సునంద భాషితం:- వురిమళ్ల సునంద ఖమ్మం
 న్యాయములు-769
అంధ గోలాంగూల న్యాయము
****
అంధ అనగా  గుడ్డితనము.గోలాంగూలము అనగా పొడవాటి తోక వున్న నల్లని మూతి  కలిగిన కలిగిన కొండ ముచ్చు , ఆవు తోక.
"గ్రుడ్డితనం ఉన్న వ్యక్తి ఆవుతోక పట్టుకొని నడిచినట్లు" అని అర్థము.
ఈ న్యాయమును చూసినప్పుడు కళ్ళు కనబడని వ్యక్తికి ఆవుతోక ఎలా చిక్కింది? దానిని పట్టుకొని ఎలా నడిచాడు? అనే సందేహం మనలో తప్పకుండా వస్తుంది కదా! మరి అది ఎలా జరిగిందో చూద్దామా!
 ఒకానొక వ్యక్తి ఒంటినిండా ఆభరణాలు ధరించి తన బంధువుల ఊరికి వెళుతున్నాడు.ఆనాటి రోజుల్లో ఇప్పటిలా రవాణా సౌకర్యాలు ఉండేవి కావు కదా! అందులోనూ ఊరికి  ఊరికి మధ్యలో చిన్నదో పెద్దదో అడవి ఉండేది. అందులోంచి నడిచి వెళ్ళాల్సి వచ్చేది.
అలా అతడు అడవిలో నడిచి వెళుతూ అడవి మధ్యకు వెళ్ళేసరికి దారి కనిపించలేదు. ఎటుపోవాలో తోచక దుఃఖిస్తూ ఉన్న సమయంలో ఒక దొంగ అతడిని చూశాడు. ఎందుకు ఏడుస్తున్నావని కారణం అడిగితే అతడా దొంగకు తన వృత్తాంతం అంతా చెప్పాడు. అసలే అడిగిన వాడు దొంగ అందులోనూ చెప్పిన వాడి ఒంటినిండా నగలు ఇంకేముంది వాటిని అపహరించేందుకు నిశ్చయించుకుని "అయ్యో! ఎందుకు బెంగ పెట్టుకొంటావు?నాతో రా.నీకు మీ బందువుల ఊరికి దారి చూపిస్తాను అని ఎంతో నమ్మకం కలిగేలా చెప్పాడు.
ఆ వ్యక్తి దొంగను నమ్మి వాని వెంట పోయాడు.అయితే ఆ దొంగ ఇతడిని మరింత దట్టమైన అడవిలోకి తీసుకుని వెళ్లి అతడి కళ్ళలో బూడిద చల్లి గుడ్డి వాడిగా చేసి ఒంటి మీది ఆభరణాలన్నీ ఒలుచుకున్నాడు. అంతటితో ఆగకుండా ఒక ఆవుతోకను తీసుకుని వచ్చి దాని తోకను చేతికి ఇచ్చి "ఇది పట్టుకో. ఈ ఆవు ఎటు తీసుకుని పోతే అటు ఆ దారి వెంట వెళ్ళు.అది మీ బందువుల ఊరికి తీసుకుని పోతుంది." అని చెప్పాడు. "కళ్ళలో బూడిద పోసినా దారైతే చూపుతున్నాడులే అనుకుంటూ  ఆవుతోకను విడువకుండా పట్టుకున్నాడు.ఆ ఆవు అతడిని ముండ్లలోకి,,తుప్పల్లోకి ఈడ్చుకుంటూ పోయినది.
ఆభరణాలను ధరించి ఒంటరిగా ప్రయాణం చేయడం ఆ వ్యక్తి చేసిన మొదటి పొరపాటు. అనామకులు లేదా అపరిచితులను నమ్మడం రెండవ పొరపాటు.ఇక ఆవు తోకను  పట్టుకోవడం ముచ్చటా మూడో పొరపాటు.
ఈ అంధ గోలాంగూల న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ప్రాణానికి ముప్పు తెచ్చే సొమ్ములను ధరించకూడదు.అతడి ఒంటిమీద విలువైన నగలు లేకపోతే ఎలాంటి యిబ్బంది ఉండేది కాదు.గుణగణాలు తెలియకుండా వ్యక్తులను నమ్మకూడదు.మొత్తంగా ఏదైనా నిర్ణయించుకునేటప్పుడు పూర్వాపరాలు ఆలోచించాలి అనేది అర్థమై పోయింది.తెలియని వాళ్ళను గుడ్డిగా నమ్మకూడదని తెలుసుకున్నాం.ఇదండీ!మన పెద్దవాళ్ళు "అంధ గోలాంగూల న్యాయము" ను ఉదాహరణగా చెప్పడంలోని అసలైన అంతరార్థం.కాబట్టి ఈ మూడు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉందాం.అంతే కదండీ!

కామెంట్‌లు