న్యాయాలు-783
పనసోదుంబర ఫల న్యాయము
******
పనస అనగా పనస చెట్టు . ఔదుంబర అనగా మేడి చెట్టు. ఫల అనగా పండు.పనస మరియు మేడి చెట్లను దైవ సంబంధమైన వృక్షాలు అంటారు.
మరి "పనసోదుంబర ఫల న్యాయము"లో పనస మరియు ఔదుంబర వృక్షానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
పనస అనే పదానికి వేదభాగము అనే అర్థం కూడా ఉంది. పనస అంటే వేదంలో 50 పదముల సామూహమని అర్థము.యజుర్వేద సంహిత భాగంలో ప్రతి పనసలో 50 పదాలు వుంటాయి.ఇక తెలుగులో ఐతే పనసకు అనేక పర్యాయ పదాలు, సామెతలు, పొడుపు కథలు ఉన్నాయి.పర్యాయ పదాల్లో కంటక ఫలము, పూత ఫలము,మృదంగ ఫలము,ఫల వృక్షకము మొదలైనవి.ఈ చెట్టుకు ఉన్న మరో పేరు చక్కి చెట్టు.
పనస పండులా బలంగా , బరువుగా వున్న పసిబిడ్డను "పనసపండంటి బిడ్డ" అనడం మనందరికీ తెలిసిందే.పొడుపు కధల విషయానికి వస్తే "తండ్రి గరగర -తల్లి పీచు పిచు, బిడ్డలు రత్న మాణిక్యాలు, మనుమలు బొమ్మ రాళ్ళు " "ఓహోహో బాలమ్మా - ఒళ్ళంతా ముళ్ళమ్మా/ కరకరా కోస్తే - కడుపంతా తీపమ్మా" అనేవి ఉన్నాయి.
"పనస చెట్టును పెంచిన ఇల్లు సిరిసంపదలతో కళకళలాడుతుంది" అంటారు.అంటే మంచి ఆదాయం,దైవానుగ్రహం కలిగించే చెట్టుగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అతి పెద్ద పండును కాసే చెట్టుగా పనస చెట్టుకు పేరుంది.శాస్త్రీయంగా, ఆయుర్వేద పరంగా చూస్తే ఈ చెట్టు ఆకులు, వేర్లు, పై పొట్టు,పండు తొనలు,లోపలి గింజలు అన్నింటిలో ఔషధ గుణాలు ఉన్నాయి.
ఈ పనస వృక్షానికి రెండు రకాల ఆకులు వుండటం వల్ల దీనిని అనఘ - దత్త వృక్షమని భక్తులు పిలుస్తుంటారు.పనస వృక్షమును మధుమతి తల్లిగా,సాక్షాత్తూ అనఘాదేవి నివసించే వృక్షముగా పిలుస్తారు. అయితే దత్తాత్రేయుని త్రిమూర్తి స్వరూపంగానే కాకుండా స్త్రీ శక్తి స్వరూపంగా కూడా భావిస్తారు.అనఘాదేవిని సరస్వతీ, లక్ష్మీ,పార్వతీ దేవిల స్వరూపిణిగా కొలుస్తారు.
కాబట్టి శక్తి స్వరూపిణి అయిన అనఘాదేవి పనస వృక్ష మూలంలో తన అన్ని శక్తి అంశలతో నివసిస్తూ వుంటుందనీ, అలాగే దత్తాత్రేయుని వామ భాగం పనస వృక్షంలో ఉంటుందనీ,ఔదుంబర వృక్షంలో దత్తాత్రేయుని కుడి భాగం వుంటుందని ఆధ్యాత్మిక, దైవ భక్తులు చెబుతుంటారు.
ఇక ఔదుంబర లేదా మేడి వృక్ష విషయానికి వస్తే... ఈ చెట్టును క్షీర వృక్షం,బొడ్డ చెట్టు,హేమ దుగ్ధ వృక్షం మరియు దత్త వృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షమనీ, తాను ఎల్లప్పుడూ సూక్ష్మ రూపంలో ఈ వృక్ష మూలము నందు ఉంటారని పైంగ్య బ్రాహ్మణంలో వివరించబడింది. ఔదుంబర వృక్షం నుంచి ప్రాణశక్తి వెలువడి అపమృత్యు భయాలను పారద్రోలుతుందని భక్తుల నమ్మకం.అంతేకాదు తమ కష్టాలను, కోరికలను ఔదుంబర వృక్షానికి నివేదిస్తే అవన్నీ తీరుతాయని అంటుంటారు.
ఈ విధంగా ఔదుంబర లేదా మేడి చెట్టు మరియు పనస చెట్టు కలిపి ఉన్న ప్రదేశాన్ని చాలా విశిష్టమైనదిగా, ప్రాముఖ్యత కలిగినదిగా సాక్షాత్తూ దత్తాత్రేయుడే కొలువై వున్నట్లుగా భక్తులు భావిస్తూ భక్తి శ్రద్ధలతో ఈ చెట్లను పూజిస్తారు.
ఇలా పనస మరియు ఔదుంబర వృక్షాలు ప్రాణశక్తిని నిలిపే అద్భుతమైన కల్ప వృక్షాలే కాకుండా దత్తాత్రేయునికి ప్రియమైనవని మనం తెలుసుకున్నాం.ఈ రెండు చెట్ల నుండి వచ్చే గాలి, ఆకులు, కాండము, పండ్లలో మొత్తంగా ఔషధగుణాలు కలిగి వున్నాయి.కాబట్టి భక్తితో ఆ వృక్షాలను పూజిస్తూ వాటి ఫలాలను ఆహారంగా తీసుకోవడం వలన అటు ముక్తి ఇటు ఆరోగ్య శక్తి పెరుగుతుంది.
మన పూర్వీకులు పరిశోధించి , నిశితంగా పరిశీలించి చెప్పిన "పనసోదుంబర ఫల న్యాయము" వెనుక ఇంత సమాచారం, అంతరార్థం దాగి వుంది.అందుకే భక్తిని,ముక్తిని శక్తిని ప్రసాదించే ఈ దత్తాత్రేయ వృక్షాలను నిత్యం కొలుద్దాం.అన్ని విధాలుగా ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుదాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి