సునంద భాషితం:- వురిమళ్ల సునంద, ఖమ్మం

 న్యాయములు-767
అంతతోశ్మాపి జీర్యతే న్యాయము
****
అంత అనగా దగ్గరిదగు,చివరిదగు,సుందరమగు, దగ్గర,చివర,కొన,చావు.ఆశ్మాపి అనగా రాయి కూడా. జీర్యతి అనగా జీర్ణించిపోతుంది.
తుదకు రాయి కూడా జీర్ణించిపోవును.అని అర్థము."సర్వం నశ్వరం"అనుటకు ఉదాహరణగా దీనిని ఉపయోగిస్తారు.
ఈ న్యాయాన్ని  మన పెద్దలు తరచుగా ఉపయోగిస్తుంటారు.ఎవరైనా నీతి తప్ఫి ప్రవర్తిస్తే వాళ్ళను  ఉద్దేశించి"గుడిని గుడిలో లింగాన్ని కూడా మింగేరకం" అన్నింటినీ జీర్ణం చేసుకుంటాడు.మింగుతాడు" అనే సామాన్య అర్థంతో ఉపయోగిస్తారు.
 అయితే అది ఒక కోణంలో మాత్రమే.'రాయి కూడా జీర్ణమైపోతుంది "అనే అర్థంతో మరో కోణంలో చూద్దాం.
పసి పిల్లలకు ఉగ్గు పెట్టిన తర్వాత "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం- ఏనుగుకు వెలగపళ్ళు జీర్ణం - పాపాయికి/ పాపడికి పాలు జీర్ణం/ ఉగ్గు పాలు జీర్ణం" అంటూ పాడుతూ  వుండేవారు.
అలా పిల్లలకు, పెద్దలకు ఒకవేళ ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినట్లయితే కూడా ఇదే పాట పాడుతూ పొట్ట నిమిరే వారు.
అలా వెనుకటి తరం తల్లులు సందర్భానికొక పాటనో గేయమో పాడుతూ పిల్లలను పెంచే వారు..
 మరి వాతాపి జీర్ణం అనే గేయం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉంది.అదేమిటో చూద్దాం.పూర్వకాలంలో వాతాపి,ఇల్వలుడు అనే రాక్షస సోదరులు ఉండేవారు. వారు  ఊరికి దగ్గర గల అడవిలో నివసిస్తూ ఉండేవాళ్ళు.వాళ్ళ రాక్షస ఆకలి తీర్చుకోవడానికి బ్రాహ్మణ వేషం వేసుకునే వారు.అలా  దారిలో వెళ్ళే వారిని పిలిచి "మేం బ్రాహ్మణుడికి భోజనం పెట్టాలని  నియమం పట్టుకున్నాం. తప్పకుండా రమ్మని పిలిచేవారు.
అలా వాళ్ళ మాటలు నమ్మి వెళ్ళిన వాళ్ళు  వాళ్ళ ఆకలికి బలైపోయేవాళ్ళు.
 
 వచ్చిన వారికి భోజనంలోకి  కూర కోసం వాతాపి  మేకగా మారేవాడు.ఇల్వలుడు ఆ మేకను కోసి కూర వండి వచ్చిన అతిథులకు భోజనం  పెట్టేవాడు. తిన్న తరువాత "అన్నదాత సుఖీభవ" అని  ఆ అతిథులు జీవించేవారు. అలా అన్న తర్వాత "వాతాపి బయటకు రా" అనే వాడు.అప్పుడా వాతాపి ఆ అథితుల పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చే వాడు. అలా చేయడంతో చనిపోయిన ఆ బ్రాహ్మణ అతిథులను ఇద్దరూ కలిసి సంతోషంగా తినేవారు.
ఇదంతా తెలుసుకున్న అగస్త్యుడు వాళ్ళ కంటబడేలా ఆ ప్రాంతంలో తిరుగుతూ భోజనం చేయడానికి వారిచే పిలవబడతాడు.ఎప్పటి లాగే మేకగా మారిన వాతాపిని చంపి కూర వండి భోజనం పెట్టాడు ఇల్వలుడు. అగస్త్యుడు భోజనం చేసిన తరువాత ఇల్వలుడు వాతాపిని బయటకు రా అని పిలిచే లోపు  "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ పొట్ట నిమురుకుంటాడు.ఇంకేముంది మహాముని అగస్త్యుడి తపోశక్తితో వాతాపి కడుపులో జీర్ణమై పోయాడు.విషయం గమనించి ఇల్వలుడు అక్కడ నుంచి పారిపోతాడు.అప్పటి నుంచి ఆ  జాతీయానికి చాలా పేరు వచ్చింది. అలా పొరపాటున తిన్న రాయి కూడా జీర్ణించిపోవును అని అర్థము.
దీనినే ఆధ్యాత్మిక వాదుల కోణంలో చూస్తే (తుదకు రాయి కూడా జీర్ణించిపోవడము) అంటే "సర్వం నశ్వరం" అని. సర్వం నశ్వరం అంటే సర్వకర్మ అన్ని కార్యకలాపాలు,సర్వకర్మాణి-భౌతిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ప్రతిచర్యలు అన్ని కూడా నశించిపోతాయి అన్నమాట.
ఇలా నశించనివి- నశించేవి రెండు భాగాలుగా "శూన్యం- సర్వముగా చెప్పబడింది. శూన్యం నుంచి సర్వం వచ్చిందనీ.సర్వం మరల శూన్యంలో కలిసిపోతుందనీ.శూన్యం మరియు సర్వము ఒక్కటేనని  చెప్పారు.ఇక ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు.ఒకవేళ శాశ్వతమైనది ఏదైనా ఉందా? అంటే అది కేవలం కాలం మాత్రమే ననీ అది ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందనేది మనందరికీ తెలిసిందే.
అన్నీ అశాశ్వతమైన ఈ ప్రపంచంలో మరి ఏది శాశ్వతం అనే సందేహం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది.భూమి, ఆకాశం నదులు, సముద్రాలతో పాటు మనం చేసే మంచి  రాయిలా జీర్ణం కాకుండా శాశ్వతంగా ఈ నేలపై ఉంటుంది.
ఇదండీ సంగతి! ఏవి జీర్ణం అవుతాయి. ఏవి జీర్ణం కాకుండా ఉంటాయో మనం ఈ "అంతతో శ్మాపి జీర్యతే న్యాయం "ద్వారా తెలుసుకున్నాం.  మరి మనం ఈ లోకంలో శాశ్వతమైన మంచి కోసం, మంచిని పెంచేందుకు ప్రతి క్షణం కృషి చేద్దాం.

కామెంట్‌లు