సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం

 అంతరంగ బహిరంగయో రంతరంగం బలీయః న్యాయము
******
అంతరంగం అంటే మనసు ,అంతర్లీన స్వీయ భావన. బహిరంగ అనగా బయట.బలీయః అనగా శక్తివంతమైన, ప్రభావవంతమైన, బలంగా ఉండేది అని అర్థము.
"అసిద్ధం  (నిరూపించబడని) బహిరంగ( బాహ్య )మంతరంగే" బహిరంగ శాస్త్రీయ నిమిత్త సముదాయమున అంతర్భూతములవు నంగములు (నిమిత్తములు)గల విధికార్యమంతరంగము.ఆ అంతరంగ నిమిత్త సముదాయము కన్న ఆవల వుండు నంగములు ( నిమిత్తములు)గల విధి కార్యము బహిరంగము.ఆ అంతరంగము ప్రవర్తించునపుడు బహిరంగ కార్యము అసిద్ధమవును.అనగా ప్రవర్తింప నేరదు అను వ్యాకరణ పరిభాష నుండి ఈ న్యాయము వెలువడింది.అంతరంగ బహిరంగ కార్యములందు అంతరంగము బలవత్తరము అని ఈ న్యాయము యొక్క అంతరార్థము.
ఇదంతా చదువుతుంటే కొంత అయోమయానికి, గందరగోళానికి గురి అవుతుంటాం. కానీ విధి కార్యము చేయునపుడు అంతరంగం యొక్క బలాన్ని లేదా శక్తిని బట్టి అంతరంగమే బహిరంగ కార్యమును అణచి వేయడమో లేదా అదుపులో ఉంచడమో చేస్తుంది. మనసును బట్టే మన ప్రవర్తన ఉంటుందనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
 శారీరక విధులు నిర్వర్తించే సమయంలో  అంతరంగానికి నచ్చకపోతే ఆ విధి ఆగిపోతుంది.అంతరంగం ఏది అనుకుంటే అదే నిర్వర్తింప బడుతుంది.
 ఉదాహరణకు కార్యస్య తాపదూపదానాపేక్షా ప్రథమ ముత్పద్యతే ,తథా నాంతరంగ బహిరంగయో రంతరంగం బలవ దితి న్యాయే నాంతరంగోపాదాన విషయత్వమేవ తయోర్న్యాయ్యమ్!!" అనగా ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే ఒకే చోట రెండు విధులు నిర్వర్తించినపుడు ప్రథమ ప్రవృత్త విధిపశ్చాత్ప్రవృత్తమవు విధిని బాధించి తాను నిర్వర్తించునని న్యాయాశయము.
ఇంకా తేలికగా చెప్పాలంటే మన పెద్దవాళ్ళు తరచూ అనే ఓ సామెతను గుర్తుకు చేసుకోవచ్చు. "గుర్రాన్ని నీళ్ళదాకా తీసుకుని వెళ్ళగలం కానీ దానికి ఇష్టం లేకుండా తాగించలేము అని.
దీనికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథను చూద్దాం.
అక్బర్ బీర్బల్ గురించి మనందరం ఎన్నో కథలు చదివాము.అందులో బీర్బల్ చతురత, సమయస్ఫూర్తి, హాస్యం ఎక్కువగా కనబడుతూ ఉంటాయి.
విషయమేమిటంటే ఒకానొక సందర్భంలో అక్బర్ కు బీర్బల్ మీద కోపం వచ్చి చాలా రోజుల పాటు అతనితో మాట్లాడటం మానేస్తాడు.బీర్బల్ ను దూరం ఉంచాడు.అయితే కొంతకాలానికి బీర్బల్ తన వెంటలేని లోటు తెలిసింది.అందుకే తనంత తానుగా బీర్బల్ ను తీసుకుని రమ్మని మంత్రులను ఆదేశిస్తాడు. రాజాజ్ఞతో బీర్బల్ వస్తాడు.అతడిని సంతోషపరచడం కోసం ఘనమైన విందు భోజనం ఏర్పాటు చేయించి, అందులో ఎన్నో రకాల రుచికరమైన వంటకాలు సిద్ధం చేయిస్తాడు అక్బర్. అవన్నీ  చూసిన బీర్బల్ "ఆ ఒక్కటి కూడా ఉంటే ఎంతో బాగుండేది" అంటాడు. "ఇన్ని రకాల వంటకాలు తినడానికి సిద్ధంగా ఉండగా ఇంకా ఆ ఒక్కటేమిటి?  అక్బర్ ఆశ్చర్య పోతాడు."అదేమిటో చెబితే అది కూడా తెప్పిస్తాను" చెప్పమని అడిగితే సమాధానంగా బీర్బల్  "మహారాజా!ఆ ఒక్కటి ఆకలి" అంటాడు.అనగా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే తినడానికి అన్నీ సిద్ధంగా ఉన్నప్పటికీ మానసికంగా తినాలనే ఆ ఒక్క కోరిక లేనప్పుడు అవి ఎన్నున్నా  ప్రయోజనం లేదు.ఇక్కడ అంతరంగం ఇంద్రియాల విధులను నియంత్రించడం జరిగింది. కాబట్టే ఆకలి కలుగలేదు.
మొత్తంగా ఇందులో ఇమిడి ఉన్న అంతరార్థం  అర్థం చేసుకున్నట్లయితే బాహ్య, అంతరంగ విధుల రెండింటిలో అంతరంగం ఏది అనుకుంటే అది మాత్రమే నిర్వర్తింపబడుతుంది.ఇక్కడ అంతరంగమే బలీయమైనదని స్పష్టంగా చెప్పవచ్చు.
అందుకే మన పెద్దవాళ్ళు అంటుంటారు "ఆశను అందలమెక్కించాలని చూసినా - బుద్ధి భూములేలుతుంటే ఏమీ చేయలేము.
ఈ "అంతరంగ బహిరంగయో రంతరంగం బలీయః న్యాయము" ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే అవకాశం అందలమెక్కించాలని చూసినా బుద్ధి బురదలో కూరుకుపోతుంటే ఏమీ చేయలేము.ముందుగా మానసిక స్థిరత్వం అనేది ముఖ్యం. ఆ దిశగా మన మనసును సంసిద్ధం చేయాలి.

కామెంట్‌లు