న్యాయములు-771
అణురపి విశేషోధ్యవసాయకరః న్యాయము
*****
అణురపి అనగా అతి సూక్ష్మమైన,పరమాణువు గాని.విశేషము అనగా సాధనము.అధ్యవసాయము అనగా నిశ్చయము,ఉత్సాహము,తాను ఏది పొందవలెనని ఆచార్యుని ఆశ్రయించాడో అదియే తాను తప్పక పొందవలెనన్న గట్టి పూనిక కలిగి ఆ పూనికను రోజు రోజుకూ గట్టి పరుచుకునే లక్షణము కలిగి వుండుట. కర అనగా చేయి అని అర్థము.
అధ్యవసాయము అంటే ఈ పనిని నేను చేయవలెను,ఇది నావిధి అని తలచి ఆ పనిలో ప్రవేశించడము.ఎంత అల్పుడయినా ఈపని నేను చేయవలసినది, ఇది నా విధి కృత్యము అని ఎప్పుడయితే తలుస్తాడో అప్పుడు ఆ పనిని మిక్కిలి శ్రద్ధతోను ప్రయత్నముతోనూ చేస్తాడు అని అర్థము.
ఎవరైనా సరే తమకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కష్టం అనిపించదు. ఆ పనిలో నిమగ్నమయ్యాక సమయాన్ని కూడా పట్టించుకోవడం ఉండదు.అంటే ఎంత కాలమనేది తెలియదు.ఎప్పుడైతే ఒక వ్యక్తి తనకు నచ్చిన పనిని అది తన బాధ్యత అని మనసులో తలుస్తాడో ఆ పని పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తాడు.
దీనిని బట్టి మనిషికి శ్రద్ధ అనేది ఉండాలి.చేయాలనే తపన ఉండాలే కాని ఏదైనా సాధ్యమే. అయితే చేసే పని పట్ల అంకితభావం మరియు నిబద్ధత ఉండాలి.
అంకిత భావం అంటే ఒక పని లేదా లక్ష్యం పట్ల విధేయత కలిగి వ్యక్తిగతంగా కృషి చేస్తూ, అవసరమైతే త్యాగానికి సిద్ధపడటం.ఇక నిబద్ధత అంటే చేసే పనిని విధిగా , బాధ్యతగా చేయడం.నేనే చేయాలి నేను తప్ప ఇంకెవరూ చేయకూడదనే భావన కలిగి వుండటం.
ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏదైనా కష్టం అనిపించదు.అందుకే ఈ లక్షణాలతో కష్టపడి పని చేస్తే మంచి ఫలితం లభిస్తుంది.అందుకే మన పెద్దలు "కష్టేఫలి" అన్నారు .
స్వశక్తితో కష్టపడితే దైవ సహాయం లభిస్తుందని ఆధ్యాత్మిక వాదులు అంటుంటారు. దానికి సంబంధించిన ఓ కథ కూడా చెబుతుంటారు.ఆ రోజుల్లో ఒకానొక భక్తుడు తన ఎడ్లబండిలో ప్రయాణం చేస్తూ వుంటే ఒక పెద్ద బురద గుంటలో బండి కూరుకుపోయింది . హే భగవాన్! నా బండి బయటకు వచ్చేలా చూడు అని దేవుడికి మొరపెట్టుకున్నాడు.ఎలాంటి ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని తనే ఆ బురదలోకి దిగి బండి చక్రాన్ని గట్టిగా పట్టుకొని బయటకు నెట్టడంతో బండి గుంటలోంచి బయటికి వస్తుంది.ఉన్నాడా? అసలున్నాడా? భక్తుని బాధ పట్టించుకోకపోతే ఎలా? అని దేవుని పట్ల అనుమానం వ్యక్తం చేస్తూ వుండగా "అశరీరవాణి పలికింది. "ఓరీ! పిచ్చివాడా! నేను సహాయం చేస్తేనే నీ బండి చక్రం బయటకు వచ్చింది.నువ్వు నీ స్వశక్తిని నమ్ముకుని పనిని మొదలు పెట్టగానే నేను నా చేయి కూడా కలిపాను.అందుకే బండి చక్రం బయటకు వచ్చింది.అని చెప్పడంతో ఆ భక్తుడికి భగవంతుని పట్ల మరింత భక్తి శ్రద్ధలు పెరిగాయి.
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా ఒక లక్ష్యం సాధించడానికి ఇష్టంగా కష్టపడాలి.కష్టాన్ని ఇష్టపడాలి.అప్పుడే అనుకున్న సాధనకు అడుగు ముందుకు పడుతుంది.
ఓ కవి గారు "కృషి వుంటే మనుషులు ఋషులవుతారు-మహా పురుషులవుతారు" అనే గొప్ప పాటను రాశారు.అది సదా గమనంలో ఉంచుకోవాలి.
మొత్తంగా ఈ "అణురపి విశేషోధ్యవసాయకర న్యాయము"ను నిశితంగా పరిశీలిస్తే ముఖ్యంగా 1.చేసే పనిని స్వంతం చేసుకోవడం అంటే ఇది ఖచ్చితంగా నేనే చేయాలి అనుకోవడం.2. నేనే చేయాలి కాబట్టి దానిపట్ల ఇష్టాన్ని పెంచుకోవడం. 3. ఆ పనికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని అంకిత భావంతో నిబద్ధత కలిగి చేయడం...ఈమూడు విషయాలు మనం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఇలా శ్రమ ఆయుధం అయితే విజయం వినమ్రంగా వరిస్తుంది.దీనికి చిన్నా పెద్దా వయసు తేడా లేదు.మనం చిన్నప్పుడు చదువుకున్న "చీమ- మిడత కథను దీనికి మరో ఉదాహరణగా చెప్పవచ్చు.ఇదండీ!"అణురపి విశేషోధ్యవసాయకర న్యాయము"లోని అంతరార్థము.దీనిని అనుసరిద్దాం.అనుకున్నది సాధిద్దాం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి