారి స్టెతస్కోప్ తో ఎంఈఓ గుండె కొట్టుకొనడాన్ని పరీక్షించింది. సైన్స్ మేళాలో జనతా ఫ్రిడ్జ్, కూలర్, టీవీ, అగ్నిపర్వతం, ఇండ్లు, దుస్తుల రకాలు, ధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, పక్షులు, జంతువులు, చెట్లు, ప్రధమ చికిత్స పెట్టె, అస్థి పంజరం, శ్వాస వ్యవస్థ, మూత్రపిండాలు, జీర్ణ వ్యవస్థ, గాలిమర, విటమిన్లు, గణిత భావనలు, ఆకారాలు, టాన్ గ్రాం మొదలైన నమూనాలను తయారు చేశారు. గాలి ఒత్తిడిని కలుగజేస్తుంది, మాయావర్షం వంటి అనేక ప్రయోగాలు చేసి చూపించారు. భారతీయ శాస్త్రవేత్తల ఫోటోలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన శాస్త్రం దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ఇలాంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల్లో శాస్త్రీయ భావనను పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం పరిసరాల విజ్ఞానం, గణిత సబ్జెక్టులపై పిల్లలకు క్విజ్ పోటీ నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన పిల్లలకు త్వరలోనే బహుమతులను ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మహేష్, ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య, సుదర్శన్ రెడ్డి, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కె. శ్రీవాణి, తల్లిదండ్రులు పిల్లలు గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు