సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-789
ఆమోద షట్పద న్యాయము
*****
ఆమోద అనగా  బహు దూరము వ్యాపించు పరిమళము,వాసన, సంతోషము.షట్పద అనగా తుమ్మెద, తేనెటీగ, ఆరు పాదాలు ఉన్నది అనే అర్థాలు ఉన్నాయి.తేనెటీగలు ఒక రకమైన తుమ్మెదలు కాబట్టి వీటిని కూడా షట్పదులు అంటారు.
వాసనను బట్టి తుమ్మెద పువ్వు ఉన్న చోటును కనుక్కొంటుంది.
  ఈ సృష్టిలో ఒక చిన్న ప్రాణి తుమ్మెద లేదా తేనెటీగ. దానికి ఉన్న గ్రహణశక్తి అంతా ఇంతా కాదు.కేవలం  వాసనను బట్టి మాత్రమే కాదు. ఏ పువ్వులో మకరందం ఉందో కనిపెట్టే సామర్థ్యం దానికి వుంది. అందుకే ఎంత దూరమైనా ప్రయాణం చేసి మకరందాన్ని సేకరిస్తాయి.
 ఇంకా కొంత విపులంగా తెలుసుకుందాం. కుక్క, పిల్లి , ఎలుక,మొదలైన జంతువులు తమ ఇంద్రియాలతో వాసనలు  పసిగడతాయి.అలాగే తేనెటీగ కూడా తేనేతో ఉన్న పూలను ఎంతో దూరం నుండి సమర్థవంతంగా గుర్తిస్తాయి.
పువ్వులు వాటిలో వాసన జ్ఞాన విద్యుత్ క్షేత్రాలు తేనెటీగలను ఆకర్షించే విద్యుత్ క్షేత్రాలను ఉత్పత్తి చేస్తాయని ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.పువ్వు కణజాలంలోని అయానుల కదలిక ద్వారా విద్యుత్ క్షేత్రాలు సృష్టించబడతాయనీ, తేనెటీగలేమో వాటి యాంటెన్నాలను ఉపయోగించి వాటిని గ్రహిస్తాయి. కొన్ని పూలకు రంగు వుండదు,వాసన ఉండదు.అయినా తేనెటీగలు విద్యుత్ క్షేత్రాలను ఉపయోగించి పువ్వులను గుర్తిస్తాయని తేనెటీగలను ఆకర్షించేందుకు ,పువ్వుల్లో ఉన్న మకరందం తోడ్పడుతూ తేనెటీగలను ఆకర్షిస్తుంది.వీటి మధ్య  నిర్థిష్టమైన భాష అనగా సంకేతాలు ఉండటం శాస్త్రవేత్తలకే కాకుండా ఇది విన్న చదివిన మనకు కూడా ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. ఇవి ఒకదానికొకటి కనుగొనగల సామర్థ్యం కలిగి ఉండటం మొక్కల పరపరాగ సంపర్కం జరగడానికి,వాటి మనుగడకు ఎంతో ముఖ్యమైనదని మనకు తెలిసిపోయింది.
 తేనెటీగలను ముఖ్యంగా పండ్ల విషయానికి వస్తే నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష చెట్లు తేనెటీగలను బాగా ఆకర్షించే పువ్వులను కలిగి ఉంటాయి.అద్భతమైన తేనెను ఉత్పత్తి చేస్తాయి.
 మరి ఈ ఆమోద షట్పద న్యాయమును మన పెద్దలు ఉదాహరణగా చెప్పడానికి గల కారణాలు నిశితంగా పరిశీలించి చూస్తే జ్ఞానులైన వారు తాము కలవాల్సిన సజ్జనులను అలవోకగా గుర్తిస్తారు.వీరి బంధం పైకి కనబడదు. ఒకరికొకరి మధ్య ఆధ్యాత్మిక, దైవ, తండ్రి , తల్లి లాంటి బంధం ఉండాలి.
 పూవుకు తేనెటిగకు మధ్య  బంధం భగవంతునికి భక్తునికి మధ్య  ఉండే బంధం లాంటిదని భక్తులు అంటుంటారు. మంచికి మనిషికి ఉండే బంధం అనవచ్చు. మంచి ఎక్కడ ఉంటుందో మనిషి అక్కడ ఉండాలని అర్థము.
 'ఆమోద షట్పద న్యాయము" ద్వారా మనం తెలుసుకున్న నీతి ఏమిటంటే  మానవీయ విలువల పరిమళాలు ప్రతివారిలో ఉండాలి.అలా లేని పక్షంలో అలాంటి మంచి విలువల పరిమళాలు వెదజల్లే వారిని ఎంత దూరంలో ఉన్నా వెళ్ళి వారి సాంగత్యం చేయాలని ఈ న్యాయము చెబుతోంది. తుమ్మెద లేదా తేనెటీగలా మనం కూడా ఎంత దూరంలో ఉన్నా మంచి వారిని వెదుకుతూ వెళ్ళి స్నేహం చేద్దాం.వారిచ్చిన విజ్ఞాన మకరందాన్ని మనలో నింపుకుందాం.

కామెంట్‌లు