సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-778
అబ్భి ర్గాత్రాణి శుభ్యంతి మనం సత్యేన శుభ్యతి న్యాయము
*****
అబ్భి అనగా ప్రవాహం లేదా నది నుండి ఎత్తు నుండి పడే నీటి ఘనమైన ప్రవాహం.గాత్రం అనగా శరీరము, అంగము, ఏనుగు యొక్క ముందటి పిక్కలు మున్నగు చోటు. గాత్రాణి అనగా శరీర అవయవాలు. శుభ్యంతి లేదా శుభ్యతి అనగా పరిశుభ్రమగుచున్నది.మనః అనగా మనస్సు. సత్యేన అనగా సత్యం లేదా నిజం చేత అని అర్థము.
శరీరము నీటి చేత శుద్ధమవుతుంది. మనసు సత్యము చేత శుద్ధమవుతుంది అని అర్థము.
 శరీరాన్నైతే నిత్యం నీటిని, మనకు ఇష్టమైన సబ్బును ఉపయోగించి శుభ్రం చేసుకుంటాం. శుభ్రం చేసుకున్న తర్వాత ఒంటి మీద మురికి పోయి శరీరం ఒకలాంటి హాయికి ఆనందానికి లోనవుతుంది.
అదొక్కటే కాదు మనలోపల ఉండి మనల్ని నడిపించే,ఆడిపించే, ఏడిపించే, బాధించే.. ఇలాంటి భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి చేసేది మనసు.ఈర్ష్యలు, అసూయలు, కుట్రలు, కుతంత్రాలు, పగలు ద్వేషాలు... ఇలాంటివి మనసును ఆవరించిన చెడు లేదా మురికి అనవచ్చు.వాటిని అలాగే వ్యతిరేకించ కుండా ఉంటే  మనసు నిండా పేరుకు పోయి, మనసంతా మురికి లేదా మలినం చేస్తాయి. శరీర శుభ్రత కోసం నచ్చిన ,మెచ్చిన రకరకాల సబ్బులను ఉపయోగిస్తాం. మరి మనసును శుభ్రం చేసుకోవాలి అంటే ఏం వాడాలి ? ఏం చేయాలి  తెలుసుకుందాం.
శరీరాన్ని శుద్ధి చేసుకున్నట్లే మనస్సును కూడా శుద్ధి చేయవచ్చు అంటారు జిడ్డు కృష్ణమూర్తి లాంటి తత్వ వేత్తలు.మన మనసు చైతన్యవంతమైనది కాబట్టి ముందుగా చైతన్యాన్ని శుద్ధి చేసుకోవాలి.అదెలా అంటే ఈ ప్రపంచ చైతన్యం నుండి మనసును ఎదిగేలా చేయడం.అలాగే మనసును ఆవరించిన అహంకారాన్ని వదిలి వేయడం. యోగా చేయాలి అంటారు.
ఇక ముఖ్యంగా వినయము, అహింస, సహనము,సరళత,స్వీయ నియంత్రణ, స్థిరత్వము. ఇంద్రియ తృప్తి లక్ష్యాలను త్యజించడం, తాత్విక శోధన మొదలైనవి జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఈ జ్ఞానము ద్వారా ఏ వ్యక్తి అయితే అసూయ పడని వాడు,అన్ని జీవులకు దయగల స్నేహితుడు, సుఖదుఃఖాల నుండి విముక్తి పొంది, రెండింటిలో సమానంగా ఉండేవాడు, దృడమైన సంకల్పం కలిగినవాడు అవుతాడో అతడే తన మనస్సును శుద్ధి చేసుకోగలడు.కాబట్టి ఇలాంటి  లక్షణాలు వ్యక్తులకు ఉండాలని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పడం చూడవచ్చు.
నిష్పక్షపాతంగా ఉండే వాడు, అందరినీ సమానంగా చూసేవాడు, మంచి చేసేవాడు ఎప్పుడు కూడా చెడు చేత జయింపబడడు అని కూడా చెప్పాడు. ఇలాంటి వ్యక్తులను మనం మనసు శుద్ధి చేయబడిన వ్యక్తులు అని అనవచ్చు.
యోగి వేమన కూడా ఓ పద్యంలో ఇలా అంటాడు."ఆత్మ శుద్ధి లేని ఆచారమదియేల/భాండ శుద్ధి లేని పాకమేల?/చిత్తశుద్ధి లేని శివపూజలేలరా? విశ్వదాభిరామ వినురవేమ!!"
అనగా మనసు  శుద్ధి లేకుండా దుర్బుద్ధితో చేసే ఆచారం ఎందుకు?  వంట పాత్ర శుభ్రం చేయకుండా చేసే వంట ఎందుకు? అపనమ్మకంతో చేసే శివ పూజ ఎందుకు? అంటాడు. మనసు నిండా దుష్టత్వం, దురాలోచన, దుర్బుద్ధిని నింపుకుని చేసేది ఏదైనా చెడే.మంచి కాదు. అలాగే శుభ్రం చేయని వంట పాత్రలో వండిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో హాని కలిగిస్తుంది. కాబట్టి వీటిని శుభ్రం చేసుకోవాలి.
 అందుకే ప్రకృతి కవి పాటల రచయిత జయరాజు గారు " మనసా! నిను నిప్పు తోని కడగనా మనసా!" అంటూ ఓ అద్భుతమైన పాట రాశారు. అందులో  మనిషిలో ఉండే దుర్గుణాలను చూపుతూ స్వచ్ఛంగా ఉండమని చెబుతారు.
 మరి మనసు శుద్ధిగా ఉండాలంటే అన్ని మంచి లక్షణాలతో కూడిన సత్యం లేదా నిజంతో మనసును శుభ్రం చేసుకోవాలి. అప్పుడే మనసు శుద్ధి అవుతుంది."అబ్భి ర్గాత్రాణి శుభ్యంతి మనం సత్యేన శుభ్యతి న్యాయము" నకు న్యాయము జరుగుతుంది.అప్పుడే మనశ్శరీరాలు శుద్ధి కలిగిన మంచి వ్యక్తిగా  ఈ సమాజంలో ప్రకాశించగలం.

కామెంట్‌లు