మహాశివరాత్రి ప్రాశస్థ్యం:-సి.హెచ్.ప్రతాప్

 ప్రతి నెల అమావాస్య ముందు అంటే కృష్ణపక్షంలో రాత్రి 12 గంటల సమయానికి చతుర్దశి ఉన్నరోజునే శివరాత్రి అని నెలనెల వస్తాయి కాబట్టి మాస శివరాత్రిగా ఆ రోజు ప్రాచుర్యం పొందింది. ఇలా ఒక సంవత్సరంలో పన్నెండు మాస శివరాత్రులలో 11వ దైన మాఘమాస శివరాత్రిని మహా శివరాత్రిగా ఉత్సవంగా జరుపుకోవడం ఒక సంప్రదాయం. ప్రతినెల మాస శివరాత్రినాడు శివాభిషేకం, ఉపవాసం, శివపూజ చేసుకుంటే విశేషం. కానీ అందరికీ నెలనెల సాధ్యం కాదు కాబట్టి సామాన్యులందరికీ జన్మకో శివరాత్రి అన్నట్లు మహాశివరాత్రి అత్యంత పరమ పవిత్రమైనదిగా శాస్త్రాలు ప్రవచించాయి. ఇక్కడి నుండి జన్మకో శివరాత్రి అనే నానుడి కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది.  భారతీయ సనాతన పండుగల్లో మహా శివరాత్రి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న గొప్ప పండుగ. వేద కాలం నుంచి భక్తులు ఎంతో నిగ్రహ నియమ నిష్టలతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్న మహా పర్వదినం. ప్రపంచవ్యాప్తంగా హిందువులు శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ పరమశివుని కృపకు పాత్రులవుతున్నారు.
ఒక సందర్భంలో ఎవరు గొప్ప అనే ఒక వివాదం బ్రహ్మ, విష్ణువుల మధ్య తలెత్తిందని , వారికి జ్ఞాదయం కలిగించేందుకు ఒక మహాగ్ని స్థంబాన్ని సృష్టించి , ఆ స్థంభానికి ఆది, అంతాలను కనుక్కోవాలని, అలా మీలో ఎవరు కనుగొంటే వారే గొప్పవారవుతారని వారిరువురికి పరీక్ష పెట్టాడు శివుడు అని స్కంద పురాణంలో తెలుపబడింది.. ఈ క్రమంలో బ్రహ్మ, విష్ణువు లెవరూ ఆ అనంతమైన శివలింగాన్ని ఆది, అంతాలను కనుగొనలేక వైఫల్యం చెందారు. దీంతో వారి గర్వాన్ని అణచిన సందర్భాన్ని.. మహాశివరాత్రిగా.. సదాశివుడు ప్రపంచానికి ప్రకటించాడు. ఇలా తాను జ్వాలాలింగ రూపంలో ఉద్భవించినట్టి మాఘమాస, బహుళ చతుర్దశి, ధనిష్టాన నక్షత్రం, దివ్య (నిశీధి) రాత్రి.. మహాశివరాత్రి తనకు అత్యంత ప్రీతిపాత్రమైనదన్నాడు శివుడు.. ఈ మహా పర్వదినాన.. శివలింగాన్ని దర్శించి, అభిషేకించి.. ఉపవాసాలతో ఆరాధించి జాగరణ చేసిన వారు తనకు ప్రీతిపాత్రులై తన కృపను చూరగొని సకల మహా పాపాల నుంచి విముక్తులవుతారు.
మహాశివరాత్రి ఒక హిందువుల పండుగ.  ఇది శివ, దేవేరి పార్వతి వివాహం జరిగిన రోజు అని కూడా ఒక గాధ ప్రాచుర్యంలో వుంది.. మహా శివరాత్రి పండుగ  శివ మరియు శక్తి యొక్క కలయికను సూచిస్తుంది అని అంటారు. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో ఫాల్గుణ మాసము యొక్క కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.  శైవులు ధరించే భస్మము/విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైనదని భావిస్తారు. రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ”, శివ యొక్క పవిత్ర మంత్రం పఠిస్తారు.ఆ రోజున మహాదేవుడిని విశేష పూజలతో కొలుస్తారు. అర్చనలు, అభిషేకాలు చేస్తారు. పూజల్లో గోగుపూలు, మారేడు, బిల్వ దళాలను సమర్పిస్తారు. వీటన్నింటిలో బిల్వపత్రం చాలా శ్రేష్టమైంది. శివుడికి ఎంతో ప్రీతికరమైంది. శివభక్తులు ఏడాదంతా మహాశివరాత్రి కోసం వేచి చూస్తుంటారు. ఈ రోజున శివుడి కల్యాణోత్సవాన్ని కనుల పండువలా జరుపుకొంటారు. శివ పురాణం ప్రకారం సృష్టి ఈ రోజు నుంచే మొదలైంది అని కూడా శివపురాణంలో పేర్కొనబడింది.

కామెంట్‌లు