సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయాలు -775
"అనాధ ప్రేత సంస్కారాత్ కోటి యజ్ఞ ఫలం లభేత్" న్యాయము "
******
అనాధ అనగా తల్లిదండ్రులు,ఎవరూ లేని వ్యక్తి,అసహాయుడు,పేద పితృ హీనుడు.ప్రేత అనగా లోకమునువీడిన,మరణించిన,చనిపోయిన వ్యక్తి,మృతుడు,దెయ్యము.సంస్కారం అనగా మత కర్మలు,ప్రవర్తనా లక్షణాలు, మానసిక ముద్రలు.కోటి అనగా వంద లక్షలు.యజ్ఞం అనగా ఒక పురాతన వేద ఆచారం, భక్తి , ఆరాధన,అర్పణ.ఫలం అనగా పండు, ఫలితం.లభేత్ అనగా కలుగుతుంది అని అర్థము.
ఎవరూ లేని అనామక వ్యక్తి శవమునకు దహన సంస్కారాలు చేయడం వల్ల కోటి యజ్ఞముల ఫలము కలుగునని  అర్థము.
 అనాధ శవానికి దహన సంస్కారాలు చేయడం అంటే అశ్వమేధ యాగం చేయడంతో సమానమని  చెబుతూ రాసిన ఈ శ్లోకాన్ని చూద్దామా...
 "దరిద్రాయ కృతం దానం, శూన్య లింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుః"... అనగా దరిద్రుడికి లేదా పేదవాడికి దానం చేయడం, పాడుపడిన గుడిలోని శివ లింగాన్ని పూజించడం, దిక్కులేని శవమునకు ఆచారం ప్రకారం దహన సంస్కారాలు చేయడం...ఈ మూడు పనులు అశ్వమేధ యాగం చేసినంత, అశ్వమేధ యాగంతో సమానమైన ఫలములను ఇస్తాయి.
 అయితే ఇందులో గ్రహించాల్సిన విషయం ఏమిటంటే పేదవారికి దానధర్మాలు చేయడానికి ఎవరో ఒకరు ముందుకు వస్తుంటారు.భక్తులు అనే వారు  శివలింగం ఎక్కడ ఉన్నా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కానీ అనాధ శవానికి సంస్కారాలు చేయడానికి ఎవరూ స్వచ్ఛందంగా ముందుకు రాలేరు. కారణం మనిషికి చావు అంటేనే భయం.చాలా మందిని చూస్తూ ఉంటాం.కొంచెం దూరం బంధువుల, స్నేహితుల ఇళ్ళల్లో లేదా  బాగా తెలిసిన వాళ్ళ ఇళ్ళల్లో మరణం సంభవించినప్పుడు వెళ్ళి కనీసం చూసి రావడానికి కూడా ఇష్టపడరు.అలాంటిది ఇక దహన సంస్కారాలు అంటే ఇక వెళ్ళడం అనేదే ఉండదు. పైగా భయపడుతూ అంటీముట్టనట్లు ఉండటం  జరుగుతుంటుంది.
మరి అనాథ ప్రేత దహన సంస్కారం  చేయాలంటే  ముఖ్యంగా మానవతా హృదయం ఉండాలి .విలువలతో కూడిన సంస్కారం ఉండాలి. పరోపకారం చేయాలనే తపన ఉండాలి.అవి ఉన్నప్పుడే ఏ సంబంధం లేని,ఎవరో అనాధ శవానికి అంత్యక్రియలు దహన సంస్కారాలు చేయగలుగుతారు.అలాంటి పనులకు కొంత ధైర్యం మరికొంత  సాహసం ఉండాలి.
ఎందుకంటే వివిధ ఆచారాలు భక్తితో పాటు ఉపవాసాలకు ప్రముఖ పీట వేస్తుంటాయి.వీటితో పాటు శుచి శుభ్రతతో పాటు అవసరమైన శౌచ్యము పాటించడం మొదలైనవి ఉంటాయి..
 ఏ మతమైనా ఒకటే చెబుతుంది "పరోపకారం వల్ల పుణ్యం వస్తుందని, పరులకు కీడు చేయడం వల్ల పాపం అంటుకుంటుందని.అలా "అనాథ ప్రేత సంస్కారం" అనేది ఇతర ఎన్నో  పుణ్య కార్యాల కంటే కూడా  ఎన్నో రెట్లు గొప్ప మరియు,మహా పుణ్యము..
వివిధ మతాల ఆచారాలు  భక్తితో పాటు ఉపవాసాలకు ప్రముఖ పీట వేస్తుంటాయి.అంతకంటే ఎక్కువగా ఆచారాలను తు చ.*తప్పకుండా పాటిస్తుంటాయి. ఆ ఆచారాల వలన ఇలాంటి అనాథ ప్రేత సంస్కారాలు చేయడానికి సుముఖత ఉండదు. ఎవరో అనామకుడి శవంతో మనకేం బంధం?మనకెందుకు? అనే ఆలోచన వుంటుంది.అలాంటి వారి నుద్దేశించి  చెప్పబడిందీ న్యాయము.
 ఏది ఏమైనా  అనాథులకు దాన ధర్మాలు చేయడమే కాకుండా అనామక శవాలకు అంత్యక్రియలు,దహన సంస్కారాలు ధైర్యముంటే చేద్దాం.లేదంటే చేసేవారికి మనవంతుగా ఆర్థిక, హార్దిక సహకారం చేద్దాం. మీరూ నాతో కలిసి వస్తారు కదూ!. 

కామెంట్‌లు