పత్తి నుండి దూది వేరు చేసి
ప్రమిద నెక్కించి వత్తి వేసి,నూనె పోసి దీపం వెలిగిస్తే
కాంతి నయనానందకరమైంది.
దీపం కొండెక్కి చీకటి ఆవరిస్తే
మనిషి చిరునామా కరువైంది.
చీకటి మాటున జననాలు,
మరణాలు సాగిపోతూనే ఉన్నాయి.
మానవత్వపు జాడ కానరాక,
కళ్ళు మసకబారి,పొరలు
కమ్ముతున్నాయి.
మాటలు,పాటలు,సంభాషణల
నాటకీయత ఎక్కువై,
పాత్రలు ఔచిత్యాన్ని త్యజించి
వికటాట్టహాసం చేస్తున్నాయి.
ఇరుగుపొరుగుల ఇంగితం మర్చిపోయి,శీలం సీలకు వేలాడుతున్నది.
అడుగంటుతున్న విలువలు
ఎండమావుల సరసన దాక్కుంటున్నాయి.
ఎరుపెక్కిన చైతన్యం చేష్ఠలుడిగి చిత్తరువే అవుతున్నది.
నీరసించిన ఐకమత్యం నిమ్మకునీరెత్తినట్లు చూస్తున్నది.
మించిపోయిన విజ్ఞానం సునామీయై కబళిస్తున్నది.
నమ్మకం అమ్మకమై అంగట్లో విచ్చలవిడిగా విక్రయమవుతున్నది.
తెగిపోయిన గాలిపటమల్లె
మెలమెల్లగా పడిపోతున్న
సంస్కృతి చరిత్ర అవుతుందేమో?
అంబరాన్నంటిన ఆశలు
మబ్బుల్లా తేలిపోతుంటే,
నింగి నిజరూపం దృశ్యమానమవుతున్నది.
లోకం ఆలోకన లేని వికృతై
మారిపోతుంటే,
నడమంత్రపు సిరులు నక్కలై
ఊళలేస్తున్నాయి.
కుంభమేళలు పాపాలు కడిగేస్తుంటే,
కొత్త పాపాలు చేయడానికి అంకురాలు మొలుస్తున్నాయి.
రంగులు వెలిసిన వయస్సులు
మరణానికి దగ్గరవుతున్నాయి.
చితుల నిప్పులు బూడిదలై
నుదుటి రాతలు మారుస్తున్నాయి.
కలిమి లేముల తక్కెడలు
తూగడానికి బాటులు అవసరమవుతున్నాయి.
పచ్చనోట్ల పరిహసాల ముందు
మానవాళి మోకరింపులు సైరన్లు మోగిస్తున్నాయి.
దేవుళ్ళను బలవంతంగా లేపే
టికెట్లు ఇక్కట్ల పాలుజేస్తుంటే
హత్తుకొనే బాంధవ్యాలు గుదిబండలవుతున్నాయి..
రాస్తే కావ్యం,చదివితే పురాణాలై పలకరింపులు
రంపపుకోతలుగా మిగిలిపోతున్నాయి.
ఉత్తరద్వార దర్శనాలు మోక్షం ప్రసాదిస్తుంటే హౌసుఫుల్ బోర్డులు పెట్టబడుతున్నాయి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి