*ఒక ఐశ్వర్యవంతుని నడక....*:- శ్రీమతి డి.నాగజ్యోతి శేఖర్.-కాకినాడ.


 ఒక దేశ చరిత్ర ఆ దేశం యొక్క  ఉనికిని ,సంసృతిని, ఆ దేశ ఉత్తానపతనాలను తెలియ చేస్తుంది . ఒక వ్యక్తి యొక్క చరిత్ర  సమాజంలో ఒక కుటుంబం యొక్క మనుగడను,  చితికిన గత వైభవాన్ని, లేదా చిగురించిన అభివృద్ధి నీ  తెలియపరుస్తుంది. అతడు ఆ కుటుంబ ప్రతిష్టకు చివరివాడూ కావొచ్చు....మొట్ట మొదటి వాడూ కావొచ్చు...ఒక తరం నుండి మరో తరానికి బలమైన వారధీ కావొచ్చు. ఏ కొందరో చరిత్రకు ఎక్కుతారు...అందరూ చదివే పుస్తకం అవుతారు. కొందరు చరిత్రలోకి ఎక్కక పోవచ్చు కానీ వారికీ వారిదైన ఒక చరిత్ర ఉంటుంది. దాన్నో పుస్తకం గా మార్చేంత అవకాశం అందరికీ ఉండక పోవచ్చు....ఆలోచన ఉన్నా సమయం చిక్కక పోవచ్చు. తన అద్భుత అనుభవాలను తర్వాతి తరం వారికి అందించి స్ఫూర్తి నింపాలి అని జీవిత పోరాటంలో గెలిచిన వ్యక్తి అనుకోవడంలో సందర్భ స్పృహ ఉంది...తన తర్వాతి తరానికి తన విజయాలను అందించాలనే బాధ్యతా ఉంది.    సామాన్య జీవితాన్ని అసమానమైన ప్రతిభతో శోభిల్లేలా చేసుకొన్న ఒక 75 ఐదేళ్ల నిరంతర శ్రామికుడి చరిత్రే  శ్రీ నల్లి. విజయకుమార్ గారు రాసుకున్న ఆత్మ కథ 

 "*బ్రతుకు బాటలో ...అడుగుల సవ్వడి".*
    ------------------------------------------------
   ఈ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకున్నప్పుడు  పేజీలు పరంగా తేలిక గానే ఉన్నా... వారి జీవితంలో ని సాంద్రత లోకి పయనిస్తుంటే గుండె బరువెక్కుతుంది...వారి విజయాలను చూసి కేరింతలు కొడుతుంది...వారి క్రమశిక్షణ ను చూసి ఆశ్చర్యపోతుంది....వారి వినయాన్ని చూసి ముగ్ద అవుతుంది...వారి విషాదాన్ని చూసి ఆర్ద్రమౌతుంది....విభిన్న స్పందనలను కలిగించే ఈ అడుగుల సవ్వడి వింటూ లోలోపలి పేజీల్లోకి వెళుతుంటే...వారి బాల్యం నుండి 75 ఏళ్ల వయస్సు వరకూ వారి పక్కనే ఉంటూ వారి జీవితాన్ని దర్శించిన అనుభూతి గుండెను పెనవేస్తుంది.
  విజయ కుమార్ గారి తండ్రి అసంపూర్తిగా రాసి వదిలేసిన ఆత్మ కథను చూసి ప్రేరణ పొంది...తన పరిపూర్ణత కలిగిన జీవితాన్ని తన వారసులకు ఎందుకు తెలియ చేయ కూడదూ అనుకున్నారు. ఫలితంగా ఒక ఆత్మను కథ రూపంలో వారి వారసులతో పాటు మనమూ దివ్య దర్శనం చేసుకుంటాము.  భావి తరాలకు తన జీవిత అనుభవాలను అందించాలి అనే సదుద్దేశ్యం వద్దే వారి పుస్తకం సక్సెస్ అయ్యింది. నేటి తరానికి కావాల్సిందే విలువలతో కూడిన జీవన విధానం, జీవితంలో నిజాయితీగా ఎలా పైకి రావాలి అనే స్పృహను కలిగించడం. వీటిని వీరి ఆత్మ కథ అక్షరాలా నెరవేర్చింది. ఆత్మ కథ అనగానే అన్నీ మంచి అంశాలనే స్పృశిస్తారు అనుకునే వాళ్లకు ఈ పుస్తకంలో వారి తడబడిన అడుగుల సడి కూడా నిర్భయంగా వినిపించారు. ఇలాంటి నిజాయితీ ఉన్న జీవితాలే నేడు కావాలి.
   మొదటి తరం నుండే...అంటే వారి తాతలూ,  తల్లిదండ్రులు ,బంధు వర్గం అందరూ విద్యా వంతులూ, ఉద్యోగస్తులూ అవడం ...ఒక మంచి  ఆథ్యాత్మిక వాతావరణం లో వారు పెరగడం వల్ల ఆ సువాసనలూ  వారికి సోకి మంచి విద్యావంతులు అయ్యి....ఆఫీస్ సూపరింటెండెంట్ బాల నేరస్థుల శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లో వారు ఉద్యోగ విరమణ చేసే దాకా పరిమళించింది. రాజమండ్రి లోని ప్రముఖ పాఠశాల అయిన గవర్నమెంట్ మల్టీ పర్పస్ హైస్కూల్  లో ఉన్నత విద్య నుండి వారు క్రీడా జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తూ హైదరాబాద్ లోని " ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజీ" లో  " బాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్" డిగ్రీ చేతికి వచ్చే దాకా వారు అన్ని రకాల క్రీడల్లోనూ వారు సాధించిన బహుమతుల్ని చూస్తే...దాని తోనే ఒక పుస్తకం వేయ వచ్చు. అంతటి ప్రతిభా మూర్తి వారు. ఆ ప్రతిభను ముందు తరాలకు చూపక పోతే ఎలా...అందుకే వారిలా పుస్తకం అయ్యారు . 
   వారు చదివిన మల్టీ పర్పస్ స్కూల్ లానే వీరు మల్టీ టాలెంటెడ్....సంగీత వాయిద్యాలు వాయించడం లోనూ....చర్చి గీతాలు ఆలపించడం లోనూ వీరూ, వీరి సోదరీమణులూ అందెవేసిన చెయ్యి. ఈల పాట విజయకుమార్ గారి మరో ప్రతిభ.  వీరి ప్రతిభను చూసిన వారు  అప్పుడు ఎంత ముచ్చటపడ్డారో...వారి ఆనాటి అనుభూతుల్ని చదివిన ఇప్పటి వారమూ ముచ్చట పడతాము. చిన్నప్పుడు బిడియ పడుతూ ఉంటే ఒక అబ్బాయి...తన యవ్వన దశ వచ్చేప్పటికి  పెక్కు ప్రశంసలు పొందే ప్రతిభామూర్తిగా ఎదిగిన వైనం ఎంతో ప్రేరణ ఇస్తుంది.
   మిషన్ ఆసుపత్రిలో పనిచేసే తల్లిదండ్రుల కష్టాన్నీ, క్రమశిక్షణ నూ దగ్గర నుండి చూసిన విజయ కుమార్ గారు ఆ తల్లిదండ్రుల ఆశలకు తగ్గట్టు చదువుకొని, వృద్ది చెంది...తల్లిదండ్రుల కష్టార్జితాన్ని పదింతలు పెంచిన కొడుకుని చూసి ఏ తల్లిదండ్రులు మాత్రం మురియరు..?!  "పుత్రోత్సాహం..."  పద్యం వీరికి సరిగ్గా సరిపోతుంది. వీరిలో ఆథ్యాత్మికతను పెంచిన వారి తండ్రి గారు నేటి తండ్రులు అందరికీ మార్గదర్శనం. నేడు అది ఏ మత మైనా...పిల్లలకు ఆ సాంప్రదాయం నేర్పకుండా స్వేచ్ఛ పేరిట కట్టుబాట్లను సడలిస్తున్నాము. మూఢత్వాన్ని పెంచకూడదు కానీ...క్రమ శిక్షణనూ, ఆత్మ పరిపుష్టికి కీ ఆచార వ్యవహారాలను ఖచ్చితంగా నేర్పాలి. విజయ కుమార్ గారి తలిదండ్రులు వారి సంతతికి ఆ  బలమైన పారంపర్యతను అలవర్చారు. క్రమంతో కూడిన చర్చి జీవితం విజయ కుమార్ గారిని మంచి వైపు నడిపించింది అని వారి జీవితాన్ని చదివితే అర్ధం అవుతుంది. అది వారి ఇప్పటి వృద్ధాప్యంలో కూడా చైతన్యాన్ని నింపి నడిపిస్తుంది అని వారి మాటల వల్ల తేటతెల్లం అవుతున్నది. అయితే వారి తల్లిదండ్రులు అనారోగ్యంతో పడ్డ బాధలూ, వారిని విడిచి వెళ్లిన క్షణాల వేదననూ వారు ఇంకా అనుభవిస్తున్నారు. 
వీరి జీవితంలో ఆథ్యాత్మికత ఎంతటి ప్రాధాన్యమో...అనుబంధాల పట్ల వారు చూపే మక్కువ అంతకంటే ప్రాధాన్యత ను సంతరించుకొంది. కుటుంబ చరిత్రను ఏదో సమాచారం కోసం పోగు చేయకుండా...ప్రతి వారి తోనూ వారు పోగేసుకున్న అనుబంధాలనూ, అనుభూతుల్ని చక్కగా, హృద్యంగా వివరించారు. తాత పేరునే మరిచి పోతున్న నేటి రోజుల్లో....75 ఏళ్ల జీవితంలో ని ప్రతి అనుబంధాన్నీ, ఆ బంధం అందించిన మాధుర్యాన్ని, పేర్లతో సహా పంచుకొని....ఒక అనుబంధాల తేనె తుట్టను కదుపుతారు మన మనస్సుల్లో. మనం మర్చిపోయిన, మర్చిపోతున్న కొందరినైనా గుర్తు చేసుకొని గుండె నింపుకుంటాం వారు రాసిన వ్యక్తుల గూర్చి చదివి నప్పుడు. తనను చిన్నప్పుడు ఒకటవ తరగతి చదివించిన అమ్మమ్మ, తాతయ్యల నుండి....తనను సైకిల్ ఎక్కించుకు స్కూల్ కి తీసుకెళ్లిన వారిని కూడా మర్చిపోకుండా....తన జీవిత ప్రతి దశలోనూ తన మనస్సుకు చేరువైన వారినీ, తనని ప్రేమించిన వారినీ పేరు పేరునా స్మరించడం వారి ఉన్నత సంస్కారానికి నిదర్శనం. 
వీరి జీవితాన్ని తరచి చూస్తే ఎవరికైనా సుస్పష్టం గా గోచరించే అంశం ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది. అదే వారి ఆర్ధిక క్రమశిక్షణ ,ఆర్ధిక ప్రణాళిక, ఆచరణ. వారి తండ్రి గారు   కష్టం చేసి సంపాదించిన ఆస్తిని మూడంతస్తుల షాపింగ్ సముదాయంగా మార్చినా...ఉద్యోగ జీవితంలో చక్కటి ప్రణాళికతో సికింద్రాబాద్, సఫీల్ గూడ, సీతారాం నగర్ లలో స్థలాలు కొన్నా...మల్కాజిగిరి లో అపార్ట్మెంట్ కొన్నా...వారి ఆర్ధిక సూత్రాలే కారణం అని మనకు తెలుస్తుంది....వీటిని సమకూర్చే క్రమంలో వారు అనుసరించిన విధానాలు తెలియాలంటే...ఈ పుస్తకం చదవాల్సిందే. బిడ్డలకు చదువుతో పాటు డోఖా లేని ఆస్తిని సమకూర్చిన వీరు సతతా అభినందనీయులు. మరియూ ఇద్దరు కుమారులకూ ఇల్లు కట్టించి వారితో తన శేష జీవితం హాయిగా కలిసి గడపడం వారు భాగ్యశీలి అనడానికి నిదర్శనం. వారితో కలిసి ఉన్నా...తన ఆర్థిక స్వాతంత్య్రం ను కోల్పోని దృఢ శాలి....తన అంత్యక్రియలకు కూడా ముందుగానే సొమ్ము నిల్వ చేసిన ధైర్య శాలీ.పచ్చని చెట్టు లాంటి జీవితం వీరిది. 
తగిన ఉద్యోగం, తగినంత సంపదా ఉంది కదా అని వీరి జీవితం మొత్తం పూల పాన్పు అనుకుంటే పొరపాటే. మనిషి ఎదుర్కోవాల్సిన బాధలూ వీరిని వరించాయి. తీరని వేదననని మిగిల్చాయి. కాళ్ళు తడవకుండా సముద్రాన్ని దాటగల మేధావి కూడా కళ్ళు తడవకుండా జీవితాన్ని దాటలేదు అన్న నానుడి వీరి జీవితానికి కూడా వర్తిస్తుంది.  ఎంతో ఇష్టంగా ప్రేమించి, మతాలు వేరైనా పెద్దల్ని ఒప్పించి వివాహమాడిన ప్రియసఖి గృహ లక్ష్మీ గారు ఇద్దరు కుమారుల్ని కానుక ఇచ్చి నడి వయస్సులోనే అకస్మాత్తుగా వారిని ఈ లోకంలో ఒంటరిని చేసి వెళ్లిపోయిన సంఘటన మన హృదయాల్ని కదిల్చి వేస్తుంది. ఆ తల్లి లేని పిల్లలకు అన్నీ తానై  ఒంటరి తనాన్ని దిగమింగుకుంటూ...ఇటు ఉద్యోగాన్నీ సక్రమంగా నిర్వహిస్తూ వారు సవ్యసాచులే అయ్యారు. పిల్లలు చక్కగా చదువుకొని తండ్రి పేరు నిలబెట్టారు. అయితే ఆడ దిక్కు లేని ఇంటిని చక్కబెట్టడం కష్టమైన తరుణంలో... పెద్దల సలహా మేరకు  రాజా మణి గారిని రెండో వివాహం చేసుకున్నా....కొద్ది కాలానికే
విధి మరోసారి వారిని కాటేసి....ఆమెను ప్రమాదం రూపంలో మరణం మింగడం అత్యంత విషాదం. దాన్ని దిగమింగుకొని....ఒక కుమారుడు రాజకుమార్ జోషి B C A , మరో కుమారుడు వినోద్ జోషి మెకానికల్ ఇంజినీర్ గా తీర్చిదిద్దారు. చార్టెడ్ అకౌంట్స్ చేసి బ్యాంక్ లో ఉద్యోగం చేస్తూ...కుటుంబం కోసం ఉద్యోగాన్ని వదిలిన పెద్దకోడలు గ్లోరీ....సివిల్స్ ఎక్సమ్స్ కు ప్రిపేర్ అయ్యి...ఆలిండియా రేడియో లో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న రెండో కోడలు నిహారా ...ఉన్నత విద్యావంతులూ, సంస్కార వంతులూ అయిన కోడళ్లతో హాయిగా ఒకే ఇంటిపై ఉన్న రెండు అంతస్థుల్లోన్నూ కలిసి ఉంటూ మనుమళ్లతో చక్కటి శేష జీవితాన్ని గడుపుతున్న వీరి జీవితం విషాదం నుండి ఆనంద తీరాల వరకూ ఒక గొప్ప పయనం...
ప్రముఖ రచయిత డా.కె.ఎల్వ్.వీ.ప్రసాద్ గారు వియ్యంకులు అవ్వడం యాదృచ్చికం అయినా...వీరి పుస్తకం లోని సంఘటనలు అక్షర రూపం దాల్చడం వెనుక వారి ప్రోత్సహం ఉన్నా...స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కలిగి ఉండడం విజయకుమార్ గారి ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇక్కడ. చిట్ట చివరి వరకూ ఒక పుస్తకం చదివినట్టు ఉండదు. ఆయనతో కలిసి పయనిస్తున్నట్టు ఉంటుంది. వారి సంతోషాలకు, విజయాలకూ చప్పట్లు కొడుతూ...వారి బాధకు కన్నీటి బొట్లు కారుస్తూ మనల్ని మనం మర్చిపోతాము. కొన్ని విషయాలను గుండెల్లో భద్ర పరుచుకుంటాము. కొన్ని విషయాలు నేర్చుకుంటాము . ఇంత కంటే ఒక జీవితానికి ఏమి కావాలి. వారి జీవితం పుస్తకం గా మారడం సముచితం. మన మధ్యకు రావడం ఓ మంచి సందర్భం.
తన చుట్టూ ఉన్న ప్రపంచం అది చిన్నది అయినా...పెద్దది అయినా...దానికి *దీపం* గానైనా మారాలి... లేదా ఆ కాంతిని ప్రతిబింబించే *అద్దంగా* అయినా మారాలి. అలా వారి కుటుంబ  భావి తరాలకు స్ఫూర్తిగా మారిన జీవితమే శ్రీ నల్లి.విజయకుమార్ గారి జీవన ప్రస్థానం.
వారిని చదివిన తర్వాత...మన పెద్దలు చెప్పిన మాటలు వీరి విషయంలో అక్షరాలా నిజం అనిపిస్తుంది.
*ఐశ్వర్యం* ఆంటే....
  ----------------------
తల్లిదండ్రులను రోజూ చూడగల్గడం....
అనుకూలమెయిన భర్త/భార్య కలిగి ఉండడం....
చెప్పిన మాట వినే సంతానం ఉండడం....
రుణాలు లేకపోవడం....
అవసరానికి సరిపడా ధనం కలిగి ఉండడం...
ఏది తిన్నా అరిగించుకునే శక్తి ఉండడం....
మనకోసం సంతోషించే, కన్నీరు కార్చే మిత్రులు ఉండడం....
పదిమందిలో గౌరవించ బడడం.....
ఇవన్నీ ఉన్న శ్రీ విజయకుమార్ గారు నిజమైన *ఐశ్వర్య వంతుడు* !
వారి బ్రతుకు బాటలో....అడుగుల సవ్వడి వారి పిల్లల పిల్లల తరానికి వినిపిస్తుంది. మంచి పుస్తకాన్ని కాదు కాదు....మంచి జీవితాన్ని చదవాలి అనుకుంటే....
*బ్రతుకు బాటలో...అడుగుల సవ్వడి* ఒకపరి చేతుల్లోకి తీసుకోవాల్సిందే.
                            ***
పుస్తకం: *బ్రతుకు బాటలో ...అడుగుల సవ్వడి*(ఆత్మ కథ)
రచయిత : నల్లి.విజయకుమార్
సఫీల్ గూడ
ప్రతులకు : శ్రీ నల్లి విజయకుమార్,
                  #ఎస్.ఆర్/297,సీతారాం నగర్
                  సఫిల్ గూడ
                  సికిందరాబాద్-500056
                  తెలంగాణ రాష్ట్రం.

కామెంట్‌లు