సుప్రభాత కవిత : -బృంద
నీ దారిని మనసును పరిచి
నా చూపుల ముగ్గులు వేసి 
ఏ నిమిషము నీ రాకనో 
ఏమరక స్వాగతించాలని.....

రెప్పలు మూయక వేచి 
గొప్పగా నిన్ను తలచి 
మెప్పు పొందాలని 
కుప్పగా పువ్వులు పోసి....

నీ కన్నా నా కెవరని 
నీవే నా సకలమని 
నీతో నా వెతలన్నీ 
నిశ్శబ్దంగా విన్నవించాలని....

నీరవ నిశీధిలో 
నిదుర రాక మేలుకున్న 
నా కన్నుల కాంతి నింప 
నీ రాక కానుక కావాలని 

తరగని ఆశల తుట్టెను 
కదిలించక పదిలంగా 
దాచి ఉంచి విన్నవింప 
వేచి ఉంటి నీ కోసమే!

ఎంత మేర నా భాగ్యమోనని 
కొంత కలత ఉన్నది కానీ 
అంతయూ నీకు తెలుసు 
సుంత కరుణ చూపిన చాలు..

సందడిగా ఎదను నింప 
పండుగలా ఏతెంచు నిన్ను 
నిండుగ స్వాగతింతు భాస్కరా 
రెండు కరములు జోడించి.

🌸🌸 సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు