సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-781
" న్యాయము
"అనార్య సంగమా ద్వరం విరోధోపి సమం మహాత్మభి" న్యాయము
*****
అనార్య అనగా గౌరవింప దగని వాడు.సంగమం అనగా కలయిక ,సహవాసం. విరోధి అనగా వ్యతిరేకించే వ్యక్తి, ప్రత్యర్థి, శత్రువు. సమం అనగా సమానత్వం , శాంతి యుత, పోల్చదగిన. మహాత్మ అనగా గొప్ప ఆత్మ, గొప్ప వ్యక్తి ఆనే అర్థాలు ఉన్నాయి.
చెడ్డ వారితో  లేదా గౌరవింపదగని వ్యక్తుల స్నేహము కంటే మహాత్ములతో విరోధము మేలు అని అర్థము.
ముందుగా గౌరవింపదగని లేదా చెడ్డ వారు అంటే ఎవరో క్లుప్తంగా తెలుసుకుందాం.
 చెడ్డ పనులు చేసేవారు,సాధుగుణం లేని వారిని చెడ్డవారు అంటుంటాం.అయితే భాస్కర శతక కర్త  చెడ్డవాడు అంటే ఇదిగో ఇలా వుంటాడని చెబుతున్నాడు.
"ఊరక సజ్జనుం డొదిగి యుండిన నైన దురాత్మకుండు ని/ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా/ చీరలు నూరు టంకములు చేసెడి వైనను బెట్టె నుండగా/జేరి చినింగిపో గొరుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!"
అనగా సజ్జనుడు తొలగి యెంత మిన్నకుండినా అనగా తన మానాన తాను ఉన్నప్పటికీ దుర్జనుడు ఓర్వలేని తనముతో వారికి కీడు చేస్తాడు.అలాగే ఎలాంటి కారణం లేకుండా  ఏమీ లాభం లేకుండానే చిమ్మెట పురుగు పెట్టెలో ఉన్న బట్టల్ని కొరికి చింపుతుంది.అనగా దుష్టుడు కూడా తనకు ఎలాంటి లాభం లేకున్నా  మంచివారిని యిబ్బంది పెడతాడు అని అర్థము.
 చెడ్డ వారితో చేసే స్నేహము తాటి చెట్టు క్రింద తాగిన పాలలాంటిది. అక్కడ  నిలబడి పాలు తాగినా, దాహమై  నీళ్ళు తాగినా ఎవరూ నమ్మరు కల్లునే తాగారని అంటారు కదా ! కాబట్టి చెడ్డవారితో సహవాసం అస్సలు తగదనేది ఈ న్యాయము ద్వారా మనం గ్రహించవచ్చు.
ఇక మహాత్ములు గొప్ప వారితో విరోధం ఒకందుకు మంచిదే.ఎందుకంటే   ఓ గొప్ప వ్యక్తితో గొడవపడటం  వల్ల  ఫలానా వ్యక్తిగా అందరికీ తెలిసే అవకాశం ఉంటుంది. దాంతో కొంత  పేరు ప్రతిష్ట ఇనుమడిస్తుంది .మంచి చెడుల పోలిక వల్ల తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది.సమ ఉజ్జీ కాకపోయినా సమాజం దృష్టి తనపైనే ఉంటుంది.ఇక అలాంటి వారితో విరోధం వల్ల విజ్ఞానం కూడా పెరుగుతుంది..
 మహాత్ములతో విరోధము రామ రావణ యుద్దము వలె ఉంటుంది.ఎంతో సజ్జనుడైన రాముడితో  పెట్టుకున్న విరోధం చరిత్రలో రావణుని చిరస్థాయిగా నిలిపింది.
ఏది ఏమైనా "చెడ్డ వాడిని  వందిచ్చి వదులుకోవాలి.మంచి వాడిని వెయ్యి"చ్చి కొనుక్కోవాలి అంటారు.
 ఈ "అనార్య సంగమా ద్వరం విరోధోపి సమం మహాత్మభి" న్యాయములోని అంతరార్థం గ్రహిఃచి  ఆ విధంగా జీవించడం నేర్చుకోవాలి.

కామెంట్‌లు