సమయం విలువ : సరికొండ శ్రీనివాసరాజు

 వేసవి సెలవులు వచ్చాయి.పిల్లలు అందరూ తమ తల్లిదండ్రులతో అమ్మమ్మ ఇళ్ళకు చేరుకున్నారు. ఎంతో సరదాగా తనివి తీరా ఆటలు ఆడుకోవచ్చు అని వాసు అనుకున్నాడు. ఉత్సాహంగా అమ్మమ్మ ఇంటికి చేరారు అందరూ. కానీ ఆ తర్వాత వాసు ఆనందం ఆవిరి అయ్యింది. సమయం అంతా టీవీలు, మొబైల్ ఫోన్లకు అతుక్కు పోవడమే సరిపోయింది మిగతా పిల్లలకు. ఆడుకుందామంటే ఎవరూ రావడం లేదు. 
      దీనికి తోడు సాయంత్రం నుంచి రాత్రి దాకా క్రికెట్ చూడటానికి టీవీలకు అతుక్కు పోతారు. క్రికెట్ అయిపోయాక ఒకరిద్దరికి సంతోషం, మిగతా వారికి తీవ్ర విచారం. ప్రతి రోజూ ఇదే పరిస్థితి. క్రికెట్లో ఇండియా గెలిస్తే ఇంటిల్లి పాదీ ఆనందిస్తాం. ఓడిపోతే అందరమూ నిరాశ పడతాం. మరి ఇవేమి ఆటలో, వేసవిలో సరదాగా అందరూ కలసి హాయిగా ఆడే ఆటలు వదలి పెట్టి, ఇలాంటి వాటితో విలువైన సమయాన్ని వృథా చేయడం అవసరమా అనిపించింది.
     వేరే ఊరిలో ఉన్న తన మిత్రుడు రాముతో తన బాధను చెప్పుకున్నాడు వాసు. ఇద్దరూ ఒక పందెం వేసుకున్నారు. తీరిక సమయాన్ని వృథా చేయకుండా శ్రావ్యంగా పాటలు పాడటం, అందంగా బొమ్మలు వేయడం ప్రతిరోజూ అభ్యాసం చేసారు. తెల్ల కాగితాలు, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ తీసుకుని అందంగా అనుకున్న బొమ్మలను గీయడం అభ్యాసం చేశాడు. ఒక సెల్ ఫోన్ తీసుకుని, అందులో భక్తి మరియు చక్కని భావం ఉన్న పాటలు, మంచి సందేశాత్మక గీతాలు వింటూ వాటితో తన గొంతు కలుపుతూ శ్రావ్యంగా పాడటం సాధన చేశాడు. సెలవులు పూర్తి అయ్యేసరికి ఇద్దరూ అద్భుతమైన గాయకులు మరియు చిత్రకారులు అయ్యారు. 
      పాఠశాలలు ప్రారంభం అయ్యాక స్వాతంత్య్ర దినోత్సవం, బాలల దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవ సందర్భాలలో పాటల పోటీల్లో, డ్రాయింగ్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ బహుమతులు గెలుచుకుంటున్నారు.అందుకే సమయాన్ని వృథా చేయకుండా ఏమైనా కొత్త విషయాలు నేర్చుకుంటే మంచి పేరు తెచ్చుకొవచ్చు.

కామెంట్‌లు