‌ కొత్త గ్రహం!!:- డా ప్రతాప్ కౌటిళ్యా
ఆ కళ్ళు నేలనే కాదు 
ఆకాశం వైపు చూస్తాయి!!

ఆ చేతులు భూమినే కాదు 
ఆకాశాన్ని ఎత్తుకుంటాయి!!

ఆ కాళ్లు నేలపైనే కాదు 
శూన్యంలోనూ నడుస్తాయి!!

ఇప్పుడు ప్రపంచం 
ఆకాశం వైపు చూస్తున్నది 
మిల మిల మెరిసే తారల కోసం కాదు 

శూన్యంలో మెరిసే తార కోసం 
సునీత కోసం!!

ఇప్పుడు ప్రపంచం 
ఆకాశం వైపు చూస్తున్నది 
గగన మేఘాల కోసం కాదు 

శూన్యంలో నడుస్తున్న సితార 
సునీత కోసం!!

ఇప్పుడు ప్రపంచం 
ఆకాశం వైపు చేతులు చాస్తున్నది 
చల్లని చందమామ కోసం కాదు 

శూన్యంలో చిక్కుకున్న 
తెల్లని వెన్నెలమ్మ -సునీతమ్మ కోసం!!

ఇప్పుడు భూమి తిరుగుతున్నది 
సూర్యుని చుట్టూ కాదు 

శూన్యంలో ఆకర్షిస్తున్న 
సునీత విలియమ్స్ చుట్టూ!!?

ప్రపంచాన్ని తలెత్తుకునేలా చేసి
తన గృహానికి భూగ్రహానికి తిరిగి 
వస్తున్న కొత్త గ్రహం సునీత కు ఆహ్వానం!!

డా ప్రతాప్ కౌటిళ్యా 💓

కామెంట్‌లు