సునంద భాషితం :- వురిమళ్ల సునంద ఖమ్మం

 న్యాయములు-772
ఇందుక్ష్వేడ న్యాయము
****
ఇందు అనగా చంద్రుడు,ఒక్కటి అనే అర్థాలున్నాయి.క్ష్వేడ అనగా ధ్వని, విషము, వెదురు,సింహ గర్జనము అనే అర్థాలు ఉన్నాయి.
ఇందుక్ష్వేడ అనగా  చంద్రుడు మరియు విషము.మరి ఈ చంద్రుడు మరియు విషం గురించి మన పెద్దలు ఎందుకు?ఎవరికి? అన్వయించి చెప్పారో చూద్దాం.
ఈశ్వరుడు చంద్రుని, విషమును గ్రహించిననూ చంద్రుని తలపైనా, విషమును కంఠమందున ధరించాడు.
 అలాగే బుద్ధిమంతుడు గుణదోషములను రెంటినీ గ్రహించి గుణములను వెలువరిస్తాడు.దోషములను అణచి వేస్తాడు అనే అర్థంతో ఈ" ఇందుక్ష్వేడ న్యాయము"ను మానవులకు అన్వయించి ఉదాహరణగా చెప్పారన్న మాట.
ఇంద్రుడు, విషము అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శివుడు. చంద్రున్నేమో సిగలో పెట్టుకొని, విషమునేమో కంఠములో దాచుకున్న శివుడి గురించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం.అవి తెలుసుకోవాలంటే మనం తప్పకుండా క్షీర సాగర మథనం గురించి తెలుసుకోవాల్సిందే.
రామాయణ,భారత, భాగవత, పురాణేతిహాసాలలో క్షీర సాగర మథనం గురించిన ప్రస్తావన ఉంది.
రాక్షసులు , దేవతలు కలిసి క్షీరసాగరాన్ని  మథించినప్పుడు కామధేనువు, కల్పవృక్షం, ఐరావతం, లక్ష్మీదేవి, పారిజాత వృక్షం మొదలైనవి ఎన్నో పుట్టాయనీ,ఆ తర్వాత కాలకూట విషమైన హాలాహలం, చంద్రుడు పుట్టాయనీ చిట్ట చివరిగా అమృతం ఉద్భవించిందని క్షీరసాగర మథనం గురించి చదివిన వారందరికీ తెలిసిందే.
 అయితే క్షీర సాగర మథనంలో వెలికి వచ్చిన హాలాహలం లేదా కాలకూట విషము/ గరళము దేవతలనూ, రాక్షసులను  భయకంపితులను  చేసింది.
దానిని ఏం చేయాలి? అది ఎక్కడ వున్నా మహా ప్రమాదము.అది సేవించిన వారు ఎవ్వరూ బతకరు.అందుకే వారంతా భయపడిపోతుండగా శివుడు ఆ గరళాన్ని స్వీకరించి కంఠంలో బంధించాడు.మరి శివుడు మరణించడా? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. శివుడు ఓ నిరాకార శక్తి స్వరూపుడు.అతనిలోనే ఈ లోకమంతా వుంది.కంఠం దాటి వెళ్తే ఈ లోకం లయమవుతుంది.అందుకే ఈశ్వరుడు అలా విషాన్ని కంఠంలోనే బంధించాడు.అలా గొంతు ప్రాంతం నీలంగా మారిపోయిందట. అందుకని శివుడిని నీలకంఠుడు,గరళ కంఠుడు అంటారు.
 ఇక చంద్రుడు శివుని తలపై శిగలో చేరడానికి గల కారణం కూడా తెలుసుకుందాం.
 దక్షుడు అనే రాజు తన 27 మంది కుమార్తెలను ఇంద్రునికి ఇచ్చి వివాహం చేస్తూ అందరిపై సమానమైన ప్రేమను పంచాలని చెబుతాడు.( ఆ 27 మందినే అశ్విని, భరణి కృత్తిక, రోహిణి.. ఇలా 27 నక్షత్రాలుగా పంచాంగ కర్తలు పిలుస్తుంటారు.)
 ఐతే మొదట్లో దక్షుడు చెప్పినట్లుగానే అందరికీ సమానమైన ప్రేమ పంచుతూ వున్న చంద్రుడికి కొంత కాలానికి వారిలోని రోహిణి అంటే ఎక్కువ ప్రేమానురాగాలు కలిగాయట. అది గమనించిన దక్షుని  మిగతా కుమార్తెలు తండ్రికి చంద్రుని విషయం  చెబుతారు. అది తెలిసిన దక్షుడు కోపంతో చంద్రుడి శపిస్తాడు. ఆ శాప ఫలితంగా చంద్రుడు  రోజు రోజుకూ క్షీణించి పోసాగాడు.
అలాంటి పరిస్థితికి  దుఃఖిస్తూ శివుడికి  విషయం చెబుతాడు. అది విన్న భోళా శంకరుడు జాలితో కరిగిపోతాడు."దక్షుని శాప ప్రకారం ఒక  పక్షం క్షీణించక తప్పదు కానీ మరుసటి పక్షంలో క్రమంగా వెలుగు పెరుగుతుందని అభయమిస్తాడు." ఆ విధంగా శివుని దగ్గరగా వుంటే  మేలని చంద్రుడు అనుకోవడంతో,శివుడు అతడిని తన శిగలో  దాల్చుకున్నాడట.
ఈ విధంగా  చల్లని వెన్నెల పంచే చంద్రుడిని, ప్రాణాలకు ముప్పయ్యే విషాన్ని శివుడు గ్రహించాడన్న మాట.
 చంద్రుని వెన్నెల చల్లదనం , హాయి, ఆనందం అందరికీ అవసరం కాబట్టి  తలపై ధరించాడు.అంటే ఇందులో పరోపకారం యిమిడి వుంది.ఇక విషం ప్రమాదం కాబట్టి గొంతులో బంధించాడు.ఇందులో త్యాగభావము వుంది.
 అదే విధంగా బుద్దిమంతుడైన, గుణవంతుడైన వ్యక్తి కూడా విషం లాంటి బాధలను, కష్టాలను ఎవరికీ తెలియకుండా మనసులోనే దాచుకుంటాడు.ఇక  పరుల మంచి కోసం, లోక కళ్యాణం కోసం తపిస్తూ  త్యాగంతో కూడిన అనేకమైన మంచి పనులు చేస్తాడు.
అందుకే మన పెద్దలు శివుడితో బుద్ధిమంతుడిని పోల్చడంలో  వున్న అంతరార్థం ఇదే. మంచి మనిషికి "ఇందుక్ష్వేడ న్యాయము"ను అన్వయించి చెప్పారని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా సరదాగా మన కవుల గురించి కూడా చెప్పుకుందాం.ప్రముఖ రచయిత చలం గారు  మన బాధను కృష్ణ శాస్త్రిగారు, శ్రీ శ్రీ గారి కవిత్వం గురించి చెబుతూ "ప్రపంచపు బాధ శ్రీ శ్రీ బాధ", కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ" అన్నారు.శ్రీశ్రీ గారిలా ప్రపంచ బాధను మన బాధగా స్వీకరించి, దానిని  తొలగించేందుకు  పరమ శివుడిని స్ఫూర్తిగా  తీసుకుందాం.
పరోపకారమే పరమార్థమని తన ఉనికితో, చర్యలతో తెలియజేసిన భోళా శంకరుడి కరుణా కటాక్ష వీక్షణాల సాక్షిగా సమాజ శ్రేయస్సుకు మన వంతుగా  పాటు పడదాం.

కామెంట్‌లు