తీరిక సమయాలలో : సరికొండ శ్రీనివాసరాజు

 టీచర్ తన విద్యార్థులతో ఒక పార్కులో సమావేశం అయింది. ఆరోజు ఆదివారం. పార్కులో రకరకాల గేమ్స్ ఆడి, ఆ తర్వాత మీటింగ్ ఏర్పాటు చేశారు. టీచర్ ఇలా అన్నది. ఈరోజు చాలా తీరికగా అందరం కలసి రకరకాల ఆటలతో ఎంజాయ్ చేశాము. ఇప్పుడు చెప్పండి. మీరు ప్రతిరోజూ మరియు సెలవు రోజుల్లో తీరిక సమయాలను ఎలా గడుపుతారు. మీ ఇష్టం. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి. మీరు చెప్పిన తర్వాత మీరు చెప్పింది నిజమా కాదా అని మీ తల్లిదండ్రులకు కాల్ చేసి, నిర్ధారణ చేసుకుంటాను. మీరు చెప్పినది నిజమైతే మీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఉంటాయి. నిజం కాకపొతే ఆ తర్వాత తలా 100 రూపాయల ఫైన్ వసూలు చేస్తా." అన్నది టీచర్.
      "తీరిక సమయాలలో మా చెల్లెలితో కలసి షటిల్ ఆడతాను టీచర్." అన్నాడు రాజేశ్. "తీరిక సమయాలలో స్నేహితులతో క్రికెట్ ఆడతాను టీచర్." అన్నాడు సతీశ్. "తీరిక సమయాలలో టీవీల్లో సినిమాలు, ప్రొగ్రామ్స్ చూస్తాను టీచర్!" అన్నాడు మహేశ్. "తీరిక సమయాలలో రాము ఇంటికి వెళ్ళి రాముతో క్యారమ్స్ ఆడతా టీచర్." అన్నాడు వాసు. అప్పుడు వాసు ఇలా అన్నాడు. "రామూతో క్యారమ్స్ ఆడేటప్పుడు ఎవరు గెలుస్తామో, ఎవరు ఓడిపోతామో పట్టించుకోం. ఆట పర్ఫెక్ట్ కావాలి. ఇద్దరికీ సమయం సద్వినియోగం కావాలి." అన్నాడు వాసు. "తీరిక సమయాలలో మొబైల్ గేమ్స్ ఆడుకుంటాం. ఇంకా మొబైల్ ఫోన్లతో రకరకాలుగా ఎంజాయ్ చేస్తా." అన్నది మాలిని. "సమ్మర్ వస్తే ఎంత టైం పాస్? ఐ.పి.ఎల్. క్రికెట్ తనివి తీరా చూస్తాము." అన్నాడు మోహన్. "తీరిక సమయాలలో చిత్ర లేఖనం నేర్చుకుంటున్నా టీచర్. రకరకాల బొమ్మలను అందంగా వేయడం నేర్చుకుంటున్నా." అన్నది అలివేలు. "ఫ్రీగా ఉన్నప్పుడు రాగయుక్తంగా పాటలు పాడటం అభ్యాసం చేస్తున్నా టీచర్. దీనికి గురువులు ఎవరూ లేరు. మొబైల్ ఫోన్ల ద్వారా పాటలు వింటూ అలా సహజంగా పాడటం ప్రాక్టీస్ చేస్తున్నా." అన్నది గీతాంజలి. "తీరిక సమయాలలో ఇంట్లో క్యారమ్స్, చెస్ ఆడతాము టీచర్." అన్నది శివాని. "మా నాయనమ్మ మాతో అష్టా చెమ్మ, పచ్చీసు, వామన గుంటలు వంటి ఆటలు ఆడుతుంది. భలే సరదాగా ఉంటుంది. మంచి టైం పాస్." అన్నది సిరి. "తీరిక సమయాలలో మేము ఆడే ఆటలకు అంతు ఉండదు. చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు." అన్నది వాణి. "అవును. నేను ఒక్క క్యారమ్స్ గురించే చెప్పాను కాని, ఎవ్వరూ ఆడలేనన్ని వినూత్నమైన ఆటలు ఆడతాం." అన్నాడు వాసు.
      అప్పుడు టీచర్ ఇలా అన్నది. "ఈరోజు నా పుట్టినరోజు. మీరు తీరిక సమయాలలో ఏమి చేస్తారో తెలుసుకొని, మీకు బహుమతులు ఇద్దామని అనుకున్నా. ఈ రోజుల్లో టైం పాస్ అంటే మొబైల్ ఫోన్లకు బానిసలు కావడం, టీవీలు, ఆటలంటే కేవలం క్రికెట్. ఇదే లోకం. మరో ప్రపంచం లేదు. ఇలా ఎంజాయ్ చేసేవారిని పక్కన పెట్టి, మిగతా వారికి మంచి విలువైన కానుకలను ఇస్తాను. ఇదే నా నిర్ణయం." అన్నది శర్వాణి టీచర్. "మంచి నిర్ణయం టీచర్." అన్నాడు విద్యార్థి వేంకటేశు. 

కామెంట్‌లు