సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయాలు-787
పుష్ఫ వంతోపకార న్యాయము
******
పుష్పవంతులు అనగా సూర్య చంద్రులు.అంటే పుష్పాలను వికసింప జేసేవారు. ఉపకారం అనగా సేవ,సహకారం, ఇతరులకు మంచి చేయడం అని అర్థం.పరోపకారానికి మించిన ధర్మం మరొకటి లేదు కదా!.
సూర్యుడిని ఆదిత్యుడు అంటారు.ఇతడు సూర్యమండలాంతర్గత విష్ణువు,లోక బాంధవుడు.
ఒకే ఒక్క సూర్యుడు సకల జీవరాసులలో ఒక్కొక్కరికి ఒక్కక్కడుగా అనేక ప్రకారములుగానూ, తాను సృష్టించిన నానావిధ  ప్రాణి సమూహాల హృదయ కమలాలలో నానా విధములైన రూపాలతో సర్వకాల సర్వావస్థల యందు తన లీలా విలాసంతో తనరారుతూ ఉంటాడు.
అలాగే  ఒకే ఒక్క చంద్రుని వెన్నెలకు కలువలు వికసిస్తాయి.ప్రకృతి పరవశిస్తుంది.
అలా సూర్యుడు, చంద్రుడు మనందరికే కాకుండా సమస్త జీవులకు సంతోషాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారని తెలుసు.
వీరు తక్కిన గ్రహములకు ,తమ రాసులలోని వారికి ప్రకాశమునిచ్చి ఆనందింప జేయడమే కాకుండా,క్షణమైనా నిలువక దివారాత్రములు సంచారము చేస్తూ, ప్రపంచానికి వెలుతురు, వేడిని,వెన్నెలను ఇస్తుంటారు. సస్యాదులను ఫలింప చేస్తుంటారు.ఈ విధంగా జగత్తుకు ఉపకార హేతువులుగా, కనిపించే దైవాలుగా, పూజ్యనీయులయ్యారనే అర్థంతో ఈ "పుష్పవంతోపకార న్యాయము"ను మన పెద్దలు ఉదాహరణగా చెబుతుంటారు.
పరోపకారార్ధమై వెలుగు, వెన్నెలలు ప్రసాదించే సూర్య చంద్రులు లేని జగతిని ఊహించుకోలేము.
 'పరోపకారార్ధం మిదం శరీరం'  అని తమ ప్రాణాలను ఇతరుల శ్రేయస్సు కోసం అర్పించిన కథలను పురాణేతిహాసాల్లో  శిబి చక్రవర్తి,బలి చక్రవర్తి, దధీచి లాంటి వారెందరి గురించో మనం విన్నాం. చదువుకున్నాం కదా!అలాంటి కథల్లోదే  మరో గొప్ప వ్యక్తి కథను చూద్దామా! 
ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్న సమయంలో యాగాశ్వాన్ని మయూరధ్వజుడనే రాజు పట్టుకున్నాడు. మయూరధ్వజుడిపై యుద్ధం చేసి యాగాశ్వాన్ని విడిపించేందుకు శ్రీకృష్ణుడి సహాయం కోరాడు అర్జునుడు. సరేనన్నాడు శ్రీకృష్ణుడు.ఇద్దరు కలిసి యుద్ధం చేసినా మయూరధ్వజుడిని గెలవలేక పోయారు.దాంతో ఆశ్చర్యపోయిన అర్జునుడు శ్రీకృష్ణుని కారణం అడిగాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు ' అర్జునా! మయూరద్వజుడు ఎంతో ధర్మనిరతి గలవాడు. ఇతరులకు సహాయం చేయడం కోసం ప్రాణాలను సైతం అర్పించడానికి వెనుకాడని వాడు.అలాంటి వ్యక్తిని  గెలవడం చాలా కష్టం. మయూరధ్వజుడి గొప్పతనం ఏమిటో నీకు చూపిస్తాను పద అన్నాడు.
ఇద్దరూ మారు వేషాల్లో  మయూరధ్వజుని ఇంటికి వెళ్ళారు.అతిథులైన కృష్ణార్జునులకు వినయపూర్వకంగా మర్యాదలు చేశాడు.
 భోజనం సిద్ధం చేయబోతున్న అతడితో  'మాకొక పెద్ద ఆపద వచ్చింది.ఆ సహాయం కోసము వచ్చాం.మేం అడవిలో ప్రయాణిస్తున్న  సమయంలో నా కుమారుని ఓ పెద్ద పులి పట్టుకున్నది. కళ్ళ ముందు వాడి శరీరాన్ని తింటుంటే మేము అంతులేని దుఃఖంలో మునిగి పోయి దైవాన్ని ప్రార్ధిస్తున్న సమయంలో ఒక అశరీర వాణి  పలుకుతూ " మయూరధ్వజుని శరీరంలో సగభాగం ఈ పులికి అర్పిస్తే,నీ పుత్రుడు బతుకుతాడు." చెప్పింది.'పుత్రభిక్ష పెట్టు రాజా! అన్నాడు.
ఆ మాటలు విన్న మయూరధ్వజుడు  ఎంతో  ఆనందంగా"ఈ నాటికి నా దేహానికి సార్థకత లభించబోతోంది. పసివాడి ప్రాణాలు కాపాడటానికి ఉపయోగపడబోతోంది. ఇంతకన్నా సంతోషం ఇంకొకటి లేదు.ఎలాంటి సంశయం లేకుండా నా శరీరంలోని సగభాగం తీసుకుని ఆ పులికి సమర్పించండి " అన్నాడు.
 వెంటనే తన భార్యాపిల్లలను పిలిచి తన శరీరాన్ని రెండు భాగాలుగా ఖండించి (రెండు భాగాలుగా చేసి) అతిథులకు ఇవ్వమని చెప్పాడు.
 అతని మాట ప్రకారం అతని శరీరాన్ని రెండు భాగాలుగా చేస్తున్న సమయంలో ఎడమ కంటి నుండి కన్నీళ్లు కారడం చూశాడు శ్రీకృష్ణుడు.అతని త్యాగనిరతిని లోకానికి తెలియజేసే ఉద్దేశంతో "మయూరధ్వజుడా!ఈ త్యాగం బాధ పడుతూ చేస్తున్నావా? సంతోషంగా, మనస్ఫూర్తిగా ఇచ్చేదే త్యాగము అవుతుంది కదా !ఎదుటి వారి కష్టాలను చూసి బాధ పడటం దయాగుణం. మనల్ని చూసి మనమే జాలి పడటం నీచగుణం. ఎందుకలా కన్నీరు కారుస్తున్నావు? అడిగిన కృష్ణుడితో  "అయ్యా!  కుడి వైపు భాగమే పరోపకారార్ధం ఉపయోగపడుతోంది.దానికి దక్కిన అదృష్టం ఎడమ వైపు భాగానికి దక్కలేదనే బాధతో ఎడమకంటి నుండి నీళ్ళు కారుతున్నాయి." అన్నాడు.
అతని యొక్క త్యాగ నిరతి,పరోపకార బుద్ధిని చూసి అర్జునుడు ఆశ్చర్య పోతాడు. శ్రీ కృష్ణడు నిజ రూపం ధరించి మయూరధ్వజునికి యథారూపాన్ని ఇస్తాడు.
ఇలాంటి వారి కోవకు చెందిన వారే స్వాతంత్ర్యం కోసం లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లిన వారు, ఉరికొయ్యలను ముద్దాడిన త్యాగధనులు. సమాన హక్కుల కోసం, సమాజంలోని అసమానతలను నిర్మూలించడానికి జీవితాలను త్యాగం చేసిన మహనీయులు.
  సూర్య చంద్రుల్లా, త్యాగ మూర్తులమై పరోపకార బుద్ధిని కలిగి వుండాలనీ,వెలుగు,వెన్నెల లాంటి మంచి పనులను చేస్తూ, జీవితాన్ని సార్థకం చేసుకోవాలని  ఈ "పుష్పవంతోపకార న్యాయము"మనకు తెలియజేస్తుంది.కాబట్టిఈ న్యాయమును నిత్యం గమనంలో పెట్టుకొని జీవితాన్ని గడపుదాం.

కామెంట్‌లు